Karthika Deepam 2024: కార్తీకదీపం నీటిలో ఎందుకు వదలాలి - ఆంతర్యం ఏంటి!
Karthika Masam 2024: కార్తీకమాసం ప్రారంభం కాగానే నదులు, చెరువులు అన్నీ వేకువజామునే దీపాలతో కళకళలాడిపోతాయి. ఇంతకీ కార్తీక దీపాలు నీటిలోనే ఎందుకు వదలాలో తెలుసా..!
Karthika Masam Deeparadhana: ఇంట్లో నిత్యం భగవంతుడి స్మరణలో ఉండేవారు అయినా ఏడాదంతా దేవుడికి దూరంగా ఉండేవారైనా కానీ... కార్తీకమాసం నెల రోజులు భక్తిలో మునిగితేలుతారు. కార్తీకం నెలమొత్తం ఇంట్లో కన్నా చెరువులు, నదుల్లో దీపాలు విడిచిపెడతారు. సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానమాచరించి..ఒడ్డున ముగ్గు వేసి దీపం వెలిగించి కార్తీక దామోదరుడికి నమస్కరిస్తారు. సూర్యోదయం అయ్యే సమయానికి మిణుకు మిణుకు మంటూ నీటిపై తేలియాడుతూ కనిపిస్తాయి దీపాలు. ఇంతకీ కార్తీక దీపం నీటిలోనే ఎందుకు విడిచిపెడతారో తెలుసా..
నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం
అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం
పంచాక్షరి నుంచి ఉద్భవించినవే పంచభూతాలు (ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి). పంచభూతాలే సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ అంటే శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అనే అర్థాలున్నాయి. ఈ జగత్తు మొత్తం శివమయం అయినప్పుడు అంతటా నిండి ఉండేది శివుడే కదా. పంచభూతాలను తనలో లయం చేసుకుని లయకారుడు అయ్యాడు శివుడు. తాను పంచభూతాత్మకం అని చాటి చెప్పేందుకే పంచభూత లింగాలుగా వెలసి పూజలందుకుంటున్నాడు. దీపాలు నీటిలో ఎందుకు విడిచిపెడతారో తెలియాలంటే శివం పంచభూతాత్మకం అని అర్థం కావాలి.
Also Read: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ!
ఆత్మ జ్యోతి స్వరూపం
మరణానంతరం మనిషి శరీరంలో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుంది
పంచభూతాల్లో ఒకటైన జ్యోతి స్వరూపంలో ఉండే ఆత్మని..పంచభూతాల్లో మరొకటైన నీటిలో వదలుతున్నాం..
అంటే..మనిషిలో అగ్ని రూపంలో ఉండే ఆత్మజ్యోతిని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడికి అంకితం చేస్తున్నారని అర్థం.
జ్యోతిని నిత్యం నదుల్లో వదలొచ్చు కదా..కేవలం కార్తీకమాసంలోనే ఎందుకు అనే సందేహం వచ్చి ఉండొచ్చు. మొత్తం 12 నెలల్లో కార్తీకం శివయ్యకు అత్యంత ప్రీతికరం. ఈ సమయంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పుణ్యస్నానం ఆచరించి జ్యోతి వెలిగించి నీటిలో విడిచిపెడితే మరణానంతరం శివుడి సన్నిధికి చేరుకుంటామని పండితులు చెబుతారు. ఈ నెల రోజులు అనుసరించే స్నానం, దీపం, దానం, ఉపవాసం ఎన్నో రెట్లు పుణ్యఫలాన్ని అందిస్తాయంటారు.
శివ కేశవులకు ప్రీతకరమైన కార్తీకంలో శివయ్యను బిల్వ దళాలు, జిల్లేడు పూలతో...శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో అర్చిస్తే మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ నెల రోజులు ప్రత్యేక పూజలు చేయడం సాధ్యం కానివారు కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో అయినా దీపం వెలిగించి భక్తితో నమస్కరిస్తే శివకేశవుల అనుగ్రహానికి పాత్రులవుతారని పండితులు చెబుతారు.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
శివ షడక్షరీ స్తోత్రం (Shiva Shadakshara Stotram)
॥ఓం ఓం॥
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।
కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥
॥ఓం నం॥
నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః ।
నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥
॥ఓం మం॥
మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరమ్ ।
మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥
॥ఓం శిం॥
శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ ।
మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ॥
॥ఓం వాం॥
వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణమ్ ।
వామే శక్తిధరందేవం వకారాయ నమోనమః ॥
॥ఓం యం॥
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ ।
యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ॥
షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।
తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ॥
శివశివేతి శివేతి శివేతి వా
భవభవేతి భవేతి భవేతి వా ।
హరహరేతి హరేతి హరేతి వా
భుజమనశ్శివమేవ నిరంతరమ్ ॥
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ ।
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!