Mohini Ekadashi 2024: మోహిని ఏకాదశి ఈ ఏడాది ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ప్రత్యేకతలు ఏమిటీ?
Mohini Ekadashi 2024: ఏడాదంతా వచ్చే 24 ఏకాదశులలో వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి ప్రత్యేకమైంది. ఈ ఏడాది మే 19 ఆదివారం రోజున ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఆరోజు విశేషాలు తెలుసుకుందాం.
మోహిని ఏకాదశి.. విష్ణువును ఆరాధించే పండుగ. వైశాఖ మాసంలో శుక్లపక్షం, కృష్ణపక్షంలో జరుపుకుంటారు. ఈ ఏడాది ఆదివారం మే 19న వస్తోంది. ఈరోజున ఉపవాసం చేసిన వారికి పాపప్రక్షాళన జరుగుతుందని నమ్మకం.
ఏడాది పొడవునా నెలకు రెండు సార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఈరోజున చాలా మంది ఉపవాసం చేస్తారు. మోహిని ఏకాదశి వైశాఖమాసంలో వచ్చే ఏకాదశి. శుక్లపక్షం, కృష్ణపక్షంలోనూ జరుపుతారు. ఈ ఏడాది మే19 ఆదివారం రోజున మోహిని ఏకాదశి జరుపుకుంటున్నారు.
మోహిని ఏకాదశి ప్రాశస్త్యం
ఈ ఏకాదశి రోజున విష్ణు మూర్తి మోహిని రూపంలో కనిపించిన రోజు. అందుకే ఈ ఏకాదశి ప్రత్యేకమైంది. ఈరోజున విష్ణుమూర్తిని ఆరాధించి, పూజాధికాలు నిర్వహించి, ఉపవాస దీక్ష చేసినవారి సకలపాపాలు హరిస్తాయని నమ్మకం. ఈరోజు విష్ణు ఆలయ సందర్శన కూడా చేస్తారు చాలా మంది.
మోహిని కథ క్షీరసాగర మథనానికి సంబంధించింది. అమరత్వాన్ని పొందేందుకు సురాసురులు కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని బయటికి తీస్తారు. అమృతం కోసం దేవదానవుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. శాంతి నెలకొల్పేందుకు, అమృతాన్ని అందరికీ పంచేందుకు విష్ణుమూర్తి మోహినిగా అందమైన స్త్రీ అవతారంలో రాక్షసులను మాయా మోహంలో ఉంచి దేవతలకు అమృతాన్ని పంచుతాడు. క్షీరసాగర మథనంలో అమృతంతోపాటు హాలాహలం కూడా జనించింది. ముల్లోకాలను కాపాడేందుకు శివుడు హాలాహలాన్ని భరిస్తే, విష్ణు మూర్తి దేవతలకు అమృతం అందించాడు. మోహిని ఏకాదశిని భక్తిప్రపత్తులతో జరుపుకోవడం ఆనవాయితి. ఆ రోజు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి.
- సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు కఠినమైన ఉపవాసం చెయ్యాలి. కొందరు ఈరోజున నీళ్లు కూడా తాగరు.
- ధూపం, దీపం, పుష్పం, తోయం, నైవేద్యంతో విష్ణూమూర్తికి పూజాధికాలు చేస్తారు.
- విష్ణుసహస్రనామ పారాయణ చేసినా, లేక విన్నా కూడా పుణ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు.
- కలిగినంతలో మోహిని ఏకాదశి రోజున దాన ధర్మాలు చెయ్యడం విశేష ఫలితాలను ఇస్తుందట.
- విష్ణుమూర్తి ఆలయ సందర్శన తప్పక చేస్తారు.
- క్షీరసాగర మధన ఘట్టాన్ని పారాయణ చెయ్యడం కూడా సకల పాపాలను హరిస్తుందట.
- మోహిని ఏకాదశి రోజున ఉపవాస దీక్షలో ఉండి విష్ణునామ జపిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది.
ఈరోజు జపించాల్సిన 4 మంత్రాలు
1. ఓం నమో భగవతే వాసుదేవాయ:
2. శ్రీ కృష్ణగోవింద హరేమురారే హేనాథ్ నారాయణ వాసుదేవ
3. శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే
4. హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణకృష్ణ హరే హరే
Also Read : ఉందిలే మంచీకాలం ముందు ముందునా.. ఈ సంకేతాలు శుభ సూచకాలు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.