లోకేష్ యువగళం పాదయాత్రకు లైన్ క్లియర్- 14 షరతులతో పోలీసుల అనుమతి
27 నుంచి నారా లోకేష్ ప్రారంభించనున్న యువగళం పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ జరిగే పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్లుగా చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు.
తీవ్ర తర్జనభర్జనలు, లేఖలు, అనుమానాలు, చర్చలు తర్వాత యువగళం పాదయాత్రకు పర్మిషన్ లభించింది. లోకేష్ చేపట్టే ఈ యాత్రకు పోలీసులు 14 షరతులు పెట్టారు. 27 నుంచి చేపట్టే పాదయాత్రకు అనుమతి ఇస్తూ ప్రకటన విడుదల చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి... ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని కండీషన్స్ పెట్టారు.
27వ తేదీ నుంచి నారా లోకేష్ ప్రారంభించనున్న యువగళం పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభించింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ జరిగే పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్లుగా చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి లోకేశ్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర నిబంధనలకు లోబడి జరగాలని పోలీసులు స్పష్టం చేశారు. పాదయాత్రలో ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని షరతు విధించారు. దీంతో పాదయాత్రకు అనుమతి లభిస్తుందా లేదా అన్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది.
ఈ నెల 27నుంచి రాష్ట్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. 40 రోజుల క్రితమే లోకేష్ పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్రలో ఉన్న వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఫోకస్ చేస్తూ పాదయాత్ర సాగనుందని తెలిపారు. పాదయాత్రకు యువగళం అన్న పేరును ఖరారు చేశారు. 400 రోజులు 4వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యువగళం పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తి ఆవుతోంది. పాదయాత్ర తేదీ దగ్గర పడటంతో నాయకులు క్యాడర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
పాదయాత్రకు అనుమతి కావాలంటూ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ నెల 9న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. స్పందించక పోవడంతో రెండు సార్లు రిమైండర్ కూడా పంపారు. 21న డీజీపీ స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపారు . 400 రోజులపాటు లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు సంబంధించి డీజీపీ అడిగిన వివరాలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నాలుగు వందల రోజులకు సంబంధించి ప్రతి రోజు ఎవరెవరు పాదయాత్రలో పాల్గొంటారు..? లోకేష్ ను కలుసుకునే వ్యక్తుల వివరాలు వారి ఆథార్ కార్డు తో సహా సమర్పించాలి అంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పాదయాత్రలో ఉండే వాహన కాన్వాయ్ వివరాలు... వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ తో సహ వివరాలు, రూట్ మ్యాప్ వివరాలు మాత్రం అందజేశారు.
కొన్ని వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా.. పాదయాత్ర జరిగి తీరుతుందని.. తమది ప్రజాస్వామ్య హక్కు అంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి.. అనుమతి ఇస్తున్నట్లుగా చెప్పడంతో టీడీపీ శ్రేణులు ఏర్పాట్లలో మునిగిపోయాయి. పాదయాత్రను భారీ ఎత్తున విజయవంతం చేసుకోవడానికి లోకేష్ చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని వేల మందిని నేరుగా కలిసి మద్దతు అడిగారు. ఆయనతోపాటు నడిచేందుకు కార్యకర్తలు కూడా సిద్ధమయ్యారు.