Importance of Sankranti In Telugu: సంక్రాంతినే పెద్దపండుగ, పెద్దలపండుగ అంటారెందుకు, దీని విశిష్టత ఏంటి!
Makar Sankranti 2023:సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అంటారు. ఏడాదిలో 12 రాశుల్లో సంచరిస్తాడు..కానీ ధనస్సు నుంచి మకరంలో అడుగుపెట్టినప్పుడే ఎందుకు ప్రత్యేకం..
Importance of Sankranti In Telugu: అప్పటి వరకూ దక్షిణదిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరదిక్కుగా సంచరిస్తాడు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటాం. 12 రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో, మకర రాశిలోకి అడుగుపెడతాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకూ ఉన్న వాతారణంలో పూర్తిగా మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే సంక్రాంతిని సౌరమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో పెద్దగా మార్పులుండవు. మరి ఇన్ని పండుగలుండగా సంక్రాంతినే పెద్దపండుగని ఎందుకంటారు..ఈ సమయంలో పాటించే చర్యల వెనుకున్న అర్థం, పరమార్థం తెలుసా
Also Read: ఈ సంక్రాంతికి ఈ ఐదుపనులు చేసేలా ప్లాన్ చేసుకోండి!
సంక్రాంతి తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ అయనా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర-గుజరాత్‌లలో మకర్ సంక్రాంతి అని, పంజాబ్-హర్యానాల్లో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఘి అంటారు. పేరేదైనా ఈ పండుగ సందర్భం, సంతోషానికి కారణాలు అన్ని చోట్లా ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండుగే. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు
రైతుల కళ్లలో ఆనందం నింపే పండుగ
సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదెలతో పాటూ రైతులు మనసు నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకుని తినరు..ఎందుకంటే.. కొత్త బియ్యం అరగదు. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు(సకినాలు) చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్టు ఉంటుంది.. జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు.. అందుకే పొంగల్ అని పిలుస్తారు. మరోవైపు పంటని చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా అన్నీ చేసి నైవేద్యం పెట్టి, ప్రకృతిని, పశువులను పూజిస్తారు.
Also Read: భోగి మంటలకు అన్నీ రెడీ చేసుకుంటున్నారా, ఇవి మాత్రం వేయకండి!
నువ్వులతో పిండి వంటలెందుకు
సంక్రాంతి రోజు చేసే పిండివంటలన్నింటిలో నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండివంటలు చేసి పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో నువ్వులు వాడకం వెనుక ఆరోగ్యరహస్యాలెన్నో ఉన్నాయి. నువ్వులలో ఉండే అధికపోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి. అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులని తినడం వల్ల, మారుతున్న వాతావరణానికి శరీరం అలవాటు చేసినట్టవుతుంది.
పెద్ద పండుగే కాదు పెద్దల పండుగ కూడా
సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం విడవటం ఆచారంగా వస్తోంది. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు, పెద్దల పండుగగా కూడా నిలుస్తుంది.
స్నేహభావం
ఎప్పుడూ మనమే అనే భావన కన్నా..నలుగురితో మనం అనే భావన మరింత ఆనందాన్నిస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అదే. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెబుతోంది. పంటలు పండి ధాన్యం ఇళ్లకి చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం చాలా మంచిదని చెబుతారు. హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులవారు... పండుగ శోభను పెంచేవారెందరో. వీళ్లందరికీ తోచిన సహాయం చేస్తారు. ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు.
ఇంకా సృజనాత్మకతని వెలికితీసే సంక్రాంతి ముగ్గులు,బొమ్మల కొలువులు, గాలిపటాలు...ఇలా సంక్రాంతి చుట్టూ ఎన్నో ఆచారాలు అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే ఆ మూడు రోజులు మాత్రమే కాదు నెల రోజుల ముందునుంచీ సందడి మొదలైపోతుంది. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ అయింది...