Tirumala News: తిరుమలలో భక్తుల రద్దీ - కొండంత దేవుని దర్శనానికి కి.మీల మేర బారులు
Tirupati News: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి ఆక్టోపస్ బిల్డింగ్ వరకూ 3 కిలోమీటర్లు మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
Devotees Rush In Tirumala: అసలే వేసవి సెలవులు.. ఆపై వీకెండ్. కొండంత దేవుడు ఏడుకొండల వాడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భారీగా తిరుమల (Tirumala) కొండకు చేరుకుంటుండగా రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సహా, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఆక్టోపస్ బిల్డింగ్ వరకూ దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, టీటీడీ భద్రతాధికారులు ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తున్నారు. అయితే, సెలవుల నేపథ్యంలో రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
#WATCH | Andhra Pradesh: A large number of devotees queue up to offer prayers at the Tirupati Balaji Temple, Tirumala. pic.twitter.com/DUJ1qEOo48
— ANI (@ANI) May 19, 2024
రికార్డు స్థాయిలో..
శనివారం రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 90,721 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా.. 50,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అటు, తిరుమలలో ఆదివారంతో పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి. గరుడ వాహనంపై నారాయణగిరి ఉద్యానవనానికి శ్రీవారి చేరుకోనున్నారు. పరిణయోత్సవాల సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది.
ఆర్జిత సేవా టికెట్లు విడుదల
ఆగస్ట్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను (Srivari Arjitha Seva Tickets) టీటీడీ ఈ నెల 18న (శనివారం) విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయగా ఈ నెల 20 ఉదయం 10 గంటల వరకూ భక్తులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ టిెకెట్లను అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22న మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాలని.. వారికి లక్కీ డిప్ లో టికెట్లు జారీ అవుతాయని పేర్కొన్నారు. అలాగే, శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 15 నుంచి 17 వరకూ నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల చేశారు.
మిగిలిన టికెట్ల విడుదల అప్పుడే..
☛ ఈ నెల 23న ఆగస్ట్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల.
☛ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఆగస్ట్ నెల ఆన్ లైన్ కోటాను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
☛ అలాగే, ఆగస్ట్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
☛ వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్ట్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
☛ అలాగే, తిరుమల, తిరుపతిల్లో ఆగస్ట్ నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
☛ ఈ నెల 27న తిరుమల - తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు నవనీత సేవకు సంబంధించి టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.