Pranahita Pushkaralu 2022: ఈ రోజు నుంచి ప్రాణహిత పుష్కరాలు, నాలుగు జిల్లాల్లో ఘాట్లు వివరాలివే
ప్రాణహిత నది పుష్కరాలు ఏప్రిల్ 13 నుంచి 12 రోజుల పాటు అంటే ఏప్రిల్ 24 వరకూ జరుగుతాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జరుగుతున్న మొదటి పుష్కరాలివే. ఘాట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే..
కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ప్రాణహిత కలిసి త్రివేణీ సంగమం కలయికతో ప్రాణహిత నది పుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వరకు ఎంతో ఘనంగా పుష్కరాలను నిర్వహించారు. ఇప్పటికే పుష్కర ఏర్పాట్లపై తెలంగాణ రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. జయశంకర్ జిల్లా కాళేశ్వరం దగ్గర భక్తులరద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీఐపీల తాకిడి కూడా ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: రాష్ట్రం విడిపోయాక తొలిసారి తెలంగాణలో ప్రాణహితకు పుష్కర శోభ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలో వేమనపల్లి మండల కేంద్రం, కోటపల్లి మండలంలో అర్జునగుట్ట వద్ద, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద, మహారాష్ట్రలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరఘాట్లను సిద్ధం చేశారు.
- తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్‌కు మరమ్మతులు పూర్తిచేశారు. పార్కింగ్ స్థలం వద్ద బారికేడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పిండప్రదానాల కోసం షెడ్లు, దుస్తులు మార్చుకునే గదులను సిద్ధం చేశారు.
- అర్జునగుట్ట వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, శ్రాద్ధ మండపాలు, కేశఖండన శాలలు, నదిలో ప్రమాదాలు జరగకుండా కంచె, చెన్నూరు నుంచి 20 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర వంతెన నుంచి అర్జునగుట్ట పుష్కరఘాట్ వరకు బైపాస్ రోడ్డు నిర్మించారు.
- కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద రెండు పుష్కరఘాట్లు సిద్ధం చేశారు. చలువపందిళ్లు, తాగునీరు, విద్యుత్తు, ఆలయం వద్ద క్యూలైన్లు సిద్ధం చేశారు. దుస్తులు మార్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు, మూడు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
-
ప్రాణహిత నదికి అవతలి వైపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో.. అక్కడి సర్కార్ ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లు చేసింది. అయితే పుష్కారాల కోసం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే ఉంది. నదిలో పుణ్య స్నానం ఆచరించిన భక్తులు.. కాళేశ్వర-ముక్తీశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
-
పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపుతోంది. కరీంనగర్ జోన్ పరిధిలోకి వచ్చే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్‌లలో ఈ సర్వీసులు ఉంటాయి. ప్రజలు సురక్షితంగా కాళేశ్వరం చేరుకోవడానికి ఆర్టీసీ కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
-
వరంగల్ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 200 బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాళేశ్వరం నుంచి పుష్కరఘాట్ వరకు 10 మినీ బస్సుల ద్వారా భక్తులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.
Also Read: ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు