Pancharama Temples: శివభక్తులకు వరాలు ఈ క్షేత్రాలు - అన్నీ ఏపీలోనే ఉన్నాయ్!
Pancharama kshetras: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రధానంగా చెబుతారు. అయితే వీటితో పాటూ పంచభూత లింగాలు, పంచారామాలు కూడా ప్రత్యేకమైనవే. .
Pancharamas Places in Andhra Pradesh: శివతత్వానికి ఆలవాలంగా విలసిల్లే క్షేత్రాలు పంచారామాలు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే కొలువై ఉన్నాయి. పంచాక్షరి మంత్రం ధ్వనించే ఈ క్షేత్రాల స్థలపురాణం స్కంద పురాణంలో ఉంది.
పంచారామాల స్థలపురాణం
తారకాసురుడనే రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి..ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు. వరగర్వంతో ముల్లోకాలనూ పీడించే తారాకాసురుడి నుంచి విముక్తి ప్రసాదించాలని దేవతలంతా శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు కుమారస్వామి చేతుల్లో తారకాసురుడు మరణిస్తాడని చెబుతాడు శ్రీ మహావిష్ణువు. తారకాసురుడిపై యుద్ధానికి వెళ్లిన కుమార స్వామి...తన కంఠంలో కొలువై ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ముక్కలైన ఆ ఆత్మలింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటినే పంచారామాలుగా పిలుస్తారు. జీవితకాలంలో ఈ పంచారామాలను ఒక్కసారైనా దర్శించుకుంటే పునర్జమ్మ ఉండదని చెబుతారు. త్వరలో మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రాలను సందర్శించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.
Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!
ద్రాక్షారామం
పంచారామాల్లో మొదటిది ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉంది. దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీనికి ద్రాక్షారామం పేరు వచ్చింది. ద్రాక్షారామం పార్వతీదేవి జన్మస్థలమని భక్తులు విశ్వాసం. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రస్థిత మాణిక్యాంబదేవిగా విరాజిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఇదీ ఒకటి. చాళుక్యరాజైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడంతో..ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. ఈ ఆలయంలో మహాలింగం ఎత్తు 60 అడుగులు. గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఇక్కడి శివలింగం సగం నలుపు, సగం తెలుపు వర్ణంలో ఉంటుంది.
అమరారామం
పంచారామాల్లో అమరారామం రెండోది. ఇది గుంటూరు జిల్లా కృష్ణానది తీరంలో వెలసింది. ఇక్కడ స్వామివారు అమరేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అమరేశ్వర లింగం ఎత్తు 35 అడుగులు. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తుంది. మిగిలిన 20 అడుగులు భూమిలోపల ఉందని చెబుతారు. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని..అందుకే ఈ క్షేత్రానికి అమరావతి అని పేరు.
Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!
క్షీరారామం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది క్షీరారామం. ఈ శివలింగాన్ని త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు. లింగం పైభాగం మొనదేలి ఉండటం వలన స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఈశాన్య ముఖస్వరూపుడుగా దర్శనమిస్తాడు. కౌశిక ముని కుమారుడు ఉపమన్యుడు శివుడిని నిత్యాభిషేకానికి కావాల్సిన క్షీరాన్ని కోరాడట. అనుగ్రహించిన పరమేశ్వరుడు స్వయంగా క్షీర సముద్రాన్నే సృష్టించి అక్కడి పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అందుకే క్షీరారామంగా...కాలక్రమేణా పాలకొల్లుగా మారింది. 9 అంతస్తులతో నిర్మించిన 125 అడుగుల ఆలయ గోపురం అపురూప శిల్పసంపదతో విశేషంగా ఆకట్టుకుంటుంది. చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
సోమారామం
పంచారామాల్లో నాల్గవది సోమారామం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉంది. ఈ శివలింగానికి ఉన్న ఓ ప్రత్యేకత ఏంటంటే మామూలు రోజుల్లో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం అమావాస్య నాటికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమికి తెల్లగా మెరిసిపోతుంది. చంద్రుడు ప్రతిష్ఠించడం వల్లే ఈ శివలింగానికి ఈ ప్రత్యేకత అని చెబుతారు. సోముడు ప్రతిష్టించినందున ఈ క్షేత్రానికి సోమారామం పేరొచ్చింది.
కుమారారామం
పంచారామాల్లో చివరిది కుమారారామం. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి కుమారరామం అన్న పేరు వచ్చింది. భీమేశ్వరలింగం ఎత్తు 14 అడుగులు. ఈ పట్టణానికి చాళుక్య భీమవరం అన్న పేరు కూడా ఉంది. పూర్వం చాళుక్య రాజు భీముడు రాజధానిగా చేసుకుని పాలించాడని చారిత్రక ఆధారాలున్నాయి.
Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!
పంచారామాలన్నీ ఒకే రాష్ట్రంలో ఉండడం వల్ల సరిగ్గా ప్లాన్ చేసుకుంటే వీటిని ఒకే రోజు దర్శించుకునే అవకాశం ఉంటుంది.