Karthika Puranam Day-2: కార్తీక మహాపురాణం కథ DAY-2 : కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది?
Karthika Puranam: కార్తీకమాసంలో కార్తీకపురాణం చదువుతారు. రోజుకో కథ చొప్పున 30 రోజులు 30 కథలు. కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యాన్ని వివరించేలా ఈ కథలుంటాయి.

కార్తీక పురాణం రెండవ అధ్యాయం
కార్తీక సోమవార వ్రతం ఇలా చేయాలి
వశిష్ఠ ఉవాచ
జనకమహారాజా! విన్నంత మాత్రానే పాపాలు హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను.. ఈ కార్తీకమాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజైనా స్నాన, జపాదులు ఆచరించినవారు వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు.
సోమవార వ్రాత విధి 6 రకాలు
1.ఉపవాసం
2. ఏకభక్తం
3. నక్తం
4.అయాచితం
5.స్నానం
6. తిలాపాపం
1. ఉపవాసం
కార్తీక సోమవారం రోజంతా ఉపవాసం ఆచరించి..సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకుని తులసి తీర్థం తీసుకోవాలి.
2. ఏకభక్తం
ఉపవాసం ఉండలేనివారు ఉదయం స్నానజపాదులు యథావిధిగా ముగించి.. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్ధం తీసుకోవాలి.
3. నక్తం
పగలంతా ఉపవాసం ఉంది..నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి
4. అయాచితం
భోజనం చేసేందుకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా పిలిస్తే వెళ్లి చేసే భోజనాన్ని ఆయాచితం అంటారు
5. స్నానం
సోమవార వ్రతం ఆచరించేందుకు , ఉపవాసం ఉండేందుకు ఆరోగ్యం సహకరించనివారు సమంత్రక స్నానజపాదులు చేసినట్లయితే సరిపోతుంది.
6. తిలాపాపం
మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా మంచి జరుగుతుంది
ఈ ఆరు పద్ధతుల్లో ఏం ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్టే. తెలిసినా కూడా ఏ పద్ధతీ ఆచరించనివాళ్లు 8 యుగాల పాటు కుమ్బీపాక రౌరవాది నరకాలని పొందుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడూ కూడా పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేసేవారు శివసాయుజ్యాన్ని పొందుతారు.
సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం మంచిది.
కార్తీక సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసం
నిష్టురి కథ
పూర్వం ఒక బ్రాహ్మణునికి ''నిష్టురి'' అనే కుమార్తె ఉండేది. ఆమె అందంగా, ఆరోగ్యంగా ఉండేది కానీ సద్గుణాలు మాత్రం లేవు. దుష్ట గుణాలతో గయ్యాళిగా, కాముకురాలిగా ఉండేది...అందుకే ఆమెను 'కర్కశ' అని పిలిచేవారు. నిష్టురి తండ్రి తన బాధ్యత ప్రకారం కుమార్తెను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైణ మిత్రశర్మకు ఇచ్చి పెళ్లి జరిపించాడు. మిత్రశర్మ చదువు, సదాచారాలు సద్గుణాలు ఉన్నవాడు. అక్కడ కూడా కర్కశ ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. కర్కస పెట్టే బాధలు భరించాడే కానీ బయటకు చెప్పుకోలేదు మిత్రశర్మ. ఆమెను శిక్షించాలని అనుకోలేదు. చివరకు పరపురుషులతో సంబంధాలు పెట్టుకుని అత్తింటివారిని అన్ని రకాలుగా బాధలకు గురిచేసింది కర్కశ. నీ భర్త కారణంగా తరచూ కలుసుకోలేకపోతున్నాం అన్న ఓ దుర్మార్గుడి మాట విని భర్తను బండరాయితో మోది బావితో పడేసింది. ఇదంతా చూసినప్పటికీ ఆమెను ఏమీ అనలేక ఇల్లువదిలి వెళ్లిపోయారు అత్తమామలు. అప్పటి నుంచి తనింటిని వేశ్యావాటికగా మార్చేసింది కర్కశ. కొన్నాళ్లకి జబ్బుపడి వళ్లంతా కుళ్లిపోయింది. విటులు అసహ్యించుకుని రావడం మానేశారు. భర్తను చంపేసింది, అత్తమామలు ఇంటినుంచి వెళ్లిపోయారు, సంతానం లేరు... తినడానికి తిండిలేక..ఎలాంటి దిక్కూలేక జబ్బుపడి ఒంటినిండా రోగాలతో దిక్కులేని చావు తెచ్చుకుంది. యమదూతలు ఆమెను నరకానికి తీసుకెళ్లి శిక్షించారు.
భర్తను విస్మరించి, పర పురుషులను చేరిన కర్కశ పాపాలకు శిక్షగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమన్నారు. ముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారు. రాతిమీద వేసి చితక్కొట్టారు. సీసం చెవుల్లో పోశారు.కుంభీపాక నరకానికి పంపారు. ఆమె చేసినా పాపాలకు ముందు పది తరాలు, వెనుక పది తరాలు ఆమెతో కలిసి 21 తరాలవాళ్ళను కూడా నరకానికి పంపారు. ఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఓ బ్రాహ్మణ గృహంలో కాపలాగా ఉండేది.
సోమవార వ్రత ఫలం
కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి శివాభిభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరం..బయట భోజనం పెట్టి ఉపవాసం విరమించేందుకు వెళ్లాడు. రోజంతా ఆహారం దొరక్క పస్తులున్న కుక్క ప్రదోష సమయంలో బయట ఉంచిన బలి అన్నాన్ని తిన్నది. సోమవారం మహిమ వల్ల ఆ కుక్కకు పూర్వ స్మృతి కలిగి..ఓ బ్రాహ్మణుడా నన్ని రక్షించు అని మూలిగింది. కుక్క మాట్లాడడం ఏంటని విస్తుపోయి చూసిన ఆ బ్రహ్మణుడు నేను నిన్ను ఎలా రక్షించగలను అని అడిగాడు. తన పూర్వజన్మల గురించి ...తాను చేసిన పాపాలు గురించి చెప్పి..ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తుకువచ్చాయో తెలియజేమని అడిగింది. ఇదంతా కార్తీకసోమవారం రోజంతా ఆహారం దొరక్క ఉపవాసం ఉండి.. సాయంత్రం నేను విడిచిపెట్టిన బలి భోజనం తిన్నావు కదా అందుకే పూర్వజన్మ జ్ఞానం కలిగిందని చెప్పాడు. నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పమని అడిగింది ఆ కుక్క. తాను చేసిన ఎన్నో సోమవారాల వ్రతాల్లో ఓ సోమవార వ్రత ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ కుక్కకు మోక్షం కలిగి శివుడి సన్నిధికి చేరుకుంది.
ఈ కథంతా వివరించిన వశిష్ఠ మహర్షి..ఓ జనకమహారాజా కార్తీకసోమవార వ్రతాన్ని ఆచరించు అని చెప్పారు
కార్తీకపురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం
గమనిక: పండితులు చెప్పినవివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















