కార్తీక మహాపురాణం కథ DAY-3 : బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం
Karthika Puranam: కార్తీకమాసంలో కార్తీకపురాణం చదువుతారు. రోజుకో కథ చొప్పున 30 రోజులు 30 కథలు. కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యాన్ని వివరించేలా ఈ కథలుంటాయి.

కార్తీక పురాణం మూడవ అధ్యాయం
వశిష్ట మహర్షి జనకునికి కార్తీక మహత్యాన్ని వివరిస్తున్నారు. రాజా! ఈ కార్తీకమాసంలో స్నాన దాన జపాల్లో దేన్ని ఆచరించినా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో వాళ్లు వంద జన్మలు కుక్కలుగా పుడతారు
పౌర్ణమ్యాం కార్తీకమాశ స్నానాందీస్తు నాచారాన్|
కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప||
క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః|
అత్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనం||
కార్తీక పౌర్ణమినాడు స్నాన దాన జపాల్లో ఏ ఒక్కటీ కూడా ఆచరించనివాళ్ళు కోటి పర్యాయాలు చండాలుడిగా జన్మించి చివరికి బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను..
తత్వనిష్ఠోపాఖ్యానం
పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు నివసించేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అబద్ధం చెప్పనివాడు, భూతదయగలవాడు అయిన ఆ విప్రుడు ఒకసారి తీర్ధయాత్ర చేస్తూ గోదావరీ తీరాన ఉన్న ఎత్తైన మర్రిచెట్టుపై కారునలుపు శరీరఛాయ, ఎండిన డొక్కలు, ఎర్రని కళ్లు, పెరిగిన గడ్డం, వికృతంగా ఉన్న రూపంతో ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ బ్రహ్మరాక్షసులకు భయపడి దాదాపు 12 మైళ్లదూరంవరకూ ప్రాణిసంచారం ఉండేదికాదు. తపోనిష్టుడు అయిన ఆ బ్రాహ్మణుడు కూడా వాళ్లను చూసి అదిరిపడ్డాడు.. భయంతో శ్రీహరిని స్మరించడం ప్రారంభించాడు.
త్రాహి దేవేశ లోకేష త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసిన్|
త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ! త్వట్టోహం జగదీశ్వర||
దేవతలకూ, లోకాలకూ కూడా యజమాని అయిన నారాయణా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతంచేసే నిన్నే శరణు కోరుతున్నా నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప మరో దిక్కులేనివాడను అని స్మరిస్తూ అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించడాడు. ఆ రాక్షసులు కూడా బ్రాహ్మణుడిని చంపితినేందుకు అనుసరించారు. దగ్గరకు వెళ్లేసరికి హరినామస్మరణ, తేజస్సు వల్ల బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం అయింది. వెంటనే ఆ బ్రాహ్మణుడికి ప్రణామం చేసి..నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయని చెప్పారు. మీరెవరు? ఈ వికృత రూపాలేంటి? నాకు వివరంగా చెబితే మీ పాపాలు, భయాలు తొలగే దారి చూపిస్తాను అన్నాడు.
మొదటి బ్రహ్మ రాక్షసుడు
నేను ద్రావిదుడిని. ద్రవిడ దేశంలో మంధర అనే గ్రామాధికారిని. జన్మకే బ్రాహ్మణుడిని కానీ గుణానికి కుటిలుడిని. అందర్నీ వంచించాను, ఏనాడు దానం ధర్మం చేయలేదు. ఎవ్వరికీ పట్టెడు అన్నం పెట్టలేదు. వంచన చేసి ధనం అపహరించడంతో నా కుటుంబంలో నాతో సహా ఏడు తరాలవాళ్లు అధోగతిపాలయ్యారు. మరణానంతరం నరకబాధలు అనుభవించి ఇలా బ్రహ్మరాక్షసుడినయ్యాను.
రెండవ రాక్షుసుడు
నేను ఆంధ్రుడిని.. నిత్యం తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉండేవాడిని. భార్య పిల్లలతో విందుభోజనం చేస్తూ తల్లిదండ్రులకు చద్దన్నం పెట్టేవాడిని. ఏ బ్రాహ్మణుడికి ఒక్క పూట కూడా భోజనం పెట్టలేదు. బాగా ధనార్జన చేశానన్న గర్వం ఉండేది. అందుకే చనిపోయిన తర్వాత నరకంలో ఘోరమైన బాధలు అనుభవించి ఇలా బ్రహ్మరాక్షసుడిగా మారాను.
మూడవ రాక్షసుడు
నేను ఆంధ్రదేశ బ్రాహ్మణుడిని. శ్రీ మహావిష్ణువు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. నిత్యం భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలను వేశ్యలకు ఇచ్చి విష్ణుసేవలు చేయకుండా తిరిగేవాడిని. గుడిలో వెలిగించాల్సిన దీపాలకోసం తెచ్చిన నూనెను కూడా దొంగిలించాను. పాపం, పుణ్యం విచక్షణ తెలియకుండా చేసిన దోషాలకు ప్రతిఫలంగా నరకంలో బాధలు అనుభవించి ఇలా బ్రహ్మరాక్షసుని అయ్యాను.
మూ ముగ్గురికి ఉత్తమగతిని పొందే మార్గం చెప్పమని ప్రాధేయపడ్డారు
అపరాధభావంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసులతో.. భయపడకండి. నాతో కలిసి కార్తీక స్నానం ఆచరించండి అని చెప్పి తీసుకెళ్లాడు. అంతా కలసి కావేరి నదిలో స్నానం ఆచరించిన తర్వాత సంకల్పం చెప్పించాడు ఆ బ్రాహ్మణుడు
అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్ధం |
అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే | |
తాను సంకల్పం చెప్పుకుని ఆ ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు దివ్యరూపులుగా మారి వైకుంఠానికి చేరుకున్నారు
ఓ జనక మహారాజా... అజ్ఞానం వల్ల కానీ, మోహ, ప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీకమాస సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజిస్తే వారికి పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల కార్తీకమాసంలో నదీ స్నానం ఉత్తమం..కావేరీ, గంగ, గోదావరి నదుల్లో స్నానం మరింత ఉత్తమం అని చెప్పారు వశిష్ట మహర్షి.
కార్తీకపురాణం మూడో అధ్యాయం సంపూర్ణం
గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
( రోజుకో కథ చదువుకుంటే మంచిది..ముందు రోజు కథ చదువుకోవడానికి ఆటంకం వస్తే.. ఆ తర్వాత రోజు అన్ని కథలు కలిపి చదువుకోవచ్చు)






















