Dussehra 2021: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…
శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం. ఏ రోజు విశిష్టత ఏంటి..
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా', దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటారు. తొలి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతారు. అయితే మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవిని పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయదశమి రోజు పూజిస్తే అష్టైశ్వరాలతో కూడిన సుఖజీవనం లభిస్తుంది. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్థులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దినిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితో , పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రకు ముహూర్తంగా నిర్ణయించుకునేవారని చెబుతారు. అందుకే ఈ మూడు రోజులూ ఏ రోజుకారోజే ప్రత్యేకం.
Also Read: ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...
దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజిస్తారని చెబుతారు. ఇక దుర్గ అంటే దుర్గమైనది. దుర్గతులను తొలగించేది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం. 'గ' అంటే నశింపచేసేది". ఈ రోజు దుర్గా ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కోటి సూర్య ప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు ఆ తల్లి నామ జపంతో తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో పూజించాలి. వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు విజయ దశమి రోజు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేసి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు అప్పటి నుంచి పవిత్రతను సంతరించుకుంది.
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది మహర్నవమి రోజే అని చెబుతారు. ఇక ఈనవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈనవమి తిధి గురించి ఎందుకు చెబుతారంటే తొమ్మిదో రోజు మంత్ర సిద్ది కలుగుతుంది. అందుకే అమ్మవారిని ఈ రోజున సిద్ది ధాత్రిగా పూజిస్తారు. పైగా తొమ్మిది అంకె ఎంతో విశిష్టమైనది. నవ నాడులు, నవరంధ్రాలు, నవ చక్రాలూ, నవ గ్రహాలు వీటన్నిటికీ నవ రాత్రులతో ఆధ్యాత్మిక పరమైన సంబంధం ఉందని చెబుతారు. తల్లి గర్భంలో శిశువు ఉండేది 9 నెలలు. కాశీ క్షేత్రంలో 9 నెలలు కానీ, 9 రోజులు కానీ, 9 గడియలు గానీ ఉంటే పితృపాపాలన్నీ ఇట్టే తొలగిపోతాయట. శ్రవణం- కీర్తనం- స్మరణం- పాదసేవ- అర్చన- నమస్కారం- దాస్యం- సఖ్యత- ఆత్మ నివేదన ఇవి నవ విధ భక్తిమార్గాలు. అన్నింటా తొమ్మిదినే ఎందుకు చెప్పుకుంటారంటే తొమ్మిది అంకె మార్పులకు లోను కాని "బ్రహ్మ తత్వాన్ని" సూచిస్తుంది. ఎందకంటే 9 ని ఏ సంఖ్యతో గుణించినా తొమ్మిదే వస్తుంది. అంటే దీని శక్తి నిశ్చలం. "ఇదే బ్రహ్మ తత్వ రహస్యం." అంటే ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే నంబర్ అన్నమాట.
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజే అమృతం జనియించిందని చెబుతారు. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమని అందుకే 'విజయదశమి' అనుపేరు వచ్చిందంటారు. ఏపనైనా తిధి, వారము, తారాబలం, గ్రహబలం, ముహూర్తంతో సంబంధం లేకుండా విజయదశమి రోజు చేపడితే విజయం తథ్యం. ఈ రోజు 'శమీపూజ' మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసం పూర్తైన వెంటనే పాండవులు వారివారి ఆయుధాలు, వస్త్రాలను శమీవృక్షంపై నుంచి తీసుకుని... శమీవృక్ష రూపంలో ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున రావణుని సహరించి విజయం పొందాడు. అందుకే పలుచోట్ల రావణ దహనం కార్యక్రమం జరుగుతుంది. ఇలా అందరూ నవరాత్రుల్లో విజయదశమిరోజు సాయంత్రం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలుచేస్తారు.
శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
ఈ శ్లోకం రాసిన చీటీలు చెట్టుకొమ్మలు తగిలిస్తే అమ్మవారి కృపతో పాటూ సకల శుభాలు సిద్ధిస్తాయని, శనిదోష నివారణ కూడా జరుగుతుందని భక్తుల విశ్వాసం.
Also Read: నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు వస్త్రం సమర్పించాలి...ఏ ప్రసాదం నివేదించాలి
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి