Bathukamma Celebrations: ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
తెలంగాణ ఆడబిడ్డల సంబురమైన బతుకమ్మ పండుగ.. ఎంగిలిపూల వేడుకతో మొదలై తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఒక్కోరోజు బతుకమ్మకి ఒక్కో నైవేద్యం పెడతారు.
దైవాన్ని పూలతో పూజిస్తాం. కానీ పూలనే దైవంగా భావించి ఆరాధించడమే బతుకమ్మ పండుగ ప్రత్యేకత. మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో అమ్మవారికి ఏ రోజు ఏం నైవేద్యం పెడతారో చూద్దాం
1.ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. బతుకమ్మను పేర్చేటప్పుడు ఆ పూలకాడలను చేతులతో సమానంగా చించి వేస్తారు. కత్తితో కోసినా.. నోటితో కొరికనా ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు. పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి బతుకమ్మ పేర్చడం వల్ల అప్పటి నుంచి పెత్రామాస రోజు ఆడే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వచ్చినట్లు చెబుతున్నారు. మొదటి రోజున బతుకమ్మను పేర్చడానికి ముందు రోజు రాత్రే పువ్వులు తీసుకొని వస్తారని.. ఆ పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరువచ్చినట్లు కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో తిన్న తరువాత బతుకమ్మ పేరుస్తారని అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఈ రోజున నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
2.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అటుకులను ఈ రోజు వాయనంగా ఇస్తారు.
3.ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
4.నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
5.అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
6.అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
7.వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
8వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
9.సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈ రోజు ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం.
చివరి రోజు సాయంత్రం బతుకమ్మని పేర్చి ఆటపాటల అనంతరం బతుకమ్మని తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా వెళతారు. అందంగా అలంకరించుకున్న మహిళలు, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ బతుకమ్మ పాటలు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్నాక పాటలు పాడుతూ బతుకమ్మలను నీటిలో విడిచిపెడతారు. ఆ తర్వాత ప్రసాదం బంధుమిత్రులకు పంచిపెట్టి తాంబూలం వేసుకుంటారు.
Also Read: ఇయ్యాల్టి నుంచే పూలపండుగ... బతుకమ్మ ఎలా ప్రారంభమైందో, ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నాయో మీకు తెలుసా..
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read:అక్టోబర్ 7నుంచి దసరా ఉత్సవాలు, ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు- దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి