Bangles on Sankranti: సంక్రాంతి కీడు - కొడుకులున్నవారు గాజులు కొనాలా? అల్లుడి కాళ్లు పాలతో కడగాలా?
Sankranti 2024: సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందని ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏవో పరిహారాలు పాటించాలని ప్రచారం జరుగుతోంది. వాటిలో నిజాలెంతో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఏడాది సంక్రాంతికి ఏదో కీడు వచ్చిందని అందుకు కొడుకులున్నతల్లులు పరిహారాలు చేసుకోవాలనే ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. ఇద్దరు కొడుకులున్నవారు.. ఒక్క కొడుకు ఉన్నవారికి గాజులు కొనివ్వాలని కొందరు. ఒక్క కొడుకు ఉన్నవారు తప్పకుండా గాజులు వేసుకోవాలని.. లేకపోతే కీడు జరుగుతుందంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే, కొత్త అల్లుడి కాళ్లను పాలతో కడగాలనే ప్రచారం కూడా సాగుతోంది. మరి.. ఇందులో వాస్తవం ఏమిటీ? నిజంగా ఈ సంక్రాంతికి అలా చేయకపోతే కీడు జరుగుతుందా?
అదంతా ఉత్తిదే:
ఈ ప్రచారం వల్ల చాలా మంది మహిళలు గాజులు కొనుగోలు చేసి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడతోన్న ఆ ప్రచారాలన్నీ అవాస్తవాలేనని పండితులు తెలుపుతున్నారు. అయితే, గాజులు ధరించడానికి కొన్ని శాస్త్రీయ కారణాలున్నాయి. కాబట్టి, గాజుల ప్రత్యేకతలను తెలుసుకుంటే.. మీరు కూడా ఆ కీడు వార్తలను కొట్టిపడేస్తారు.
గాజుల చరిత్ర
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాల మీద కూడా గాజులు ధరించిన స్త్రీల శిల్పాలు ఉన్నాయి. దేవతా మూర్తుల శిల్పాలు సైతం ముంజేతికి ఆభరణాలు ధరించి కనిపిస్తాయి. మూలాల్లోకి వెళ్లి శోధిస్తే ప్రస్తుతం ప్రాచూర్యంలో ఉన్న మట్టి గాజులు లేవు. అప్పుడన్ని ఏదో ఒక లోహంతో చేసిన కంకణాలు, గాజులు ధరించేవారు. వెండి, బంగారం, పంచలోహాలు, ఇత్తడి ఇలా రకరకాల లోహపు గాజులు ధరించేవారు. కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు సైతం కంకణాల వంటివి తప్పక ముంజేతికి ధరించే ఆచారం ఉండేది.
గాజులు ఎందుకు ధరించాలి?
ముంజేతి మణికట్టు భాగంలో శరీరంలోని వినాళ వ్యవస్థకు అనుసంధానం చేసే నాడులు ఉంటాయి. ఈ భాగంలో చిన్నగా ఒత్తిడి కలిగించడం వల్ల ఇవి చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు బావుంటుందని శాస్త్రం చెబుతోంది. అందుకే స్త్రీ పురుషులిద్దరూ కూడా ముంజేతికి ఆభరణం ధరించడం ఆచారంగా పాటించేవారు. ఇలా మనం ధరించే ఆభరణాలన్నింటి వెనుక ఇలాంటి శాస్త్రీయ కోణం ఉందని పండితులు చెబుతుంటారు. ఇలాంటి కారణంతోనే కాళ్లకు కడియాలు, ఇతర అందెలు ధరించడం కూడా ఆనవాయితిగా కొనసాగుతోంది. దీని వెనుకున్నది ఆరోగ్య కారణమే కానీ మరోటేదీ కాదని శాస్త్రం చెబుతోంది.
మట్టి గాజలు అందుబాటులో లేని రోజుల్లో లక్క గాజులు వేసుకునేవారు. సాధారణంగా పెళ్లిలో ఈ మట్టి గాజులు, లక్కగాజులు వెయ్యడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇవి క్రమంగా సువాసినీ చిహ్నాలుగా పేరుపొందాయి.
మట్టి గాజుల్లో దాగున్నవ్యక్తిత్వ వికాసం
మంచి మెరుపుతో చాలా రంగుల్లో కనిపించే మట్టిగాజులు ధరించడం ఆల్ టైమ్ మహిళల ఫెవరెట్. డజన్ల చొప్పున ఈ గాజులు ధరిస్తారు. అతి సున్నితంగా ఉండే ఈ గాజులు ఎక్కువ సంఖ్యలో ధరించడం వెనుక వ్యక్తిత్వ వికాసం దాగుందని ఊహించారా ఎప్పుడయినా. మట్టి గాజలు చాలా సులువుగా పగిలిపోతాయి. చాలా జాగ్రత్తగా గాజులు పగలకుండా పనులు చక్కబెట్టుకోవాలని.. చెప్పకుండానే చెప్పడం దీని అర్థం. అంతేకాదు చుట్టూ ఉండే అనుబంధాలు సైతం గాజుల్లా సున్నితమైనవి.. చిన్ని చిన్న చేతలు, మాటలతో పగిలి పోగలవు కనుక జీవితం జాగ్రత్తగా గడపని చేప్పేందుకు సూచనట. అందుకే చేతి మీద గాజు చిట్లిపోతే అశుభం అని చెబుతుంటారు. అంత విసురుగా ప్రవర్తించడం కూడదని చేప్పేందుకు ఇదొక సూచన అన్నమాట.