ఆంధ్ర శబరిమల ఆలయాలు: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్! ఎక్కడున్నాయో తెలుసుకోండి | Ayyappa Swamy Temples
శబరిమల వెళ్లలేని భక్తులకు వరంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఫేమస్ ఆలయాలు ఉన్నాయి.. ఇక్కడికి కార్తీక మాసంలో వేలాది భక్తులు ఇరుమడిలతో సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు.

Ayyappa Swamy Temples: కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధారణ చేస్తుంటారు అయ్యప్పస్వామి భక్తులు.. 21 రోజులు లేదా 41 రోజులుచేసే దీక్షలు తరువాత 41 వ రోజు మాల తీయించుకుని ఇరుముడి కట్టుకుని చాలా మంది భక్తులు అయ్యప్ప జన్మస్థలం అయిన శబరిమల వెళ్తుంటారు... అయితే చాలా మంది శబరిమల వెళ్లలేని భక్తులకు వరంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడు ఫేమస్ ఆలయాలు ఉన్నాయి.. ఇక్కడికి కార్తీక మాసంలో వేలాది భక్తులు ఇరుమడిలతో సందర్శించి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు.. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప మాల ధారులతో ఈఆలయాలు కార్తీక మాసం కిక్కిరిసిపోతుంది.. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో భక్తులు వేలాదిగా తరలిరానుండగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటాయి ఆలయ కమిటీలు..
ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం..
తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఫేమస్.. రాజమహేంద్రవరం (రాజమండ్రి) నుంచి సుమారు 20 కి.మీ. దూరం. కాకినాడ-రాజమండ్రి కెనాల్ రోడ్ చెంతనే ఉన్న ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం (Dwarapudi Ayyappa Swamy Temple) ప్రధాన "ఆంధ్ర శబరిమల"గా పిలుస్తారు. 18 పడిమెట్లు, ఇరుముడి సమర్పణ, మకర జ్యోతి దర్శనం వంటి శబరిమల సంప్రదాయాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని 1989లో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి చేత పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించబడింది. మకర నక్షత్ర దర్శనం సమయంలో లక్షలాది భక్తులు ఈ ఆలయంకు తరలివస్తారు. శని దోష నివారణకు కూడా ఈ ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రసిద్ధిగా చెబుతుంటారు. ప్రతీ రోజు ఉదయం 5:00 నుంచి రాత్రి 9:00 వరకు (పండుగల సమయంలో మారవచ్చు) ఆలయం తెరిచి ఉంటుంది..
ఆంధ్ర శబరిమలకు ఇలా చేరుకోవచ్చు..
ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిచెందిన ద్వారపూడి అయ్యప్పస్వామి ఆలయం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.. ఇక రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి 34 కి.మీ. దూరం ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకునేందుకు నిత్యం బస్సులు తిరుగుతుంటాయి. ప్రైవేటు వాహనాల ద్వారా కూడా చాలా సునాయాసంగా ఆలయంకు చేరుకోవచ్చు. గతేడాది ఇక్కడ ఆదియోగి భారీ విగ్రహాన్ని కూడా నిర్మించారు.
చిన మల్లాపురంలో ఆంధ్రశబరిమల ఆలయం..
కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే శంఖవరం మండలం పెదమల్లాపురం సిద్ధివారిపాలెం గ్రామంలో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయం చాలా ఫేమస్.. చిన్న మల్లాపురం అయ్యప్ప స్వామి ఆలయం (Chinna Mallapuram - Andhra Sabarimala Sri Ayyappa Swamy Temple ) అన్నవరం ప్రసిద్ధ సత్యనారాయణస్వామి టెంపుల్ నుంచి సుమారు 28 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయాన్ని "ఆంధ్ర శబరిమల"గా పిలుస్తారు. 2009లో నిర్మాణం ప్రారంభమై, 2011లో పూర్తయింది. 18 కొండలు, కన్నెముల గణపతి, మాళీగైపురతమ్మ ఆలయాలు, పడిమెట్లు వంటివి శబరిమలను పోలి ఈ ఆలయంలో ఉంటాయి. ఇరుముడి సమర్పణతోపాటు అయ్యప్ప మాల వేసుకుని దర్శనం చేసుకుంటుంటారు భక్తులు. మకర సంక్రాంతి సమయంలో పెద్ద ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉభయగోదవరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర నుంచి కూడా ఈ ఆలయానికి అయ్యప్ప స్వామి భక్తులు తరలివస్తుంటారు. ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు, మధ్యాహ్నం 4:00 నుంచి రాత్రి 8:00 వరకు ఆలయం తెరిచి ఉంటుంది..
చినమల్లాపురం అయ్యప్పస్వామి ఆలయానికి ఇలా చేరుకోవచ్చు..
శంఖవరం మండలంలో ఫేమస్ ఆలయంగా ఉన్న చినమల్లాపురం అయ్యప్పస్వామి ఆలయానికి అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి కేవలం 20 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే చాలా సులభంగా చేరుకోవచ్చు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ 170 కి.మీ. దూరం ఉంటుంది. కాకినాడ నుంచి 56 కిలోమీటర్లూ దూరంలో శంఖవరం అయ్యప్పస్వామి టెంపుల్ ఉంది.. ఇక్కడకు కాకినాడ నుంచి బస్సులు ఉంటాయి.





















