Polala Amavasya 2023 : సెప్టెంబరు 14 పోలాల అమావాస్య, ఈ వ్రతం ఎందుకు ఆచరించాలి, విశిష్టత ఏంటి!
స్త్రీలు సౌభాగ్యం, సంతానం కోసం, పిల్లలుంటే వారి యోగక్షేమాల కోసం ఆచరించే వ్రతమే పోలాల అమావాస్య. శ్రావణమాసంలో ఆఖరి రోజైన అమావాస్య రోజు పెళ్లైన స్త్రీలు ఆచరించే ఈ వ్రతం గురించి పూర్తి వివరాలు మీకోసం..
Polala Amavasya 2023 : ఈ ఏడాది పోలాల అమావాస్య సెప్టెంబరు 14 గురువారం వచ్చింది....
సౌభాగ్యం, సంతానం కోసం వ్రతాలు ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా శ్రావణమాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ పూర్ణిమ ఇలా...శ్రావణ అమావాస్య వరకూ ప్రతిరోజూ పండుగే. అయితే నెలమొత్తం సౌభాగ్యం కోసం వ్రతం ఆచరిస్తే..అమావాస్య రోజు సౌభాగ్యంతో పాటూ సంతానంకోసం చేసే పూజే పోలాల అమావాస్య. పెళ్లై సంతానం లేనివారికి పోలాల అమావాస్య ఎంత ముఖ్యమో..సంతానం ఉంటే వారి యోగక్షేమాల కోసం అంతే ముఖ్యం.
Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో సానుకూల మార్పులుంటాయి
పోలాల అమావాస్య ఎలా జరుపుకోవాలి
శ్రావణమాస అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి..ఇంటిని శుభ్రం చేసి.. దేవుడి మందిరంలో ముగ్గు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ పూజకు ఉండాల్సింది కందమొక్క. దేవుడి మందిరం వద్ద కందమొక్కను ఉంచి..ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పసుపుకొమ్ములు కందమొక్కకు కట్టాలి. ఎప్పటిలా ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత...కందమొక్కలోకి మంగళగౌరీదేవిని గానీ, సంతానలక్ష్మీదేవిని గానీ ఆవాహనం షోడశోపచారాలతో శక్తి కొలది పూజచేయాలి. నైవేద్యంగా బూరెలు, గారెలతో పాటూ ఎన్ని పిండివంటలైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు కలగాయ కూర, పులుసు చేస్తారు. అంటే ఇంట్లో ఉండే కూరగాయలతో కాకుండా...నాలుగైదు ఇళ్లనుంచి అడిగి తీసుకొచ్చి ఆ కూరగాయలు అన్నింటినీ కలపి కూర, పుసులు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. పూజ పూర్తైన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాయనం ఇస్తారు...ఇంకొన్ని ప్రాంతాల్లో ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు. సాయంత్రం అయిన తర్వాత మరోసారి అమ్మవారి వద్ద దీపం వెలిగించి పూజ చేసి.. కందమొక్కకు కట్టిన పుసుపు కొమ్ములను ఇంట్లో ముత్తైదువులు ఉంటే మెడలో ఉన్న మంగళసూత్రానికి, పిల్లలకు అయితే చేతికి కానీ -మొలకు కానీ కడతే మంచి జరుగుతుందని నమ్ముతారు.
Also Read: 'నాస్తికో వేదనిందకః'- కలియుగంలో ఇంతేనా, సనాతనధర్మంపై వివాదం ఈ కోవకే చెందుతుందా!
పోలాల అమావాస్య వ్రత కథ
పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. ఏటా పురుడు కారణంగా ఆమెకు పోలాల అమావాస్య పూజ చేసే అవకాశం రాలేదు. ఏడో సంవత్సరం మళ్లీ గర్భం దాల్చింది. అప్పటికే సూటిపోటి మాటలు ఎదుర్కొంది సుగుణకు సరిగ్గా పోలాల అమావాస్య రోజే ప్రసవం జరిగింది..ఆ బిడ్డ కూడా చనిపోయింది. కానీ ఆ విషయం దాచిన సుగుణ...తోడికోడళ్లకు అనుమానం రాకుండా గుడ్డల మూటతో పొట్టను కవర్ చేసుకుని పూజ పూర్తిచేసేసేంది. ఆ తర్వాత చనిపోయిన బిడ్డను తీసుకుని శ్మశానికి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. చీకటి పడే సమయంలో నగర సంచారానికి బయలు దేరిన అమ్మవారు శ్మశానంలో సుగుణను చూసి ఏమైందని అడిగింది. వరుసగా బిడ్డలు పుట్టి చనిపోయిన విషయం చెప్పి రోదిస్తుంది సుగుణ. జాలిపడిన పోలాలమ్మ ..బాధపడకు...పిల్లల సమాధాలు వద్దకెళ్లి వాళ్లకి ఏ పేర్లు పెట్టాలి అనుకున్నావో ఆ పేర్లతో పిలుపు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకెళ్లి పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. అప్పటి నుంచి ప్రతి శ్రావణ అమావాస్య రోజు ఈ వ్రతాన్ని ఆచరించేవారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.