(Source: ECI/ABP News/ABP Majha)
Chanakya Niti:చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలరు!
Chanakya Niti: చాణక్యుడి నీతి సూత్రాలు మన జీవితాలను సులభతరం చేయడంలో సహాయపడతాయి. ఎలాంటి సమస్యలు ఎదురైనా, విజయవంతమైన వ్యక్తిగా మారడానికి చాణక్యుడి సూత్రాలు సహాయపడతాయి.
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నైతికతతో ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందాడు. అతను అర్థశాస్త్రం సహా ముఖ్యమైన గ్రంథాలను రచించాడు. ఆయన క్రీస్తు పూర్వం 376లో జన్మించాడని చెబుతారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఆచార్య చాణక్యుడు నైపుణ్యం కలిగిన రాజకీయవేత్త, దౌత్యవేత్త, గొప్ప పండితుడు. నైపుణ్యం కలిగిన రాజకీయ చతురత ద్వారా చంద్రగుప్త మౌర్య సామ్రాజ్య స్థాపన, విస్తరణలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయన ఆలోచనలు నేటికీ ఆచరణీయంగా ఉన్నాయి. చాణక్య నీతిని అనుసరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించగలడు. మీరు కూడా మీ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే, ఈ 4 సూత్రాలను కచ్చితంగా పాటించండి.
1. దాతృత్వం
ఆచార్య చాణక్యుడి ప్రకారం, దానధర్మాలు చేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ధార్మిక గ్రంధాలలో కూడా దానానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. మనకు చేతనైనంతలో దానధర్మాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తే పేదరికం కూడా తొలగిపోతుంది. కాబట్టి, ఒక వ్యక్తి తన ఆర్థిక స్థితిని బట్టి దానం చేయాలి. దానం చేయడం వల్ల సంపద తగ్గదని ధార్మిక పండితులు కూడా చెబుతున్నారు.
Also Read : భర్త ఈ జంతువులా ఉంటే భార్య ఇష్టపడుతుందట
2. ప్రవర్తన
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి అనుభవించే అన్ని రకాల సమస్యలు, బాధలు అతని ప్రవర్తన ద్వారా మాత్రమే తొలగిపోతాయని చెప్పాడు. ఒక వ్యక్తి మంచి నడవడికతో తనను తాను ఉన్నతీకరించుకోగలడు. ఈ సూత్రం వృత్తి, వ్యాపారంలో కూడా సహాయపడుతుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలోని అన్ని రకాల కష్టాలు, దుఃఖాలను తొలగిస్తుంది.
3. అధ్యయనం
ఈ రోజుల్లో పుస్తకాలు చదివే వారికంటే మొబైల్ ఫోన్లలో చదివే వారి సంఖ్య ఎక్కువ. దీంతో ప్రజల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కానీ, ఆచార్య చాణక్యుడు ప్రకారం, అధ్యయనం ద్వారా తెలివి పెరుగుతుంది. దీనితో ఒక వ్యక్తి తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తాడు. దీనికోసం రోజూ చదువుకోవాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని చాణక్యుడు సూచించాడు.
4. భక్తి
ఒక వ్యక్తి పుట్టిన క్షణంలోనే అతని భవితవ్యం నిర్ణయమవుతుందని పెద్దలు చెబుతారు. భవిష్యత్తు బాగుండాలంటే భగవంతుని ధ్యానించాలి. ధర్మపరమైన కార్యక్రమాలలో మనం నిమగ్నమై ఉండాలి. ఇది ఒక వ్యక్తి తార్కిక శక్తిని అంటే ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. అదే సమయంలో భగవంతుని ఆశీర్వాదం వారిపై ఉంటుంది.
Also Read : చాణక్య నీతి ప్రకారం ఈ 6 లక్షణాలు ఉన్నవారు మాత్రమే ధనవంతులు అవుతారు
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్న ప్రకారం, ఒక వ్యక్తి ఈ విషయాలను అనుసరిస్తే అతను మంచి జీవితాన్ని పొందుతాడు. అతను తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, దాని నుంచి బయటపడే మార్గాన్ని కనుగొంటాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.