Narasimha Jayanti 2024 Date: మే 21 నృసింహ జయంతి - సంధ్యాసమయం చాలా ప్రత్యేకం!
Narasimha Jayanti 2024 Telugu: వైశాఖ మాసం శుక్ల చతుర్థశి నృసింహస్వామి జయంతి. ఈ ఏడాది మే 21న వచ్చింది... ఈ రోజు విశిష్టత ఏంటి? పూజా విధానం ఏంటి? ఇక్కడ తెలుసుకోండి...
Narasimha Jayanti 2024 Date and Time: దుష్ట శిక్షణ శిష్ట రక్షణకోం మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఒకటి నృసింహ స్వామి. మనిషి శరీరం - సింహం శిరస్సుతో ఉన్న నృసింహ స్వామి జయంతి వైశాఖ శుద్ధ చతుర్థశి రోజు జరుపుకుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు...అందుకే ఈ ప్రత్యేక దినాన్ని వేడుకగా జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువును, నారసింహుడిని ఆరాధిస్తారు.
నారసింహుడి ఉద్భవం
కశ్యప మహర్షి-దితి...అసుర సంధ్యలో ఒక్కటైన ఫలితంగా రాక్షస లక్షణాలతో జన్మించాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడి సోదరుడైన హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి వధించడంతో...అప్పటి నుంచి సోదరుడిపై ప్రేమతో విష్ణువుపై ద్వేషం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. ఆ పంతంతోనే ఘోర తపస్సు ఆచరించి...బ్రహ్మనుంచి వరం పొందాడు. ఆకాశం మీద కానీ- భూమ్మీద కానీ , పగలైనా - రాత్రైనా , మనిషి కానీ - జంతువు కానీ..ఎలాంటి అస్త్రాల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో సరే అంటాడు బ్రహ్మ. అప్పటి నుంచి లోకాలను శాసించడం మొదలుపెట్టాడు హిరణ్యకశిపుడు. శ్రీహరిపై వైరం పెంచుకున్న హిరణ్యకశిపుడు - విష్ణు భక్తిలో మునిగితేలే లీలావతికి జన్మించినవాడే ప్రహ్లాదుడు. తనయుడిని ఆ భక్తి నుంచి దారిమళ్లించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు హిరణ్యకశిపుడు.. ప్రాణాలు తీసుకేందుకు కూడా వెనుకాడడు. అన్ని ప్రయత్నాల్లో విఫలం అయిన తర్వాత ఎక్కడున్నాడు నీ శ్రీహరి చూపించు అంటూ ఓ స్తంభాన్ని పగులగొడతాడు. అందులోంచి ఉద్భవిస్తాడు నారసింహుడు. మనిషి-జంతువు కలగలసిన రూపం, పగలు రాత్రికి మధ్యనున్న సంధ్యాసమయం, భూమి ఆకాశం కాకుండా ద్వారంపై కూర్చుని..గోళ్లే అస్త్రాలుగా రాక్షస సంహారం చేస్తాడు శ్రీహరి. ఇదంతా జరిగింది వైశాఖ శుద్ధ చతుర్ధశి రోజే కావడంతో ఈ రోజు నృసింహ జయంతి జరుపుకుంటారు.
మే 21 నృసింహ జయంతి
సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోకి తీసుకోవడం వల్ల నృసింహ జయంతి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. మే 21 లేదా మే 22..ఏ రోజు జరుపుకోవాలి అని. అయితే నృసింహ జయంతికి సంధ్యాసమయం ప్రధానం. ఎందుకంటే స్వామివారు ఉద్భవించింది సంధ్యాసమయంలోనే...అందుకే చతుర్థశి తిథి సాయంత్రానికి ఉండడం ప్రధానం. మే 21 మంగళవారం సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉన్నప్పటికీ సాయంత్రం నాలుగున్నర సమయానికి చతుర్థశి వచ్చేసింది... మే 22 బుధవారం సాయంత్రం ఐదున్నరవరకూ చతుర్థశి ఉంది..అయితే సూర్యాస్తమయం సమయానికే నారసింహుడు ఉద్భవించాడు...ఆ రోజు చతుర్థశి తిథి. అందుకే సంధ్యాసమయానికి తిథిఉన్న మే 21నే నృసింహ జయంతి జరుపుకుంటారు.
సంధ్యాసమయం ప్రధానం
ఈరోజంతా ఉపవాసం ఉండి..సూర్యాస్తమయం సమయంలో నారసింహుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే పట్టిపీడిస్తున్న కష్టాలు తొలగిపోతాయంటారు పండితులు. నిత్యం సంధ్యాసమయంలో ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి...ముఖ్యంగా నృసింహ జయంతి రోజు...ఆయన ఉద్భవించిన సమయంలో ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుందని చెబుతారు. కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు.
నృసింహ గాయత్రి
'నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి
తన్నః సింహః ప్రచోదయాత్'
నృసింహ జయంతి రోజు ఓం నమో నరసింహాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపించాలి