Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు - ఎందుకంటే!
అక్షయ తృతీయ అనగానే ఆడవారి కళ్లు మిలమిలా మెరుస్తాయి. బుర్రలో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి..కళ్లముందు బంగారం కదలాడుతుంది. ఇంతకీ అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలా...ఈ ప్రచారంలో వాస్తవమెంత...
Akshaya Tritiya 2023: హిందూ సంప్రదాయంలో ప్రతిరోజూ విశేషమైనదే. ఒక్కో పండుగని ఒక్కోలా జరుపుకుంటాం..అయితే కొన్నిమాత్రం సెంటిమెంట్స్ చుట్టూ తిరుగుతాయి. అలాంటి పండుగల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ మాసంలో మూడో రోజు..అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజు చేసే దాన ధర్మాలు, పుణ్యం అత్యధిక ఫలితాలనిస్తాయని చెబుతారు. ఈ రోజు చేసే దానధర్మాలు అక్షయం అయినట్టే..పాపాలు అయినా అంతే..చిన్న పాపం చేసినా అది అక్షయం అవుతుంది.
అక్షయ తృతీయ రోజు మొత్తం మంచి ముహూర్తంగానే భావిస్తారు. ఈ రోజు దుర్ముహుర్తాలు, వర్జ్యాలు, యమగండం లాంటివి పెద్దగా ప్రభావం చూపవు. రోజు మొత్తం ఏ క్షణం ఏం చేసినా శుభఫలితాలే వస్తాయని విశ్వసిస్తారు. ఈ రోజుకున్న ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే..ఈ రోజునే త్రేతాయుగం మొదలైంది, పరశురాముడు జన్మించింది ఈ రోజనే.
అక్షయ తృతీయ రోజు నిజంగా బంగారం కొనాలా?
అక్షయ తృతీయ అనగానే బాంగారం కొనాలని ప్రచారం చేస్తుంటారు. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చంటుందంటారు. ఇదే అదనుగా బంగారం షాపుల వాళ్లు కూడా మగువలను ఆకర్షించేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తారు. అక్షయ తృతీయ రోజు పసిడి షాపులన్నీ కిటకిటలాడిపోతుంటాయి. అక్షయ తృతీయ రోజు బంగారం షాపుల్లో మహిళామణుల బారులు చూస్తుంటే ఇక్కడ బంగారం ఉచితంగా పంచుతున్నారా అనేంత అనుమానం వస్తుంది. అంతలా పోటీపడి మరీ కొనేస్తారు. కొందరైతే అప్పు చేసి మరీ బంగారం కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చేస్తారు. వాస్తవానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఇదంతా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమే అంటారు నిజమైన పండితులు.
Also Read: ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అంటే అహంకారం పెంచుకోవడమే
చాలామందికి తెలియని విషయం ఏంటంటే...కలిపురుషుడి ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటి, బంగారం అహంకారానికి హేతువు. అంటే కోరి కలిపురుషుడిని ఇంట్లో పెట్టుకుంటున్నారు, అహంకారాన్ని మరింత పెంచుకుంటున్నారని అర్థం అన్నమాట. అయితే బంగారం అనే ప్రస్తావన ఎందుకొచ్చిందంటే...కొనాలని కాదు దానం చేయమని. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం కన్నా దానం చేయడం ఉత్తమం. అందరకీ బంగారం దానం చేసేంత స్తోమత ఉండదు కాబట్టి...ఏదో ఒకటి దానం చేయడం వల్ల పుణ్యం అక్షయం అవుతుందన్నది మాత్రం వాస్తవం అంటున్నారు పండితులు.
Also Read: గుండు చేయించుకుంటున్నారా, ఇంతకీ దేవుడికి తలనీలాలు ఎందుకిస్తారో తెలుసా!
అక్షయ తృతీయ రోజు దానం చేయాల్సినవి
- ఎండలు పెరిగే సమయం కావడంతో అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేయడం మంచిది
- అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు
- చెప్పులు-గొడుగు-వస్త్రాలు- విసనికర్రలు దానం చేయడం. ఇంకా మజ్జిగ, పానకం, పండ్లు దానం చేయడం ద్వారా మీ పుణ్యం అక్షయం అవుతుంది.
అక్షయ తృతీయ రోజు పుణ్యాన్ని అక్షయం చేసుకోమని అర్థకానీ...పోటీపడి బంగారం కొనుక్కుని తెచ్చేస్తే ఇంట్లో ధనరాశులు నిండిపోతాయన్నది భ్రమమాత్రమే అంటున్నారు పండితులు. భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని, లక్ష్మీదేవిని ఆరాధించాలి ఈరోజు..