Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Salakatla Brahmotsavalu 2024 | తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 3న సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.
Srivari Salakatla Brahmotsavalu 2024 begins in Tirumala | తిరుమల ఆలయంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం (అక్టోబర్ 3న) సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్ సేనులవారు తిరుమల ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
విశిష్టత..
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముందని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ముఖ్య ఉద్దేశం.
సూర్యాస్తమయం తరువాతే..
అయితే సూర్యుడు అస్తమించిన తరువాతే ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడి (Moon)ని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం చేయరాదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో ఈ అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహణ సాధ్యమన్నారు.
అంకురార్పణ క్రమం..
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించారు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీళ్లలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ముందుగానే ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.
ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపి... చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం చేస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం శాస్త్రోక్తంగా పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీళ్లు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా సాగుతుంది.
ఈ అంకుర్పారణ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao), అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, జెఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవిఎస్వో శ్రీదర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.