Seetha Ramula Kalyanam 2025: భద్రాచలంలో కన్నులపండువగా కల్యాణం ..మరి సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడుందో తెలుసా?
ఏప్రిల్ 6 ఆదివారం శ్రీరామనవమి...ఈ సందర్భంగా సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ఇంతరీ సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడుందో తెలుసా?

Seetha Ramula Kalyanam 2025
ఏటా శ్రీరామ నవమికి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం
ఏటా చైత్ర పౌర్ణమికి పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్టలో సీతారాముల పెళ్లి వేడుక
వాడవాడలా చలువ పందిళ్లు...ఊరూ వాడా సంబరం
చిన్న చిన్న ఆలయాల్లోనూ ప్రత్యేకపూజలు.. గ్రామాల్లో రాములోరి కల్యాణం
ఇంతకీ సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడ?
రామాయణం అంటే రాముడి కథ, రావణ వధ అని మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇందులో రామయ్య బాల్యం నుంచి వనవాసం , రావణ సంహారం పూర్తిచేసి తిరిగొచ్చి పట్టాభిషిక్తుడు అయ్యేవరకూ అడుగడుగూ అద్భుతమే. ప్రతి మలుపూ ఆసక్తికరమే. ఇలాంటి ఘట్టాల్లో ఒకటి సీతారాముల కల్యాణం. ఏటా శ్రీరామనవమి రోజు భద్రాచలంలో సీతారాముల కల్యాణం కన్నులపండులగా నిర్వహిస్తారు. ఒంటిమిట్టలో చైత్రమాసం పౌర్ణమి రోజు వెన్నెల వెలుగుల్లో కల్యాణం జరిపిస్తారు. వాడవాడలా చలువపందిళ్లు వేసి..రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందడంతా సరే.. ఇంతకీ సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడుంది?
అయోధ్యలో జన్మించాడు శ్రీరామచంద్రుడు - దశరథుడు మహారాజు
మిథిలానగరంలో జన్మించింది సీతమ్మ - రాముడి మామగారైన జనకుడు పాలించిన రాజ్యమే మిథిలా నగరం
బీహార్ నుంచి నేపాల్ వరకూ ఈ మిథిలా రాజ్యం ఉందని చెబుతారు. ఈ రాజ్యాన్నే విదేహ రాజ్యం అని కూడా పిలిచేవారు..అందుకే సీతమ్మను వైదేహి అంటారు. అప్పట్లో జనకుడు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్ పూర్ అని చెబుతారు. ఈ జనక్ పూర్ లోనే భూమిని దున్నుతుండగా సీతమ్మ తల్లి ఉద్భవించింది. రాముడితో వివాహం కూడా ఇక్కడే జరిగింది.
సీతాదేవి జన్మించిన ప్రదేశాన్ని కాలక్రమేణా మరిచిపోయారు. సుర్కిశోర్దాస్ అనే సన్యాసికి 1657లో ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించడంతో ఇక్కడి ప్రజలు మళ్లీ అప్పటి పరిస్థితులు గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు. ఆ చరిత్రకు చిహ్నంగా 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘జానకీ మందిర్’ పేరుతో ఓ ఆలయం నిర్మించారు. వేల గజాల విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో, పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో నిర్మించిన ఈ ఆలయానికి అప్పట్లో 9 లక్షల రూపాయలు ఖర్చయిందట. అందుకే ఈ ఆలయానికి ‘నౌ లాఖ్ మందిర్’ అంటారు. జానకీమందిర్ నిర్మించిన ప్రాంతంలోనే సీతాదేవి శివ ధనుస్సుని పూజించిందని స్థలపురాణం.
జానకీమందిరంలోని నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపం నిర్మించి ఉంటుంది. ఏటా ఏటా మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున ఇక్కడ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఆ రోజే సీతారాముల వివాహం జరిగిందని అక్కడి ప్రజల నమ్మకం..అయితే తెలుగువారు శ్రీరామనవమి రోజునే కల్యాణం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
నౌ లాఖ్ మందిర్ లో సోదరులు, భార్యతో సహా కొలువైన శ్రీరాముడిని దర్శించుకోవచ్చు. శ్రీరామనవమి, దసరా, సంక్రాంతి , వివాహ పంచమి సమయంలో భక్తజనం పోటెత్తుతారు. అంటే శ్రీరాముడి పెళ్లి జరిగిన ప్రదేశం జనక్ పురి. నేపాల్ వెళ్లిన శ్రీరామచంద్రుడి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. గతంలో నేపాల్ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయం గురించి అప్పుడు ప్రత్యేక చర్చ జరిగింది.
ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి,
తన్నో రామ ప్రచోదయాత్
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















