Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్రకు నిలిచిన రిజిస్ట్రేషన్లు - మరికొద్ది రోజులు ఆగాల్సిందే
Kedarnath Yatra Registration 2023: భారీ హిమపాతం కారణంగా రిషికేశ్, హరిద్వార్‌లో ఏప్రిల్ 30 వరకు కేదార్‌నాథ్ యత్రకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు.
Kedarnath Yatra Registration 2023: ఈ నెల 22వ తేదీన చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయ పర్వత సానువుల్లో భారీగా మంచు కురుస్తున్న కారణంగా రిషికేశ్, హరిద్వార్‌లో కేదార్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అయితే, కేదార్‌నాథ్ ఆలయం ముందుగా ప్రకటించినట్టే ఏప్రిల్ 25 మంగళవారం నాడు తెరుచుకోనుంది.
ఎగువ గర్హ్వాల్ హిమాలయ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రికుల భద్రత దృష్ట్యా రిషికేశ్, హరిద్వార్‌లో కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 30వ తేదీ వరకు నిలిపివేశారు. గర్హ్వాల్ డివిజన్ అదనపు కమిషనర్ (పరిపాలన), చార్‌ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం దృష్ట్యా ఏప్రిల్ 30 వరకు రిషికేశ్, హరిద్వార్‌లో కేదార్‌నాథ్ యాత్ర కోసం యాత్రికుల నమోదును తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు.
కాగా.. చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 22న అక్షయ తృతీయ రోజున ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏప్రిల్ 22న యాత్రికుల కోసం తెరుచుకున్నాయి. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరవనున్నారు.
చార్‌ధామ్ యాత్ర కోసం ఇప్పటివరకు మన దేశంతో పాటు విదేశాల నుంచి 16 లక్షల మందికి పైగా భక్తులు నమోదు చేసుకున్నారు. ప్రజలు వాతావరణ సూచనలను పాటించాలని, తగినంత వెచ్చదనాన్నిచ్చే దుస్తులను కూడా వెంట తీసుకెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రికులు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది, అయినప్పటికీ, యాత్రికుల కోసం అధికారులు దారి పొడవునా తగిన ఏర్పాట్లు చేశారు.
ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు జారీ చేశామని తెలిపారు. ఇందులో ప్రయాణ సమయంలో పర్వత వాతావరణానికి తమ శరీరాలను అలవాటు చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. కష్టంగా అనిపించినప్పుడు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత మాత్రమే ప్రయాణం కొనసాగించాలని కోరారు.
చార్ ధామ్ యాత్ర దేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటిగా భావిస్తారు. ఇందులో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకుంటారు. ఏప్రిల్ 25వ తేదీ 25వ తేదీన ఉదయం 6.30 నిముషాలకు కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని అధికారులు వెల్లడించారు. అంతకు ముందు తెల్లవారు జామున 4 గంటలకు ఓంకారేశ్వర్ ఆలయంలో మహాభిషేక పూజ నిర్వహిస్తారు. అర్చకులు గర్భగుడిలో అన్ని క్రతువులూ పూర్తి చేశాక ఆలయ తలుపులు తెరుస్తారు. ఉదయం 8.30 నిముషాలకు హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ తరవాత 9 గంటలకు ఆలయ పూజారులు పంచ్‌కేదార్ గడ్డిస్థల్ వద్ద పంచాంగం వినిపిస్తారు. ఆ రోజంతా భజనలు జరుగుతాయి. ఇక బద్రినాథ్ యాత్ర చేయాలనుకునే వారికీ కీలక సమాచారం ఇచ్చారు అధికారులు. ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 7.10 నిముషాలకు బద్రినాథ్ ధామ్‌ను తెరవనున్నారు. ఆరోజు వసంత పంచమి కావడం వల్ల ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.