Sawan 2023: ఆగష్టు 17 నుంచి నిజ శ్రావణం, మొదటి 15 రోజుల్లో వచ్చే పండుగలివే!
ఈ సారి శ్రావణమాసం అధికం వచ్చింది. అంటే శ్రావణం రెండు నెలల పాటు ఉంటుంది. మొదట అధికమాసం వస్తుంది అది పూర్తైన తర్వాత నిజమాసం వస్తుంది. మరి ఈ ఏడాది శ్రావణమాసంలో ఏఏ తేదీల్లో ఏ పండుగలు వచ్చాయో చూద్దాం..
Sawan 2023: తెలుగు పంచాంగం ప్రకారం జూలై 18వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలైంది. ఈ సంవత్సరం అధికమాసం కావడం వల్ల మొదట వచ్చేది అధిక శ్రావణమాసం అంటారు. నిజ శ్రావణమాసం ఆగస్టు 17 గురువారం నుంచి మొదలై సెప్టెంబరు 15 శుక్రవారం వరకూ ఉంటుంది. దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే. ప్రాచీన భారతీయ విద్యా విధానంలో అధ్యయన పక్రియ శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యేది. ఈ ఏడాది శ్రావణంలో వచ్చే పండుగలు ఏఏ తేదీల్లో వచ్చాయో చూద్దాం.
ఆగష్టు 17 శ్రావణ శుద్ధ పాడ్యమి
ఈ తిథి నుంచి శుక్ల పక్షం ఆరంభ మవుతుంది. శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే పదిహేను రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఈ రోజుల్లో పవిత్రారోపణం చేస్తారు. దర్భలతో చేసిన తోరాలను దేవతలకు అర్పించడాన్నే పవిత్రారోపణోత్సవం అంటారు.
శ్రావణ శుద్ధ విదియ
శ్రావణ శుద్ధ విదియ తిథి ‘శ్రియఃపవిత్రా రోపణం’ అని స్మతి కౌస్తుభంలో ఉంది. దీనినే ‘మనోరథ ద్వితీయ’ అంటారు. ఈ రోజు పగలు వాసుదేవుడిని అర్చించి, రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనం చేయాలని చెబుతారు.
శ్రావణ శుద్ధ తదియ
ఈరోజు మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరించాలని కృత్యసార సముచ్చయము అనే గ్రంథంలో ప్రస్తావించారు
Also Read: జూలై 18 నుంచి అధిక శ్రావణం ప్రారంభం, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!
ఆగష్టు 20 శ్రావణ శుద్ధ చవితి
శ్రావణశుద్ధ చవితి రోజున రాయలసీమలో నాగులచవితి జరుపుకుంటారు. ఈ తిథి విఘ్న పూజకు అత్యుత్తమైనదని గ్రంధాల్లో పేర్కొన్నారు.
ఆగష్టు 21 శ్రావణ శుద్ధ పంచమి - గరుడ పంచమి
శ్రావణ శుద్ధ పంచమిని కొన్ని వ్రత గ్రంథాలు నాగ పంచమిగా పేర్కొంటున్నాయి. ఈరోజు ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజిస్తారు. నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు ‘హేమాద్రి ప్రభాస ఖండం’లో ఉంది. నాగపంచమి రోజు భూమి దున్నకూడదని అంటారు. అయితే నాగపంచమని విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన ఆచారాలు ఉన్నాయి. తెలంగాణలో శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజు నాగులను పూజిస్తే ఆంధ్రప్రదేశ్ లో కార్తీమాసంలో వచ్చే చవితి రోజున పూజిస్తారు.
శ్రావణ శుద్ధ షష్ఠి
ఈ రోజున శివుడిని పూజిస్తారు
Also Read: ఈ 3 రాశుల్లో జన్మించినవారి జాతకంలో రాజయోగం, అపారమైన సంపద పొందుతారు!
శ్రావణ శుద్ధ సప్తమి
శ్రావణ శుద్ధ సప్తమి రోజు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలని చెబుతారు. ఇది సూర్యారాధనకు సంబంధించినది.
శ్రావణ శుద్ధ అష్టమి
దుర్గాపూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూలమైనదని పండితులు చెబుతారు. అయితే శ్రావణ శుద్ధ అష్టమి రోజు దుర్గా పూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అని కూడా అంటారు.
ఆగష్టు 25 శ్రావణ శుద్ధ నవమి - వరలక్ష్మీ వ్రతం
ముత్తైదువులు వరలక్ష్మీ దేవిని భక్తి,శక్తి కొద్దీ పూజించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, సౌభాగ్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటారు.
శ్రావణ శుద్ధ దశమి
శ్రావణ శుద్ధ దశమిని ఆశా దశమి అంటారు. ఈరోజు చేసే వ్రతాచరణ వల్ల ఆశలు నెరవేరు తాయని ప్రతీతి. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యేది కూడా ఇప్పుడే…
శ్రావణ శుద్ధ ఏకాదశి
ఈ తిథిని పుత్ర ఏకాదశిగా పిలుస్తారు. మహిజిత్తు అనే రాజు శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఆచరించిన వ్రతం ఫలితంగా పుత్ర సంతానం కలిగిందట. అందుకే పుత్ర ఏకాదశి అంటారని ప్రతీతి.
శ్రావణ శుద్ధ చతుర్దశి
ఈ తిథి రోజు శివుడికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి. కాబట్టి లింగవ్యాసం అంత కానీ, దాని ఎత్తు అంత కానీ లేక 12-8-4 అంగుళాల మేరకు కానీ పొడవు ఉండి, ముడి ముడికి మధ్య సమ దూరం ఉండి, ఆ ఖాళీలు 50, 38, 21 ఉండేలా పవిత్రాలు (దర్భలు) వేయాలి. ఈ పక్రియనే ‘శివ పవిత్రం’ అంటారు.
ఆగస్టు 31-శ్రావణ పౌర్ణమి
రుతువులను అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే- శ్రావణ పూర్ణిమ. ఈ రోజు హయగ్రీవ జయంతి. ప్రస్తుతం ఈ తిథి రాఖీ పూర్ణిమగానే ఎక్కువమందికి తెలుసు. రక్షాబంధన్ పేరుతో ఘనంగా నిర్వహించుకుంటారు ఈ వేడుక.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.