Sani Nivarana: శనిదోషం - ఏలినాటి శనికి ఇదే సరైన పరిహారం, ఒక్కపూజతో మీ బాధలన్నీ పరార్
Sani nivarana: ఏలినాటి శని, ఆర్థాష్టమ శని, అష్టమ శని దోషంతో బాధపడుతున్న వాళ్లు ఈ చిన్న పూజ చేస్తే చాలు మీ శని దోషాలన్నీ పటాపంచలు కావడం ఖాయం.
Sani nivarana: శని మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? ఎప్పుడు లేని కష్టాలు మీరు అనుభవిస్తున్నారా? అప్పుల బాధలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? మీ జాతకంలో గ్రహస్థితులు బాగా లేవా? అష్టమ శని దోషం, అర్ధాష్టమ శని దోషం, ఏలినాటి శని దోషాలు మీ కుండలి చక్రాన్ని గిర్రున తిప్పేస్తున్నాయా? శని వక్రదృష్టి మీపై పడకుండా చూసుకోవాలనుందా? అయితే ఈ పూజ చేయడం వల్ల శని శాంతించి మీ కష్టాలన్నీ దూరం అవుతాయని.. మీ జీవితం అభవృద్ది పథంలో దూసుకుపోతుందని పండితులు చెప్తున్నారు.
నవగ్రహాల్లో ఒకరైన శని దేవుడిని శనైశ్చరుడు అని కూడా పిలుస్తారు. శనైశ్చరుడు అంటే నెమ్మదిగా అడుగులు వేసేవాడు అని అర్థం. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించడాన్ని ‘గ్రహచారం’ అంటారు. సూర్యుడి చుట్టూ తిరగడానికి శనికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో శని ఒక్కోరాశిలో దాదాపు రెండున్నరేండ్లు సంచరిస్తాడు.
ఒక వ్యక్తి జన్మరాశి నుంచి నాలుగోరాశిలో శని ఉంటే దానిని అర్ధాష్టమ శని అంటారు. ఎనిమిదో రాశిలో ఉన్నప్పుడు అష్టమ శనిగా పిలుస్తారు. జన్మరాశికి 12వ రాశిలో, అదేరాశిలో, రెండో రాశిలో శని ఉండే కాలాన్ని ఏల్నాటి శని అంటారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మొత్తంగా ఏల్నాటి శని ప్రభావం సుమారు ఏడున్నరేండ్లు ఉంటుంది. దీనినే సాడేసాత్ శని అని కూడా సంబోధిస్తుంటారు.
గోచార రీత్యా అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతున్నది. ఈ కాలంలో ఆస్తినష్టం, ఆరోగ్య భంగం, ఉద్యోగంలో ఒత్తిడి తదితర దుష్ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేసింది. అయితే శనైశ్చరుడు కష్టాలతో పాటు సుఖాలను కూడా అనుగ్రహిస్తాడని, భక్తి ప్రపత్తులతో ఆయన్ను పూజించి, యథాశక్తి బీదసాదలకు సాయపడితే ప్రసన్నుడు అవుతాడని పండితులు చెప్తున్నారు.
ఏలినాటి శనిదోషమైనా, అర్దాష్టమ శనిదోషమైనా, అష్టమ శనిదోషమైనా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే అందుకు శనైశ్చరుని అనుగ్రహమే ఏకైక మార్గం అంటున్నారు. ఇందుకోసం జ్యోతిషశాస్త్రంలో చెప్పిన చిన్నపాటి తరుణోపాయాలు పాటిస్తే గండాలు గట్టెక్కొచ్చని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ప్రతి శనివారం, అలాగే శని త్రయోదశి, శనివారం అమావాస్య కలిసివచ్చినప్పుడు శనైశ్చర దర్శనం చేసుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేయాలని సూచిస్తున్నారు.
అలాగే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో శనీశ్వరునికి తైలాభిషేకం చేసి.. నువ్వులు బెల్లం నివేదించాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ప్రతీ శనివారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించడం కూడా మంచిమార్గంగా పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, దివ్యాంగులు, అనాథలకు సాయం చేస్తే శనైశ్చరుడు తక్షణం ప్రసన్నుడు అవుతాడని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి.
శనీశ్వరుని మంత్రమైన ‘ఓం నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం’ అనే ఈ మంత్రాన్ని పఠిస్తూ శనైశ్చరుడికి ప్రదక్షిణలు చేస్తే మంచిదంటున్నారు పండితులు.
జపాలు, హోమాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ ఎన్ని చేసినా కూడా అవి శనికి ఉపశమనాలే తప్పా శాశ్వత పరిష్కారం కావని తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు తాంత్రికులు. ఇవన్నీ కూడా వ్యయప్రయాసలతో కూడుకున్నవని.. తక్కువ ఖర్చుతో మీకు మీరే ఇంట్లో చేసుకునే మంచి రెమిడీ తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు పండితులు. ముఖ్యంగా ప్రతి నిత్యం ఒక ప్రత్యేకమైన పద్దతిలో శివారాధన చేయాలని.. ఈ ప్రత్యేక పద్దతి కోసం మూడు లోహాలతో కూడిన 11 బిల్వ పత్రాలను తయారు చేయించుకుని 108 రోజులు శివారాధన చేయాలని.. ఇలా చేయడంతో శనీశ్వరుడు శాంతించి మీ జోలికి రాడని, మిమ్మల్ని పట్టి పీడుస్తున్న శని దోషాలన్నీ పటాపంచలైపోతాయంటున్నారు.
ఇక ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించాలని.. చికాకులు ఇబ్బందులు మరీ అధికంగా ఉంటే తమ కాలి కింద మట్టిని తీసుకుని పాతమేకుతో కలిపి నల్లగుడ్డలో చుట్టి దాన్ని పారే కాలువలో వదలాలని సూచిస్తున్నారు. ఈ చిన్న తంత్రశాస్త్ర పరిహారాలను పాటించి మీకున్న శనిదోషాలను దూరం చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.
ALSO READ: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.