Janmashtami 2024: కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీ కృష్ణుడి విశ్వరూపాన్ని చూసిన అర్జునుడి మానసిక స్థితి!
Mahabharat : అంతా నా బంధువులే..వారిపై అస్త్రాన్ని ఎలా సంధిస్తానని అర్జునుడు వెనకడుగువేస్తాడు. అప్పుడు భగవద్గీత బోధించిన కృష్ణుడు..తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ క్షణం అర్జునుడి మానసిక స్థితి ఇది
Janmashtami 2024: భగవద్గీత సారాన్ని అర్జునుడికి బోధిస్తాడు శ్రీ కృష్ణుడు. అందులో భాగమే విశ్వరూప దర్శనం. అప్పటివరకూ బావా అంటూ మంచి స్నేహితుడిగా మెలిగిన శ్రీకృష్ణుడు..కష్టం సుఖంలో తోడుగా నిలిచే కృష్ణుడి విశ్వరూపాన్ని చూసి అర్జునుడికి నోట మాటరాలేదు.
అప్పటివరకూ చిన్న పిల్ల కాలువను చూసిన కళ్లకు ఒకేసారి మహాసముద్రం కనిపిస్తే ఎలాంటి ఆశ్చర్యానికి లోనవుతారో విశ్వరూపాన్ని చూసిన అర్జునుడి మానసిక స్థితి కూడా ఇంచుమించు అలానేఉంది.
ఎగసి పడుతున్న సముద్రపు అలల్ని చూస్తే ఎంత భయం కలుగుతుందో భగవంతుడి విశ్వరూపాన్ని చూసి కూడా పార్థుడు అలాగే భయపడ్డాడు..
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ బంధు, మిత్రులకు ఇలా తెలియజేయండి!
ఆ క్షణం అర్జునుడి అంతరంగం గురించి వ్యాసమహర్షి ఇలా చెప్పాడు...
కిరీటినం గదినం చక్రహస్త మిచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ
ర్తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహూ భవ విశ్వమూర్తే॥
ఓ కృష్ణా...ఈ అనంతవిశ్వం మొత్తం నిండి..విశ్వమే నీ రూపంగా గల ఓ విశ్వమూర్తీ..ఓ సహస్రబాహో..ఇక చాలు..నేను నీ రూపాన్ని చూడలేకపోతున్నా. ఈ భయంకరమైన కాలపురుషుడి అవతారాన్ని ఉపసంహరించుకుని..ఎప్పటిలా పట్టు పీతాంబరాలు, తులసిమాలలు, నెమలి పింఛంతో నువ్వు చెదరని ముఖంతో సౌమ్యంగా కనిపించవయ్యా అని వేడుకున్నాడు అర్జునుడు.
మరో విధంగా చెప్పుకుంటే..అర్జునుడు అప్పటివరకూ కృష్ణుడిని సాధారణ మనిషిగానే భావించాడు. కానీ విశ్వరూపం చూపించినసమయంలో వేల చేతులు, కాళ్లు, ఉదరాలతో భయంకరమైన కాలస్వరూపుడిగా కనిపించాడు. తాను అలవాటుపడిన రూపం కాకుండా కాలపురుషుడి రూపంలో కనిపించడాన్ని అర్జునుడు చూడలేకపోయాడు.
Also Read: శ్రీ కృష్ణుడు స్త్రీ లోలుడా..16 వేల మందితో శృంగారం చేశాడా..మీ ప్రశ్నలకు సమాధానం ఇదిగో!
ఈ అనంతమైన విశ్వరూపం సూర్యుడి వెలుగుతో సమానంగా ప్రకాశిస్తోంది. అలాంటి రూపాన్ని అర్జునుడు దగ్గర్నుంచి చూస్తుంటే మరింత భయంకరంగా ఉంది. లెక్కలేనన్ని కళ్లు విశాలంగా తెరుచుకుని నిప్పులుకక్కుతున్నాయ్.ఈ భయం కిరిటీ ఒళ్లంతా పాకింది. అందుకే మళ్లీ మళ్లీ వేడుకున్నాడు...
కృష్ణా! నిప్పులు కక్కే నీ నేత్రాలు చూసి భయంగా ఉంది..నా మనసులో ఎప్పుడూ లేనంత భయం ఏర్పడింది..అయినా నీ రూపం చూపించయ్యా అని అడిగితే ఇంత వికృత రూపం చూపిస్తున్నావేంటి? జగన్మోహన రూపం చూపించవయ్యా అని వేడుకున్నాడు. అప్పుడు కూడా తన విశ్వరూపం గురించి మరింత వివరంగా అర్జునుడికి వివరించాడు కృష్ణ పరమాత్ముడు.
సర్వస్వం లయం చేసే కాల స్వరూపుడిని అయిన నా పని ప్రస్తుతం సంహారం. నువ్వు మానేసినా కానీ కొందరు తప్ప ఇక్కడెవరూ మిగలరు... అందుకే లే..యుద్ధానికి సిద్ధపడు. నిమిత్తమాతృడవై యుద్ధం చేసి శత్రుసంహారం చేయి అని శ్రీ కృష్ణుడు చెప్పాడు.
Also Read: ద్వారక నీట మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడ ఏం జరిగిందో తెలుసా..!
యుద్ధానికి సిద్ధమైన అర్జునుడు ఇప్పటికైనా మునుపటి రూపంలోకి రా మాధవా అని వేడుకున్నాడు. నీ మీద ఉన్న కరుణతో ఈ విశ్వరూపాన్ని చూపించాను...నువ్వు ఒక్కడివి తప్ప గతంలో ఎవ్వరూ ఈ రూపాన్ని చూడేదు. ఎన్నో వేదాలు చదివినవారు, దానధర్మాలు చేసినవారు, కర్మలు చేసినవారు కూడా ఈ విశ్వరూపాన్ని చూడలేకపోయారు.. నువ్వు మాత్రమే చూశావంటూ...ఇక నా పూర్వరూపం చూడు అంటూ సాధారణ రూపంలోకి వచ్చాడు కృష్ణుడు. అప్పటికి అర్జునుడి మనసు కుదుటపడింది.