Phalguna Masam 2024: ఇవాల్టి ( మార్చి 11) నుంచి ఫాల్గుణ మాసం - విశిష్టత, ఈ నెలలో పండుగలివే!
Festivals List In Phalguna Masam 2024: మార్చి 11 సోమవారం నుంచి ఏప్రిల్ 8 వరకూ ఫాల్గుణమాసం. ఈ నెలలో ధానధర్మాలు, ఉపవాసాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెలలో వచ్చే పండుగలు తెలుసుకుందాం...
Phalguna Masam 2024 : ప్రస్తుతం మాఘమాసం నడుస్తోంది. మార్చి 10 తో మాఘమాసం పూర్తై మార్చి 11 నుంచి ఫాల్గుణమాసం మొదలవుతుంది. మాఘమాసం ఆఖర్లో వచ్చే శివరాత్రితో చలి పూర్తిగా తగ్గిపోయి ఎండలను పరిచయం చేసే సమయం. వాతావరణంలో వేడి మొదలవుతుంది. చంద్రుడు పౌర్ణమినాడు ఫల్గుణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ నెలల ఫాల్గుణం అని పేరొచ్చింది.
శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం
కార్తీకమాసం లానే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతకరమైన మాసం ఫాల్గుణం. దితి, అదితి ఈ మాసంలోనే 'పయో' అనే వ్రతం చేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం అయిన వామనుడికి జన్మనిచ్చినట్టు పురాణాల్లో ఉంది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజూ విష్ణుమూర్తిని ఆరాధించి ఆయనకు క్షీరాన్నం లేదా పాలను నైవేద్యంగా సమర్పిస్తారు. పయస్సు అంటే పాలు కాబట్టి పాలతో చేసే వ్రతానికి పయో వ్రతం అని పేరు.
రాముడు లంకకు బయలుదేరిన సమయం
శ్రీ రామచంద్రుడు లంకకు బయలుదేరింది ఫాల్గుణ మాసంలోనే. శ్రీ మహాలక్ష్మి పాలకడలి నుంచి ఉద్భవించింది ఈ నెలలోనే. ఫాల్గుణంలో నృసింహ స్వామిని పూజించే నృసింహ ద్వాదశి, లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీ జయంతి లాంటి ప్రత్యేక తిథులు ఎన్నో ఉన్నాయి
మార్చి 23 కామదహనం - మార్చి 24 హోళీ
ఫాల్గుణ మాసంలోనే హోళీ పండుగ వస్తుంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కావడంతో… కన్నకొడుకని కూడా చూడకుండా తనను చంపించాలని అనుకుంటాడు. అందుకోసం తన సోదరి హోలికను రంగంలోకి దింపుతాడు. కానీ ప్రహ్లాదుని చంపేందుకు ఎగవేసిన మంటల్లోనే ఆ హోలిక దహనం అయిపోతుంది. దానికి సూచనగానే హోలీ మంటలు వేస్తారని చెబుతారు. శివపార్వతులను కలిపే ప్రయత్నంతో మన్మథుడు భస్మం అయిపోవడం ఈ పండుగకు కారణం అని మరికొందరి నమ్మకం.
Also Read: ఈ వారం (మార్చి 10 - 16) ఈ రాశులవారిని గ్రహబలం కాదు మనోధైర్యమే నడిపిస్తుంది!
అమలక ఏకాదశి - పాపవిమోచన ఏకాదశి
ఏడాది మొత్తం వచ్చే 24 ఏకాదశులకు ప్రతి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఫాల్గుణమాసంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. బహుళపక్షంలో వచ్చే మరో ఏకాదశిని పాపవిమోచన ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే ఈ జన్మలో చేసిన పాపాలు నశిస్తాయని విశ్వాసం.
ఫాల్గుణంలో ఎన్ని ఉత్సవాలో
ఏటా ఫాల్గుణ మాసంలో పలుచోట్ల ఉత్సవాలు జరుగుతాయి. చాలా గ్రామాల్లో ఊరూ పండగలు జరిగేది కూడా ఈ మాసంలోనే. కోరుకొండ తీర్థం, మధుర మీనాక్షి కల్యాణం ఈ నెలలోనే.
Also Read: ఆలయాల నీడ ఇళ్లపై పడితే ఏమవుతుంది!
దానధర్మాలకు అత్యంత ప్రాధాన్యం
తెలుగు సంవత్సరాల్లో చివరిది ఫాల్గుణమాసం. ఎండలు ప్రారంభమయ్యే సమయం కావడంతో ఈ నెలలో చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలనిస్తాయి. అన్నదానం, ధాన్యాలు, వస్త్రాలు, చెప్పులు, గొడుగు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది.