Happy Rakhi Pournami 2023: రాఖీ కుడిచేతికే ఎందుకు కడతారో తెలుసా!
ఆగష్టు 31 గురువారం రక్షా బంధన్. రాఖీ అందరూ కుడిచేతికే కడతారెందుకు ఎడమచేతికి కడితే ఏమవుతుందనే సందేహం రావొచ్చు. అయితే దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలేంటో తెలుసా..
Happy Rakhi Pournami 2023: "రక్ష" అంటే రక్షణ, "బంధన్" అంటే సంబంధం...అందుకే ఈ పండుగకు రక్షా బంధన్ అని పేరు వచ్చింది. సోదరి తన సోదరుని చేతికి పవిత్రమైన దారం కట్టేటప్పుడు దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. అంటే సోదరుడికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సంతోషకరమైన జీవితాన్ని కోరుకునే సాంప్రదాయం ఇది. యుగయుగాలుగా సోదరి ఆశీర్వాదంతో నడిచే రక్షణకవచంగా పనిచేస్తోంది రాఖీ. సోదరుడి నుదిటిపై తిలకం దిద్ది రాఖీ కట్టి స్వీట్ తినిపించి ఆ తర్వాత హారతిస్తుంది. ఆమెకు జీవితాంతం అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు సోదరుడు.
కుడిచేతికే ఎందుకు
రాఖీ కుడిచేతికే ఎందుకు కడతారు, ఎడమ చేతికి కట్టొచ్చు కదా అనే సందేహం కొందరికి ఉంటుంది. అసలు కారణం ఏంటంటే... హిందూమతంలో ఎడమ చేతికి చెడు అనే అర్థం ఉంది. దీనిని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఇది మూఢ నమ్మకం అని కొందరు అనుకుంటారు కానీ దీనికి ఆధ్యాత్మికం, సైన్స్ పరంగా కూడా కొన్ని కారణాలున్నాయి. భారతీయులు ఎడమచేతిని శుభ్రపరిచే ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.
Also Read: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఇది!
సవ్య-అపసవ్య దిశలు
హిందువులు చెప్పుకునే సవ్య, అపసవ్య దిశల ప్రకారం..సవ్యదిశ విశ్వాసానికి అనుగుణంగా ఉంటుంది. అపసవ్య దిశను నెగిటివ్ ఎనర్జీగా భావిస్తారు. దీనిద్వారా శారీక రుగ్మతలు వస్తాయని విశ్వసిస్తారు. అందుకే కుడిచేతికి రాఖీ కట్టాలని చెబుతారు.
తమిళ సాహిత్యంలో ఇలా ఉంది
సుమారు రెండు వేల సంవత్సరాల పురాతన తమిళ సాహిత్యం కూడా కుడిచేతికే రాఖీ ఎందుకు కట్టాలో ఓ కారణం చెబుతుంది. పులులు సాధారణంగా ఎడమ వైపు కాకుండా కుడి వైపున పడే వేటను మాత్రమే తింటాయి. తమిళ సంస్కృతిలో కుడివైపు ఎడమ కంటే ఎక్కువ బరువు ఉంటుంది. చాలా సంస్కృతులు, భాషల్లో..కుడిని అదృష్టంగా, ఎడమను దైవదూషణగా చెబుతారు.
Also Read: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు!
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కుడిచేతికి బంధనం కట్టడం ద్వారా వాత, పిత్త, కఫం నియంత్రణలో ఉంటాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. సోదరి రాఖీ కట్టినప్పుడు ఈ మూడు శరీర అంశాలు క్రమబద్ధీకరించి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాడి శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఇడా, పింగళ, సుషుమ్న అనే మూడు నాడిలు ఉంటాయి. మూడింటిలో పింగళ నాడి కుడి వైపున ఉంటుంది. ఇది పురుషత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. మగవారిలో పింగళనాడి చైతన్యవంతమైతే పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టాలని చెబుతారు.
సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టేటప్పుడు సోదరీమణులు జపించాల్సిన రక్షా బంధన్ మంత్రం
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మా చలమాచల॥
‘ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తినే బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను. ఈ శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లాలి’ అని పై శ్లోకానికి అర్థం. బలిచక్రవర్తిపై అభిమానంతో శ్రీ మహా విష్ణువు అక్కడే ఉండిపోతాడు. తనతో పాటూ భర్తను తీసుకెళ్లేందుకు వచ్చిన మహాలక్ష్మి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టిందని భవిష్య పురాణం చెబుతోంది. అందుకే ఈ శ్లోకం చదువుతూ సోదరులకు రాఖీ కట్టాలని పండితులు చెబుతారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.