Pitru Paksha 2025:పితృ పక్షం 2025 గ్రహణంతో ప్రారంభం, గ్రహణంతో ముగింపు! ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే చెడు ఫలితాలు తప్పవ్!
2025లో పితృ పక్షం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ సంవత్సరం, శ్రాద్ధంలో సూర్య మరియు చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. జాగ్రత్తలు తెలుసుకోండి.

Pitru Paksha 2025: పితృ పక్షం అంటే పితృదేవతలను స్మరించే సమయం. ఈ ఏడాది పితృ పక్షం 2025 సెప్టెంబర్ 7 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 21 న సమాప్తం అవుతుంది. ఈ సమయంలో పితృదేవతల ఆత్మశాంతికోసం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. తర్పణాలు విడుస్తారు. ఇది వారికి ఆనందాన్నిస్తుంది..కుటుంబంలో సంతోషానికి కారణం అవుతుందని నమ్మకం. పితృదేవతల అనుగ్రహం ఉంటే వశం వృద్ధి చెందుతుందని చెబుతారు. ఈ ఏడాది పితృపక్షంలో రెండు గ్రహణాలున్నాయి. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...
పితృ పక్షంలో 2 గ్రహణాలు
పితృ పక్షంలో జరిగే రెండు పెద్ద ఖగోళ సంఘటనలు 100 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. ఈ సంవత్సరం పితృపక్షం గ్రహణంతో మొదలై గ్రహణంతోనే ముగుస్తోంది.
పితృ పక్షంలో మొదటి గ్రహణం - సంపూర్ణ చంద్ర గ్రహణం
పితృ పక్ష చంద్ర గ్రహణం తో మొదలవుతుంది. సెప్టెంబర్ 7 ఆదివారం భారతీయ సమయానుసారం రాత్రి 9:58 నిమిషాలకు మొదలవుతుంది రాత్రి 1:26 నిమిషాలకు సమాప్తం అవుతుంది. ఈ సమయంలో కనిపించే చంద్రుడిని బ్లడ్ మూన్ అంటారు. ఈ చంద్ర గ్రహణం భారత్‌లో కనిపిస్తుంది. అందుకే గ్రహణ నియమాలు పాటించాలి
పితృ పక్షంలో రెండో గ్రహణం - సూర్య గ్రహణం
చంద్రగ్రహణంతో ప్రారంభమయ్యే పితృ పక్షం సూర్య గ్రహణంతో సమాప్తం అవుతుంది. సూర్య గ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడుతోంది. మనదేశంలో సమయం ప్రకారం సెప్టెంబర్ 21న ఏర్పడబోయే సూర్య గ్రహణం రాత్రి 10:59 నిమిషాల నుంచి మొదలై రాత్రి 3:23 నిమిషాల వరకు ఉంటుంది. ఇది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు. అందుకే గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.
పితృ పక్ష సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. 15 రోజుల పాటూ వారి తిథుల ప్రకారం తర్పణాలు విడుస్తారు. ఈ ఏడాది పితృ పక్ష భాద్రపద పౌర్ణమి రోజు చంద్రగ్రహణంతో మొదలై... మహాలయ అమావాస్య అయిన సెప్టెంబర్ 21న ముగుస్తుంది.
గ్రహణం సమయంలో సాధారణంగా ఆలయాలన్నీ మూసివేస్తారు. నియమాలను అనుసరించి ఆలయాలను మూసివేసి గ్రహణం ముగిసిన తర్వాత తిరిగి తెరిచి శుద్ధి చేస్తారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నివేదన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణానంతరం భక్తులు కూడా శుచిగా స్నానం ఆచరించి ఆలయాలను సందర్శిస్తారు. సాధారణంగా గ్రహణ స్నానం అందుబాటులో ఉన్న నదుల్లో చేస్తారు. లేదంటే నదీ జాలలను ఇంట్లో నీటిలో కలిపి స్నానమాచరిస్తారు. అనంతరం ఆలయాల్లో దాన ధర్మాలు చేస్తారు.
సాధారణంగా చంద్రగ్రహణ సూతక కాలం 9 గంటల ముందు మొదలవుతుంది. సూతక్ కాలం నుంచి గ్రహణం సమాప్తి వరకు కొన్ని పనులు చేయకూడదు. ఇలాంటి సమయం లో మందిరంలోకి వెళ్లకండి, భోజనం చేయకండి. గ్రహణం అయిపోయిన తర్వాత పితృదేవతలను స్మరించుకుంటూ దానం చేయండి. గ్రహణ సమయం ప్రారంభమైనప్పటి నుంచీ ముగిసేవరకూ గర్భిణులు ఇంట్లోంచి బయటకు రాకూడదు. గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే ఆ ప్రభావం పుట్టబోయే పిల్లలపై ఉంటుందని చెబుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించడం లేదు. ఈ సమాచారాన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















