Kartik Month Food Rules : కార్తీకమాసంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి - ఏం తినాలి , ఏం తినకూడదు!
Kartik Maas 2024: అత్యంత పవిత్రం కార్తీకం..దీనినే దామోదర మాసం అంటారు. అందుకే ఈ నెలలో చేసే పూజల్లో కార్తీక దామోదరా అని పూజిస్తారు భక్తులు. ఈ నెలలో పాటించే నియమాల్లో ముఖ్యమైనవి ఆహార నియమాలు..
Kartik Month 2024: కార్తీకమాసం సందర్భంగా హిందువుల ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఆలయాలన్నీ పంచాక్షరి, అష్టాక్షరి మంత్రంతో మారుమోగిపోతున్నాయి. వేకువజామున నదులు, చెరువులు పుణ్యస్నానాలతో కళకళాడుతున్నాయి..మిణుకు మిణుకు మంటూ దీపాల వెలుగులు భక్తి భావాన్ని పెంచుతున్నాయి. ఈ నెలలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పుణ్యస్నానం నుంచి దీపం, ఉపవాసం వరకూ పాటించే ప్రతి నియమం వెనుకా ఆరోగ్య రహస్యాలున్నాయి. శీతాకాలం ఆరంభంలో వచ్చే నెల కావడంతో ఆరోగ్యంగా ఉండేందుకు అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...ఏం తినాలో - ఏ తినకూడదో కొన్ని సూచనలు చేశారు ఆరోగ్య నిపుణులు..అవేంటో చూద్దాం..
Also Read: మీరు దర్శించుకుంటున్నది ఎలాంటి శివలింగం - ఎన్ని రకాలున్నాయో తెలుసా!
మాంసాహారం
కార్తీకం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి. వైద్యశాస్త్రం ప్రకారం ఈ నెలలో జంతువులు పునరుత్పత్తి ప్రక్రియలో ఉంటాయి.. వాతావరణంలో వచ్చే మార్పులు జంతువుల శరీరంపైనా ప్రభావం చూపిస్తాయి. వాటిని తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా జీర్ణక్రియ ప్రక్రియ బలపడుతుంది..
చల్లటి పదార్థాలు వద్దు
ఫ్రిజ్ లో పెట్టిన ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్, చల్లటి నీళ్లు ఈ నెలలో తీసుకోడం సరికాదు. వాతావరణంలో వచ్చే మార్పుల దృష్ట్యా వీటికి దూరంగా ఉండకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ముఖ్యంగా ఆస్తమా లాంటి శ్వాశసంబంధిత వ్యాధులతో బాధపడేవారు చల్లటి పదార్ధాలు, పానీయాలకు దూరంగా ఉండడం మంచిది
చేదు కూరగాయలు
చేదు నిండిన కూరగాయలను ఈ నెలలో తీసుకోపోవడమే మంచిది. కాకరకాయ, చేదు పొట్లకాయ లాంటి కూరలు వండుకోవద్దు. చేదు విత్తనాల్లో బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవుతుంది..వాటిని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది లేదంటే వివిధ రకాల వ్యాధులకు దారితీయొచ్చు.
Also Read: కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ - శివతాండవ స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్!
పాలు
ఈ నెలలో గోరువెచ్చటి పాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలలో బెల్లం వేసుకుని తీసుకుంటే శరీరంలో శక్తి పెరుగుతుంది
బెల్లం
స్వీట్లు, షుగర్ సంబంధిత పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు..అయితే బెల్లం ఎంత తీసుకుంటే అంత మంచిది. శరీరంలో ఆరోగ్యకరమైన వెచ్చదనాన్ని పెంచడంతో పాటూ రక్తపోటుని నియంత్రిస్తుంది బెల్లం. కాలుష్యం కారణంగా దగ్గు, జలుబు నుంచి శరీరాన్ని సురక్షితంగా ఉంచేందుకు బెల్లం సహకరిస్తుంది
బ్లాక్ సాల్ట్
వాతావరణంలో ఉండే చల్లదనం ప్రభావం మీ శరీరంపై చూపించకుండా ఉండాలంటే బెల్లంతో పాటూ నల్ల ఉప్పు వినియోగించండి. ఈ రెండింటి మిశ్రమాన్ని రాత్రి సమయంలో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది
గోధుమ పిండి
కార్తీక మాసంలో దీపాలు వెలిగించేందుకు గోధుమ పిండి వినియోగిస్తారు. గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదలు కొందరు తింటారు. గోధుమ పిండితో హల్వా, చలిమిడి చేసి నివేదిస్తారు. ఈ నెలలో గోధుమ పిండితో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
తులసి ఆకులు
తులసి ఆకులు కేవలం ఈ నెలలోనే కాదు..ఏడాదంతా మంచిదే. ఆయుర్వేద ఔషధాల తయారీలో తులసి ఆకులదే అగ్రస్థానం. కార్తీకంలో తులసి మొక్కను పూజించడమే కాదు వాటిని నిరంతరం తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియా నశించి ఆరోగ్యాన్నిస్తుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.