Geetha Jayanthi Wishes 2024: మనిషినిగా ఎలా జీవించాలో నేర్పించే మార్గదర్శి భగవద్గీత పుట్టిన రోజు - ఈ రోజు ఏం చేయాలి!
Geetha Jayanthi Significance 2024: డిసెంబరు 11 బుధవారం గీతాజయంతి. అంటే శ్రీ కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత పుట్టినరోజు. ఈ రోజు ఏం చేయాలి?
Geetha Jayanthi 2024: భగవద్గీత ఆవిర్భవించిన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. గీతాజయంతి అంటే భగవద్గీతను పూజించడం కాదు.. పఠించడం, మనిషిగా ఎలా జీవించాలో నేర్చుకోవడం..శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించింది ఇదే..
Also Read: మనసు నిగ్రహంగా ఉండాలంటే ఏం చేయాలి… ఒక భగవద్గీత - 108 ప్రశ్నలు- Part 4
అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రమే భగవద్గీత. ఈ పవిత్రగ్రంధం ఉద్భవించిన రోజైన మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతిగా జరుపుకుంటారు.
సాధారణంగా భగవద్గీత ఎక్కడైనా వినిపించగానే..అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు అందుకే భగవద్గీత పెట్టారేమో అనే చర్చ జరుగుతుంటుంది. అంటే శవం దగ్గర వినే గ్రంధంగా భగవద్గీతను మార్చేశారు కొందరు.
భగవద్గీత ఎవరైనా వింటేచాలు..ఎందుకంత వైరాగ్యం అంటారు ఇంకొందరు. అంటే జీవితంపై విరక్తి వస్తే భగవద్గీత చదువుతారా?
వాస్తవానికి భగవద్గీత అంటే వైరాగ్యమో, అపశకునమో కాదు...ఆచరించాల్సిన కార్యాన్ని గుర్తుచేస్తూ కర్తవ్య నిర్వహణ సూచించే అద్భుతమైన జీవన సారం.
భగవద్గీత అంటే జీవిత చరమాంకంలో సమయం గడవడం కోసం చదివే గ్రంధం కాదు..ఎన్నో ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువతకు దిక్సూచి. వివిధ రకాల వికారాల నుంచి ఎలా బయటపడాలో సూచించే మార్గదర్శి.
Also Read: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!
పుట్టుక నుంచి మరణం వరకూ జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది భగవద్గీత. భగవద్గీతలో సమాధానం లేని ప్రశ్న ఉండదు.
కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం ద్రవించి...కేవలం రాజ్యం కోసం వారిని వధించాలా అని బాధపడి అస్త్రాలు వదిలేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞాన బోధ భగవద్గీత.
మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్న 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు. ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో యోగం అంటారు. 6 యోగాలని కలిపి ఒక షట్కం అని..1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కం అని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కం అని అంటారు.
మహా భారతంలో భగవద్గీత ఓ భాగమైననప్పటికీ దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నో పురాణేతిహాసాలు చదవాల్సిన అవసరం లేకుండా కేవలం భగవద్గీత చదివితే చాలు ..జీవితానికి అర్థం, పరమార్థం అర్థమవుతుంది.
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టంగా ఉంటుంది.
‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’
క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని శ్రీ కృష్ణుడు అర్జునుడిని హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు పడకుండా ఆపేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే భగవద్గీత బోధ ప్రారంభించాడు కృష్ణ పరమాత్ముడు.
Also Read: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే
గీతలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి, వాటిని ఎలా సంధించాలో చెప్పలేదు...యుద్ధ వ్యూహాలు అసలే నేర్పించలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు. ఈ విషయాలన్నింటిలో మేటి అయిన అర్జునుడిని కమ్మేసిన మాయను తొలగించి కురుక్షేత్ర సంగ్రామంలోకి దిగేలా బోధించాడు.
అర్జునా! యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం ... విజయం సాధిస్తే రాజ్యలక్ష్మి వరిస్తుంది. ఏం జరిగినా ప్రయోజనమే..కృతనిశ్చయంతో యుద్ధానికి సన్నద్ధమవు అని బోధించాడు కృష్ణుడు.
చెప్పడం వరకే శ్రీ కృష్ణుడి పని..అది శ్రద్ధగా విని ఆచరించి కర్తవ్యాన్ని నిర్వర్తించి విజయలక్ష్మికి స్వాగతం పలికాడు అర్జునుడు.. అందుకే ఈ రోజు భగవద్గీతను పూజించడం కాదు...పఠించి ...అనుసరించండి...
ఏబీపీ దేశం ప్రేక్షకులు అందరకీ గీతాజయంతి శుభాకాంక్షలు (Happy Geetha Jayanthi Wishes 2024)