(Source: ECI/ABP News/ABP Majha)
Nagula Chaviti 2022: ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడు? పుట్ట వద్దకు తప్పకుండా వెళ్లాలా? ఇంట్లో పూజించవచ్చా?
తెలుగురాష్ట్రాలతో పాటూ కర్నాటక ప్రజలు కూడా జరుపుకునే పండుగ నాగుల చవితి. మరి ఈ సంవత్సరం నాగుల చవితి ఎప్పుడు వస్తుంది?
భారతీయులు నాగపూజ చేయడానికి నాగుల చవితి పర్వదినాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, కర్నాటక ప్రాంత ప్రజలు ఎక్కువగా నాగుల చవితి జరుపుకుంటారు. ఆశ్వయిజ బహుళ అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితి తిథినే నాగుల చవితిగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబరు 29, శనివారం రోజున వస్తోంది. ఈ విశేషమైన పండుగనాడు నాగయ్యను పూజించి, చలివిడి, వడపప్పు, చిమ్మిలిని తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. నాగదోషం ఉండేవారు ఈరోజున నాగారాధనను కనుక చేసినట్లయితే అనేక రకాలైన దోషాలు ముఖ్యంగా రాహు,కేతు సంబంధమైన దోషాలు తొలిగిపోతాయి.
ప్రతి దేవతా స్వరూపానికి పాముతోనే సంబంధం
మనం జాగ్రత్తగా గమనిస్తే, మన ధర్మంలో ప్రతీ దేవతా స్వరూపానికి పాముతో సంబంధం ఉంది. ప్రతి దేవతా స్వరూపం యజ్ఞోపవీతంగా పామును ధరిస్తుంది. అందుకే నాగ యజ్ఞోపవీత ధారిణాం అని ప్రతి దేవతామూర్తిని కొలుస్తాం. అలాగే వినాయకుడి బొజ్జకు కూడా నాగుపాము చుట్టుకుని ఉంటుంది, విష్ణుమూర్తి శేషతల్పంపైనే ఉంటాడు. ఇక పాము పరమశివుడికి ప్రత్యేకమైన ఆభరణం. ఆయన నాగాభరణుడుగా మనం కొలుస్తాం. కుమారస్వామిని సాక్షాత్తూ నాగస్వరూపం కింద పూజిస్తాం. ఇక జాతకరీత్యా రాహుగ్రహాన్ని నాగరూపానికి ప్రతిరూపకంగా చెబుతారు. ఇలా మన సనాతన ధర్మంలో ప్రతీ దేవీదేవతలకు పాముతో ఏదోవిధమైన సంబంధం ఉంది.
నాగుల చవితి పూజ ఎలా చేస్తారంటే..
ముఖ్యంగా ఇది పిల్లల బాగోగుల కోసం చేసే పండగ. తమ సంతానానికి అన్ని విధాలా బాగుండాలని, ఎలాంటి నాగదోషాలు రాకూడదని మాతృమూర్తులు ఈ రోజున నాగుల చవితి వ్రతాన్ని చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో ఆచారాన్ని బట్టి పూజ చేస్తారు. కొందరు ఇంట్లోనే పూజ చేస్తే కొందరు పుట్టదగ్గరికి వెళ్లి పూజలను నిర్వహిస్తారు. ఈరోజు ఉదయాన్నే మేలుకొని, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఈరోజంతా ఉపవాసం ఉండాలి. కొందరు రాత్రి భోజనం చేస్తారు. అది వారి వారి ఆచారాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో నాగప్రతిమ ఉంటే దానికి అభిషేకాదులు నిర్వహించి, షోడశోపచార పూజను చేసి, నైవేద్యంగా నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి, చలిమిడి దీన్ని బియ్యంపిండి, పాలు కలిపి చేస్తారు, ఇక పండ్లు, ఆవుపాలు కొంతమంది కోడిగుడ్లను కూడా సమర్పిస్తారు. ఇక చాలామంది ఈరోజున తప్పకుండా నాగుపాము పుట్ట దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి ధూప, దీప, నైవేద్యాదులతో పూజ చేస్తారు. పుట్టలో ఆవుపాలను సమర్పిస్తారు. వల్మీకం అంటే పుట్ట అక్కడున్న మట్టిని తీసుకుని కన్నులకు, చెవులకు రాసుకుంటారు.
Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!
నాగపూజ వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే..
ఈ రోజు నాగపూజను నిర్వహించడం వల్ల ముఖ్యంగా జాతకంలో ఏవైనా రాహు సంబంధమైన ఇబ్బందులు ఉంటే తొలిగిపోతాయి. సర్పపూజ వల్ల సమస్త సర్పదోషాలు తొలిగి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఎవరిజాతకంలోనైనా పితృదోషాలు ఉంటే వారికి అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. అందుకని అలాంటి వారు ఈరోజున నాగపూజ చేయడం శ్రేయస్కరం. పితృదోషాలు తొలిగి, అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఎవరైనా ఏదైనా విషయంపైన ఆందోళన చెందుతున్నా, భయపడుతున్నా, లేదా కడుపునొప్పి, చెవినొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ నాగుల చవితి వ్రతాన్ని కనుక చేస్తే వాటి నుంచి బయటపడవచ్చు. మీ పూర్వికులు మొదటి నుంచి ఎటువంటి పద్ధతులు పాటిస్తున్నారో అవే పాటించండి. మీకు ఇంటి వద్ద పూజలు చేసే సాంప్రదాయం ఉంటే.. అదే కొనసాగించండి. పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి, నైవేద్యాలను సమర్పించే సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లయితే.. అదే కొనసాగించండి. మీ పిల్లలకు కూడా మీ కుటుంబ సభ్యులు తరతరాలుగా పాటిస్తున్న సాంప్రదాయం గురించి చెప్పి, అవగాహన కల్పించండి.
Also Read: సర్పదోషాలు తొలగాలంటే నాగుల చవితి రోజున ఇలా చేయండి