Ayyappa Deeksha: మాలధారణం, నియమాల తోరణం - అయప్ప దీక్షలో ఆ 40 రోజులు చాలా ప్రత్యేకం!
అయ్యప్ప దీక్ష కేవలం 40 రోజుల పాటు గడిపే నియమబద్ధ జీవితం కాదు. అది అద్వైతానికి దిక్సూచి. మహోన్నతమైన పరివర్తనకు అంకురార్పణే అయ్యప్ప దీక్షాధారణ.
కఠిన నియమాలతో ఆచరించే అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మికత ఇమిడి ఉండడమే కాకుండా ఆరోగ్యాన్ని సైతం పెంచుతుంది. మండలం అనేది చాలా శాస్త్రీయమైన సంఖ్య. మానవ శరీరం మానసిక చైతన్యవ్యవస్థగా రూపుదిద్దుకోవటానికి 40 రోజుల సమయం పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆయుర్వేదం కూడా ఒక మందును 40 రోజులు ఉపయోగిస్తేనే ఫలితం ఉంటుందని చెబుతుంది. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మండల దీక్ష నిర్ణయించారు.
అయ్యప్ప అంటే?
‘అయ్య’, ‘అప్ప’. ఈ రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది అయ్యప్ప అనే పదం. ఈ అయ్యప్ప పరమాత్మ స్వరూపం. శివ, కేశవ సంయోగరూపమైన అయ్యప్పస్వామి యోగ, జ్ఞానమయ మంగళమూర్తిగా శబరిగిరి మీద భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒకే పరతత్త్వం సాధకుల సౌలభ్యం కోసం వివిధ రూపాల్లో ప్రకటితమవుతుందని మహర్షుల వచనం.
చన్నీటి స్నానం
భక్తులు దీక్షాకాలం అంతా తెల్లవారుజామునే లేచి చన్నీటితో శిరస్నానం చేసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. దీనివల్ల మనస్సుకు హాయి కలుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే శిరోభాగం(మెదడు) ఎన్నో ఆలోచనలకు కేంద్ర బిందువు. నిత్యం ఆలోచనలతో మెదడులో రాపిడి ఏర్పడి తల వేడెక్కుతుంది. ఇది ఆరోగ్యానికి ఒక రకంగా హాని కల్గిస్తుంది. ప్రతి రోజు చన్నీటి స్నానం చేయడం వల్ల ఉష్ణం నుంచి తలకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాక సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తే ఆరోజు మనిషి చాలా ఉల్లాసంగా ఉంటాడు.
మితాహారం
దీక్షాపరులు ప్రతిరోజూ మితాహారం తీసుకుంటారు. దీని వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఆరోగ్యం బాగుండడంతో పాటుగా వ్యాధులు దూరమవుతాయి. దీక్షాధారులు తీసుకునే ఆహారం పూర్తిగా సాత్వికంగా ఉంటుంది. ఈ వంటల్లో వెల్లుల్లి, ఉల్లి, అల్లం వంటి మసాలా దినుసులను ఉపయోగించరు. దీని వల్ల తిన్న ఆహరం తేలికగా జీర్ణమవుతుంది.
చల్లని చందనం
స్వాములు కనుబొమల మధ్య గంధం, కుంకుమ ధరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కనుబొమల మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. ఇక్కడ పరమాత్మ జ్ఞానరూపంలో జ్యోతిలా ప్రకాశిస్తుంటాడు. ఈ ప్రదేశాన్ని గంధం, కుంకుమతో అలంకరించటం ద్వారా మనలోనే ఉన్న పరమాత్మను అర్చించే ఆధ్యాత్మిక భావనకు అయ్యప్ప దీక్ష బీజం వేస్తుంది.. నాడీ మండలానికి కేంద్రమైన నుదిటిభాగంపై సున్నితమైన ఒత్తిడి ఆరోగ్యదాయకరమైంది.
నల్లని దుస్తులు
అయ్యప్పస్వాములు నల్లని దుస్తులు ధరించాలన్న నియమం ఉంది. భక్తులు దీక్షలను చలికాలంలో చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఎండ వేడిమిని వెంటనే గ్రహించి రక్షణ కల్పించడంలో నలుపురంగు ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు అన్ని వర్ణాల్నీ తనలో కలుపుకునే లక్షణం నలుపునకు మాత్రమే ఉంది. అంతిమంగా దీక్ష తీసుకున్న వ్యక్తి పరమాత్మలో లీనం కావడాన్ని నల్లని వస్త్రధారణ ప్రకటిస్తుంది. నలుపు తమోగుణానికి సంకేతం. దాన్ని ఆదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ప్రతి మనిషికీ ఉంది. ఈ కర్తవ్యాన్ని వస్త్రధారణ ప్రతిక్షణం గుర్తుచేస్తుంది
పాదరక్షలు లేకుండా
శబరిమల, ఇతర యాత్రలకు వెళ్లేటప్పుడు పాదరక్షలు లేకుండానే చేయాల్సి వస్తుంది. దీని వల్ల యాత్రకు ఎలాంటి ఇబ్బందులు రావు. భూమికి ఊష్ణోగ్రత, అయస్కాంతత్వం ఉంటాయి. పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల భూస్థితికి తగిన రీతిలో రక్త ప్రసరణ, హృదయ స్పందన సమకూరుతాయి. అది పాదాలకు ఒకరకమైన మసాజ్ అని చెప్పవచ్చు.
నేలపై పడుకోవడం
దీక్ష చేపట్టే భక్తులు నిత్యం కఠిక నేలపై నిద్రిస్తుంటారు. భూతలశయనం సుఖాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. భూమి మీద కాసేపు పడుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది. అదేవిధంగా మెడనొప్పిలాంటి సమస్యలు ఉన్నవారు నేలపైన పడుకుంటే మంచిది అని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే ఏదైనా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నేలపై పడుకోకుండా ఉండడం మంచిది.
Also Read: ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొన్నా మంచిదే!