Spirituality: శివుడిని నేరుగా దర్శించుకోకూడదా!
Shiva : ఏ ఆలయానికి వెళ్లినా నేరుగా గర్భగుడిలో కొలువైన స్వామి-అమ్మవార్లను దర్శించకుంటాం. కానీ..శివాలయానికి వెళితే మాత్రం నంది కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు...ఎందుకలా!
Spirituality: శివాలయంలోకి వెళ్లగానే శంకరుడి కన్నా ముందు ధ్వజస్తంభం ఆ తర్వాత నంది కనిపిస్తాయి. నంది కొమ్ముల మధ్యలోంచి భోళాశంకరుడిని దర్శించుకుంటారు. అందరి దేవుళ్లను నేరుగా దర్శనం చేసుకుంటాం కదా..మరి పరమేశ్వరుడిని మాత్రం నంది కొమ్ముల మధ్యలోంచి ఎందుకు దర్శించుకోవాలి? దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి?
గోమాత భూమికి ప్రతిరూపం
వృషభం ధర్మానికి మరోరూపం
ధర్మానికి 4 పాదాలుంటాయి...అవే సత్యం, తపస్సు, శౌచం, నియమం...
సత్యం అంటే మనసు, ఆలోచన, దృష్టి, చేసేపని సత్యంతో నిండి ఉండడం
శౌచం అంటే మనసు, ఆలోచన, దృష్టి, చేసేపనిలో పవిత్రత నిండి ఉండడం
తపస్సు అంటే ఏ విషయంలో అయినా ఏకాగ్రతతో ఉండడం
నియమం అంటే..పద్ధతి తప్పకపోవడం...
వీటికి స్వరూపం నందీశ్వర రూపం...అందుకే మనిషిలో ఉండే పశుతత్వాన్ని తొలగించి..ఈ నాలుగు పాదాల్లో నడిచేలా దీవించమని ఆ శంకరుడిని వేడుకోవడమే నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి చేసే నమస్కారం. కొమ్ములు పట్టుకుని వెనుక తోకపై చేయి పెట్టి ఆ భగవంతుడిని దర్శించుకుంటూ.. స్వామీ నా పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను అని మాటివ్వడమే.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
లింగ రూపంలో ఉన్న శంకరుడి రూపం నందీశ్వరుడి కొమ్ముల మధ్యనుంచి సంపూర్ణంగా దర్శనమిస్తుంది. ఆ దర్శన సమయంలోనే నందీశ్వరుడి చెవిలో...చెప్పుకుంటే ఆ కోర్కె శివుడి చెంతకు చేరి తీరుతుందని భక్తులవిశ్వాసం. శంభుడు త్రినేత్రుడు అయినందున నేరుగా దర్శించుకోకూడదని..అందుకే శివుడికి పరమ భక్తుడైన నంది ద్వారా దర్శనం చేసుకుంటారని కూడా చెబుతారు. దీనినే శృంగ దర్శనం అనికూడా అంటారు. పైగా నందీశ్వరుడి కొమ్ముల మధ్యనుంచి పరమేశ్వరుడిని దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శివపురాణం పేర్కొంది..
Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!
అసలు నందీశ్వరుడు భూలోకానికి ఎలా వచ్చాడంటే!
ప్రజలంతా భగవంతుడిపై పూర్తి భక్తితో ఉండేవారు. ఆ భక్తిని చూసి కైలాశంలో ఉన్న శివయ్య మురిసిపోయాడు. ఆ సమయంలో నందీశ్వరుడిని పిలిచి ఓ సందేశం చెప్పి ప్రజలకు చెప్పి రమ్మని భూలోకానికి పంపించాడు. ప్రతి రోజూ తలకు స్నానం చేయాలి - వారానికి ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలన్నదే ఆ సందేశం. సరే అన్న నంది భూలోకానికి వెళ్లాడు. అక్కడ ప్రజల భక్తి, సందడి చూసి తాను ఏపనిపై భూలోకానికి వచ్చాడో మరిచిపోయాడు. కొద్ది రోజులు విహరించిన తర్వాత అసలు విషయం గుర్తొచ్చి..ప్రజలకు చెప్పేసి కైలాశానికి వెళ్లిపోయాడు. స్వామీ మీరు చెప్పిన పని విజయవంతంగా పూర్తి చేశానన్నాడు. ఇంతకీ ఏం చెప్పావని శంకరుడు అడిగితే... నిత్యం భోజనం చేసి వారానికోసారి తలకు స్నానం చేయమని చెప్పానన్నాడు...అంటే రివర్స్ లో చెప్పాడన్నమాట. ఆ మాట విన్న శివుడు...నిత్యం భోజనం అంటే ఎంతో పంట అవసరం అవుతుంది ఆ పంటను నువ్వే పండించు అని శిక్ష విధించాడు. అలా మనకు ఆహారాన్ని అందివ్వడంతో బసవన్న భాగమయ్యాడు. ఎద్దులా మారి దుక్కు దున్నినప్పటి నుంచి పంట చేతికందేవరకూ కష్టపడుతున్నాడు.
Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు