కోరుకున్న ఉద్యోగం, మంచి సంపదా కావాలంటే ఈ వాస్తు చిట్కాలు పాటించండి
ఉద్యోగ సమస్యలకు సైతం వాస్తు శాస్త్రం కొన్ని పరిష్కారాలను సూచించింది. అవేంటో చూసేయండి మరి.
ఇంట్లోని ప్రతి దిశకు ప్రాముఖ్యత ఉంటుందని వాస్తు వివరిస్తుంది. వంట చెయ్యడం, తినడం, కూర్చోవడం, చదువుకోవడం, నిద్రించడం ఇలా ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం, దాని ప్రాముఖ్యత ఉంటాయి. ఈ దైనందిన కార్యక్రమాలన్నీ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కోరుకున్న ఉద్యోగం దొరకటం, ఉద్యోగంలో ఎలాంటి సమస్యలు లేకుండా కెరీర్ విజయవంతంగా సాగించడం కోసం కూడా కొన్ని వాస్తు చిట్కాలను సూచిస్తున్నారు పండితులు.
గడిచిన 2, 3 సంవత్సరాలలో కోవిడ్ మహామ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలపై ఏదో ఒక రూపంలో చెడు ప్రభావం చూపించింది. ఇది కొంత మంది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తే మరి కొందరిని ఆర్థికంగా దెబ్బతీసింది. ఇంకొందరిలో ఆరోగ్యంతో పాటు ఆర్థిక మూలాలను నాశనం చేసింది. ప్రస్తుత కాలంలో ఇంటి వాస్తును సరిగ్గా పెట్టుకోవడం చాలా అవసరం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి భాగం ఒకదానితో ఒకటి అనుసంధానించి ఉన్నట్టుగానే ఇంట్లోని ప్రతి దిశ, స్థానం అనుసంధానించబడి ఉంటాయని తెలుపుతున్నారు.
మీరు ఆశించే ఏ ఉద్యోగానికైనా మీకుండే అర్హతలు, మీ నైపుణ్యాలే కీలకం. అయితే మీ అదృష్టం మీకు ఎంత వరకు తోడుగా ఉంటుందనే విషయంలో వాస్తు ముఖ్య పాత్ర పోషిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. డ్రీమ్ జాబ్ పొందడానికి ఇంట్లో వాస్తు సరిగ్గా మెయింటెయిన్ చెయ్యటం తప్పనిసరి. రోజులో ఎక్కువ సమయం మనం గడిపేది ఇంట్లోనే కనుక ఇంట్లోని ఎనర్జీస్ సరిగ్గా లేకపోతే అది మన జీవితం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది.
నచ్చిన ఉద్యోగం పొందడం కోసం వాస్తు నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు
- ధనానికి, సంపదలకు అధిపతి కుబేరుడు. ఇంట్లో కుబేర స్థానం ఉత్తర దిక్కు. కనుక అక్కడి వైపు కూర్చుని పని చేసుకోవడం మంచిది.
- లాప్ టాప్, మొబైల్ వంటి గాడ్జెట్స్ చార్జింగ్ పాయింట్స్ గదిలోని ఆగ్నేయ దిక్కున ఉండాలి.
- మీరు విజయవంతమైన వ్యాపారవేత్త కావాలని అనుకుంటే మీరు అమ్మకానికి పెట్టే వస్తువులను వాయవ్యంలో నిల్వ చెయ్యాలి. ఈ దిక్కుకు అధిపతి వాయువు.
- దక్షిణ దిశలో కిటికీలు ఉండకూడదు.
- మంచి నిర్ణయాలు తీసుకోవడం కోసం తూర్పు లేదా ఈశాన్యం వైపు కూర్చోవడం మంచిది.
ఈ చిన్నచిన్న నియమాలను కచ్చితంగా పాటిస్తే మంచి ఫలితాలు ఉండొచ్చని పండితుల సలహా. అంతేకాదు, ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, కర్మను ఫలాపేక్ష లేకుండా నిర్వహించడం, పరుష పదజాలం వాడకపోవడం, పనివారితో మర్యాదగా నడుచుకోవడం, పరిధికి లోబడి ఇతరులకు సహాయపడడం, ఎవరి మనసు నొచ్చుకోకుండా జాగ్రత్త పడడం, తెలిసి తప్పు చెయ్యకపోవడం వంటి కొన్ని జాగ్రత్తలు కూడా పాటిస్తే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఈ చిన్న జాగ్రత్తలు జీవితాన్ని మారుస్తాయేమో. ఒక సారి పాటించి చూస్తే తప్పేముంది, విజయం వరించవచ్చేమో!
Also Read: ఆరోగ్యవంతమైన బిడ్డని కనాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలు తప్పనిసరిగా తినాల్సిందే