(Source: ECI/ABP News/ABP Majha)
IRCTC Pilgrimage Special Train: పరమశివుడు కొలువైన దివ్యక్షేత్రం కాశీకి వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్ సీటీసీ స్పెషల్ ఏర్పాట్లు....
నగాయత్య్రా సమో మంత్రమ్ న కాశీ సదృశీ పురీ నవిశ్వేశ సమంలింగం సత్యం సత్యం పునః పునఃగాయత్రీ మంత్రంతో సరితూగే మంత్రం, కాశీపురానికి సమానమైన పుణ్య స్థలం, ఇక్కడి లింగానికి సాటివచ్చే శివస్వరూపం లేదని అర్థం.
ఎంత పురాతనమో... అంత సనాతనం... ఎంత పవిత్రమో... అంత మహిమాన్వితం... ఆదిశంకరులు అద్వైతానికి అర్థం చెప్పిందిక్కడే... పాండవులు పాప పంకిలాలను తొలగించుకుందిక్కడే... అందరూ అన్నిచోట్లా జీవించాలని ప్రయత్నిస్తారు... ఇక్కడ మాత్రం జీవన్ముక్తి పొందాలని తపిస్తారు.. ఇది ముక్తి స్థలి.. సాక్షాత్ పరమశివుడు కొలువైన దివ్యస్థలి..భక్తయోగ పదన్యాసి... వారణాసి. అందుకే జీవితకాలంలో ఒక్కసారైనా కాశీ వెళ్లాలని భావిస్తారు. ఇలాంటి భక్తులకోసం...ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పిలిగ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ప్రకటించింది.
దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను చూడాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూరిస్ట్ రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి వారణాసికి టూరిస్ట్ రైలు నడపనుంది. ఈ టూరిస్ట్ రైలు దారిలో కాజిపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్ల మీదుగా వారణాశికి చేరుకుంటుంది. ఆయా ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ టూరిస్ట్ ట్రైన్‌ను బుక్ చేసుకోవచ్చు.
2021 సెప్టెంబర్ 25న ఈ రైలు బయల్దేరుతుంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. వారణాసి, ప్రయాగ్‌రాజ్, గయ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను కవర్ చేస్తుంది. 'మహాలయ పిండ దాన్ తర్పణ్' పేరుతో ఈ రైలు ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో టూర్ ప్యాకేజీ బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధర రూ.6,620 కాగా, కంఫర్ట్ ధర రూ.11,030. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, హాల్, డార్మిటరీల్లో వసతి ఉంటుంది. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాస్‌లో ప్రయాణం, హోటల్‌లో వసతి ఉంటుంది. దీంతో పాటు రోజూ టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజూ 1 లీటర్ వాటర్ బాటిల్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లాండ్రీ, ఎంట్రెన్స్ ఫీజులు లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ కావు.
ఇంతకీ ఈ టూర్ ఎలా సాగుతుందంటే...
Day 1: మొదటి రోజు అంటే సెప్టెంబర్ 25న సికింద్రాబాద్, కాజిపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో పర్యాటకులు ట్రైనెక్కుతారు.
Day 2: రెండో రోజు అర్ధరాత్రి వారణాసి చేరుకుంటారు. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.
Day 3: మూడో రోజు మొత్తం సైట్ సీయింగ్ ఉంటుంది. గంగా నదిలో పుణ్య స్నానం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి ఆళయం, అన్నపూర్ణ దేవి ఆలయం, కాల భైరవ ఆలయాన్ని సందర్శించొచ్చు. సాయంత్రం సంధ్యా హారతి దర్శనం ఉంటుంది. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.
Day 4: నాలుగో రోజు ఉదయం వారణాసిలో రైలు ఎక్కి ప్రయాగ్‌రాజ్ వెళతారు. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దర్శించుకుంటారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆనంద్ భవన్, హనుమాన్ మందిర్, అలోపి శక్తిపీఠ్ దర్శనం. ఆ తర్వాత శృంగవేర్పూర్ వెళ్లాలి. అక్కడ రామాయణంలో అరణ్యకాండకి సంబంధించిన ప్రాంతాలను సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత గయ వెళ్లడానికి ప్రయాగ్‌రాజ్‌లో రైలు ఎక్కాలి.
Day 5: ఐదో రోజు గయలో విష్ణుపాద ఆలయాన్ని సందర్శించాలి. అక్కడే పిండప్రదానం చేయొచ్చు. ఆ తర్వాత బోధ్‌గయ సందర్శించాలి. రాత్రికి బోధ్‌గయలో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
Day 6: ఆరో రోజు ప్రయాణికులు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం తునిలో దిగొచ్చు.
Day 7: ఏడో రోజు ప్రయాణికులు సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజిపేట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో దిగాలి. దీంతో టూర్ ముగుస్తుంది.