Spirituality: లోకంలో భార్య-భర్తలు 5 రకాలు- మీ జంట ఇందులో ఏ రకమో చూసుకోండి!
Spirituality: పంచదంపతులు..ఈ మాట విన్నారా.. పంచ అంటే ఐదు, దంపతులు అంటే జంట. ఈ లోకంలో కోట్లాది జంటలున్నా అంతా ఈ 5 రకాలుగానే ఉంటారు. ఇంతకీ ఎవరా 5జంటలు..మీరు ఇందులో ఏ రకానికి చెందుతారో తెలుసుకోండి...
Spirituality: ఎన్నో జంటల్ని చూస్తుంటాం..కొందరు జీవితాన్ని ఆస్వాదిస్తే ఇంకొందరు నిత్యం కొట్టుకుంటూ ఉంటారు, మరికొన్ని జంటల్లో భార్య డామినేట్ చేస్తుంది లేదంటే భర్త డామినేట్ చేస్తుంటాడు. ఇలా రకరకాల జంటల్ని చూస్తుంటారు. అయితే ఈ లోకంలో ఎన్ని జంటలున్నా వాళ్ల సంసారం, మనస్తత్వం మాత్రం ఈ ఐదు జంటల్లో ఎవరో ఒకరిలా కచ్చితంగా ఉంటుందని చెబుతారు పండితులు. ఎవరా ఐదు జంటలు..ఇందులో మీరు ఏ కోవకు చెందుతారో ఇక్కడ తెలుసుకోండి
లక్ష్మీనారాయణులు
పంచదంపతుల్లో మొదటి జంట శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. శ్రీహరి వక్షస్థలం మీద నివాసం ఉంటుంది లక్ష్మీదేవి. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి...అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై..ఆలోచన కూడా ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..ఆ జంటను లక్ష్మీనారాయణులతో పోల్చుతారు.
Also Read: పెళ్లిలో సుముహూర్తం అంటే ఏంటి - జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు!
గౌరీ శంకరులు
అర్థనారీశ్వర తత్వం ద్వారా భార్య తనలో సగం అని చాటిచెప్పాడు పరమేశ్వరుడు. తలనుంచి కాలిబొటన వ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు. శరీరాలు రెండు కలసినా ఒకేరూపంలో కనిపిస్తారు. తల ఆలోచనలకు, కాళ్లు కార్యనిర్వహణకు సంకేతం. అందుకే భార్యను గొప్పగా చూసుకునే భర్తకు ఆలోచన, ఆచరణ రెండింటిలోనూ భార్య నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఇలా కష్టసుఖాల్లో తోడునీడగా ఉండేవారిని గౌరీశంకరులతో పోల్చుతారు.
బ్రహ్మ-సరస్వతి
చతుర్ముఖుడైన బ్రహ్మ నాలుకమీద ఉంటుంది. నాలుక మాటలకు సంకేతం. అంటే ఇద్దరి మాటా ఒక్కటే అని అర్థం. తనమాటే నామాట అంటారు కదా..దాని అర్థం ఇదే. ఇద్దరూ కలసి ఆలోచించినా విడివిడిగా ఆలోచించినా ఒకే మాటని వ్యక్తపరచడం. ఇలా ఉండే జంటల్ని సరస్వతి-బ్రహ్మ జంట అంటారు.
Also Read: పుట్టినప్పటి నుంచి పోయేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు ఇవే!
ఛాయా సూర్యులు
సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు. అంత తీక్షణతను కూడా తట్టుకుంటూ భర్తతో సాగుతుంది ఛాయాదేవి. ఎందుకంటే తన భర్త లోకోపకారంకోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు..భర్త పరిస్థితికి అనుగుణంగా నీడలా సాగుతూ సర్దుకుపోతుంది ఛాయాదేవి. ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా ,పట్టుదలతో ఉంటాడో...ఆ ఇంట భార్యమాత్రం నెమ్మదిగా, శాంతంగా, అణకువగా ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.
రోహిణీ చంద్రులు
పంచదంపతుల్లో ఐదో జంట రోహిణి-చంద్రుడు. రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది అంటే వేడి అంతలా ఉంటుంది. చంద్రుడు మాత్రం ఆహ్లాదాన్ని ఆకర్షణను కలుగజేసేవాడు. ఏ జంటలో భర్త సైలెంట్ గా ఉండి ఆకర్షణీయుడిగా ఉంటాడో ఆ ఇంట భార్య మాత్రం కఠినంగా, కోపంగా, అధిక పట్టుదలతో ఉంటే ఆ జంటను రోహిణి చంద్రులతో పోలుస్తారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.