Karthika Masam 2022: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!
Karthika Masam 2022: స్నానం అనేది శరీర శుభ్రత కోసం. ఆరోగ్యాన్ని కోపాడుకోవడంలో ఇదో భాగం. అయితే నిత్యం చేసే స్నానం వేరు కార్తీకమాసంలో చేసే స్నానం వేరంటారు పండితులు. ఈ స్నానానికున్న ప్రత్యేకత ఏంటంటే..
Karthika Masam 2022: ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి, దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం.కానీ కార్తీకమాసం నెలరోజులూ ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుకా ఆరోగ్య రహస్యం ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించకముందే, నక్షత్రాలు ఇంకా అక్కడక్కడా మిణుకు మిణుకు మంటుండగానే కార్తీకమాసంలో నదీస్నానం ఆచరించాలని చెబుతారు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి , కార్తీకం నెలరోజులూ సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ విశేషం ఉంది.
ఆరోగ్య రక్షణ కోసం నెలరోజుల నియమం
సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీకస్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెలరోజులూ ఈ నియమం పెట్టారు.
మానసిక ఉల్లాసం కోసం కార్తీక స్నానం
కార్తీకమాసంలో తొందరగా నిద్రలేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవపూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు..మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది.
Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!
ఇది కూడా వ్యాయాయమే
నదీ స్నానం చేయాలంటే నదివరకూ నడవాలి. అంటే తెల్లవారుజామున ఇది కూడా వ్యాయామమే. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం.
స్వచ్ఛమైన నీరుండే సమయం ఇదే
నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా, ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీకమాసమే అనువైనసమయం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
జ్యోతిషశాస్త్రం ప్రకారం నీటి మీద,మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తిమంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీకమాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో ఔషధలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు.
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, క్షీరాబ్ది ద్వాదశి - పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
భక్తి కాదు ఆరోగ్యం
శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను "Electro Magnetic Activity” అంటారు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికం, దేవుడు,భక్తి పేరుచెప్పి కార్తీకం నెలరోజులూ బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు. ఈ నెలరోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే మరి.