నైవేద్యం ఇలా సమర్పించండి, పూజ తప్పక ఫలిస్తుంది
మనలో చాలా మంది ప్రతి రోజూ దైవారాధన చేస్తారు. కష్టాలనుంచి బయట పడేయమని లేదా ఫలానా కోరిక తీర్చమని ఇవేవీ కాకపోతే తమ కోరిక తీర్చినందుకు గాను కృతజ్ఞతగా కూడా పూజలు చేస్తారు.
పూజలు రకరకాలుగా చేస్తారు. దైవాన్ని బట్టి, రకరకాల పదార్ధాలు దేవుడికి సమర్పించుకుంటారు. ఇలా దైవానికి సమర్పించే సమయంలో చాలా మంది తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తుంటారు. పూజా విధానం తెలియక లేదా పూజలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన లేక ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి. అసలు చాలా మందికి నైవేద్యం పెడుతున్నపుడు ఎలాంటి మంత్రం చెప్పాలో కూడా చాలా మందికి తెలియదు. వీటన్నింటికి ప్రత్యేక నింబంధనలు, పద్ధతులు, సంప్రదాయాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. ఈ పద్ధతులు, సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.
రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా భగవంతుడికి సమర్పిస్తుంటారు. ప్రతి దేవతకు ఒక ప్రత్యేక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందని మీకు తెలుసా? ఇలాంటి అవగాహన లేక తమకు అందుబాటులో ఉన్న వాటిని ప్రసాదంగా నైవేద్యం పెడుతుంటారు. అందువల్ల పూజలో లోపం జరిగి వారి పూజ ఫలించక పోవచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రత్యేకంగా నైవేద్యాలను సమర్పించాల్సి ఉంటుంది. ఏ దైవానికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలనే అవగాహనతో పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
- పాయసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రసాదంగా చెబుతారు. కనుక సెమ్యా లేదా బియ్యంతో పాలు ఉపయోగించి చేసే పాయసాన్ని విష్ణుమూర్తికి సమర్పించాలి. విష్ణువుకు తులసి దళాలు చాలా ఇష్టమైనవి. కనుక ఆయనకు వాటిని సమర్పించుకోవచ్చు. లక్ష్మీదేవికి కూడా ఈ ప్రసాదం ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు. లక్ష్మీ పూజలో కూడా వీటిని వినియోగించవచ్చు.
- ఉమ్మెత్తు, భాంగ్, పంచామృతాలు శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. వీటితోపాటు మిఠాయిలు ఏవైనా శివుడికి ఇష్టమైనవే. పార్వతికి పాయసం ఇష్టమైన పదార్థంగా చెబుతారు.
- దేవుడికి సమర్పించే నైవేద్యం కచ్చితంగా సాత్వికాహారమై ఉండాలి. అంతేకాదు శుభ్రమైన పదార్ధాలు తాజా పదార్థాలు అయి ఉండాలి. పూజకు ఉపక్రమించే ముందు వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ప్రధానం. దేవుడికి నైవేద్యం తయారు చెయ్యడానికి ముందు కచ్చితంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి.
- పాడైపోయిన పదార్థాలు పొరపాటున కూడా భగవంతుడికి సమర్పించకూడదు. దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుచి చూడకూడదు. దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని తప్పనిసరిగా ముందుగా తీసి ఉంచాలి. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత.. అది మిగతా భక్తులకు సమర్పించాలి.
- చాలా మందికి నైవేద్యం సమర్పించడానికి ఎలాంటి మంత్రం ఉచ్చరించాలి అనే విషయం తెలియదు. ప్రత్యేక మంత్రాన్ని నైవేద్య సమర్పించేందకు సూచించారు.
‘‘గోవింద తుభ్యమేవ్
గర్హన సుముఖో భూత్వ ప్రసిద పరమేశ్వర ’’ అనే మంత్రాన్ని చెప్పాలి.
ఓ భగవంతుడా నువ్వు నాకిచ్చిన ప్రతి వరాన్ని నేను నీకు సమర్పించుకుని నీ ప్రసాదంగా స్వీకరిస్తున్నాను, నేను అందించినవి స్వీకరించి నన్ను ఆశీర్వదించు అని అర్థం.
నైవేద్యం సమర్పించే ముందు తెలుసుకోవాల్సిన నియమాలు, పద్ధతులు తెలుసుకోని పూజ పూర్తి చేస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.
Also read : దెయ్యాలను నమ్మే దేశాలివే - అక్కడైతే చదువుకున్నవారు కూడా చేతబడులు చేస్తారట!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.