Ganesh Visarjan 2025: వినాయక నిమజ్జనం శుభ సమయం, నిమజ్జనం సమయంలో గుర్తుంచుకోవలసినవి , చేయకూడనివి ఇవే!
Ganpati Visarjan Rules: గణపతి నిమజ్జనం 2025 సెప్టెంబర్ 6 అనంత చతుర్దశి రోజు జరుగుతుంది. నిమజ్జనం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకోండి

Ganesh Visarjan 2025: భాద్రపద మాసం శుక్ల పక్షం చవితి రోజు ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి వేడుకలు భాద్రపద శుక్ల చతుర్థశి తో ముగుస్తాయి. ఈ రోజునే అనంత చతుర్థశి అంటారు..వినాయక నిమజ్జం జరిగేది ఇదే రోజు. నిమజ్జనంలో భాగంగా విగ్రహాన్ని నీటిలో విడిచిపెట్టడం ద్వారా భగవానుడు తిరిగి కైలాశానికి వెళ్లిపోతాడని చెబుతారు. అందుకే ఉత్సాహంగా గణపతికి వీడ్కోలు చెప్పి మళ్లీ రావయ్యా గణపయ్యా అని నమస్కరిస్తారు. అయితే నిమజ్జనం సందర్భంగా కొన్ని నియమాలు అనుసరిస్తే లంబోదరుడి ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉంటాయని చెబుతున్నారు పండితులు.
గణపతి నిమజ్జనం ముహూర్తం
వినాయక నిమజ్జనం కోసం 1.5 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు లేదా 10వ రోజున నిర్వహించవచ్చు. అయితే నవరాత్రులు పూర్తైన తర్వాత వచ్చే అనంత చతుర్థశి రోజునే ఎక్కువ మంది నిమజ్జనం నిర్వహిస్తారు. ఈ ఏడాది అనంత చతుర్థశి సెప్టెంబర్ 06 శనివారం వచ్చింది.
నిమజ్జనం కోసం సెప్టెంబర్ 6 శనివారం శుభ ముహూర్తం
సాధారణంగా ప్రతి శనివారం ఉదయం ఏడున్నర సమయం వరకూ దుర్ముహూర్తం ఉంటుంది..అందుకే అనంత చతుర్థశి శనివారం రోజు ఉదయం నిమజ్జనం చేయాలి అనుకుంటే ఆ ఘడియలు దాటిన తర్వాత గణనాథుడిని బయటకు తీయండి.
నిమజ్జనం చేసేందుకు ఉదయం ముహూర్తం: 7:36 AM – 9:10 AM
నిమజ్జనం చేసేందుకు మధ్యాహ్న ముహూర్తం (చర, లాభ, అమృత కాలం): 12:19 PM – 5:02 PM
నిమజ్జనం చేసేందుకు సాయంత్రం ముహూర్తం (లాభం): 6:37 PM – 8:02 PM
వినాయక నిమజ్జనం సమయంలో ఏం చేయాలి?
సరైన ముహూర్తంలో నిమజ్జనం చేయండి. "ఓం గం గణపతయే నమః" లేదా "వక్రతుండ మహాకాయ" అంటూ గణపతి నామస్మరణ మధ్య విగ్రహాన్ని తీసుకెళ్లండి. ఈ ధ్వని తరంగాలు గ్రహ శక్తులతో సమన్వయం చెంది పరిసరాలను స్వచ్ఛంగా మారుస్తాయని నమ్మకం
నిమజ్జనం చేయడానికి ముందు ప్రసాదం పంపిణీ చేయండి. తియ్యటి పదార్థాలు, పండ్లు అందరకీ పంపిణీ చేయడం వల్ల మంచి జరుగుతుంది
కొత్త ప్రారంభాల కోసం ఆశీర్వాదం పొందండి
ఈ ఏడాది నీ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించాం గణేషా... చేపట్టే ప్రతి కార్యంలో విజయాన్ని అందించు అని , ఏడాదంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రార్థించండి
వినాయక నిమజ్జనం సమయంలో ఏం చేయకూడదు
మంచి ముహూర్తం లేకుండా..అంటే వర్జ్యం, దుర్ముహూర్తం సమయంలో నిమజ్జనం చేయొద్దు. ఇది ప్రతికూలతను అందిస్తుందని చెబుతారు.
విగ్రహాన్ని సాధారణంగా లేదా రాత్రి సమయంలో నిమజ్జనం చేయడం అశుభంగా పరిగణిస్తారు. అందుకే వెలుగు ఉండగానే నిమజ్జనం చేసేలా ప్రణాళిక వేసుకోండి. మీరు బయలుదేరిన ప్రదేశం నుంచి నిమజ్జనం చేసే ప్రదేశం ఎంత దూరం ఉందన్నది ముందుగానే అంచనా వేసుకోండి
కలుషితమైన నీటిలో ఎప్పుడూ నిమజ్జనం చేయవద్దు. కలుషితమైన నీటిలో కానీ కృత్రిమ వనరులలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం అంటే ప్రతికూలతను ఆహ్వానించడమే. అందుకే కొంచెం దూరం వెళ్లినా కానీ స్వచ్ఛమైన నీటిలో గణనాథుడిని నిమజ్జనం చేయండి
నిమజ్జనం ముందు గణనాథుడికి హారతి ఇవ్వడం, భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం మర్చిపోవద్దు. ఇలా చేయకుండే పండుగ అసంపూర్ణమే అవుతుందని చెబుతారు
నిమజ్జనంలో పాల్గొనే భక్తులు మద్యం సేవించవద్దు. ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఆలోచనలో స్వచ్ఛతను దూరం చేస్తుంది. ఆద్యంతం సంతోషంగా సాగాల్సిన వేడుకలకు అడ్డంకిగా మారుతుంది.






















