Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని సజ్జలకు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల హెచ్చరించారు. ఏపీకి న్యాయం చేయడం సంగతి చూసుకోవాలన్నారు.
Sharmila On Sajjala : రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలుపుతామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదన్నారు. సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివన్నారు. నేడు తెలంగాణ ఒక వాస్తవం అని గుర్తు చేశారు. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని.. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యమని స్పష్టం చేశారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని.. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద అని హితవు పలికారు. మీ హక్కుల కోసం పోరాటం చేయండి.. మీ ప్రాంతానికి న్యాయం చేయండని సూచించారు.
గురువారం ఉదయం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలపడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేసింది.. మళ్లీ ఉమ్మడి ఎపి అయితే తొలుత స్వాగతించేది వైసిపినేనని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. ఎపి విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంకోర్టులో కేసు ఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదనలు బలంగా వినిపిస్తామన్నారు. విభజన జరిగిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు. ఉమ్మడి ఎపి కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనే భావన ప్రజల్లో బలంగా ఉంది. మళ్లీ ఉమ్మడి ఎపి కాగలిగే అవకాశముంటే ఆ విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్లేది వైసిపినే. ఏ వేదిక దొరికినా మళ్లీ కలిసేందుకే ఓటు వేస్తాం. విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తూనే ఉంటాం. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలని సజ్జల వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు ఏ అవకాశం దొరికినా మళ్లీ కలిసేందుకే తమ పార్టీ ఓటు వేస్తుందని ప్రకటించారు.
సజ్జల ప్రకటన తెలంగాణ రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. తెలంగాణలో మళ్ళీ ఆంధ్రానాయకులు విబేధాలు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 60 ఏళ్ళు తెలంగాణను దోచుకున్నారు, వాళ్ళు తిన్నది చాలదట అని ఆయన మండిపడ్డారు. 9 ఏళ్లుగా ఆంధ్రా ప్రజలు తెలంగాణలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. తెలంగాణపై కుట్రలు చేస్తే ఇక్కడే పాతర వేస్తామని హెచ్చరించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ విభజనపై విషం చిమ్మేలా మాట్లాడారని మండిపడ్డారు. ఆయన ఆషామాషీగా మాట్లాడారు అని భావించడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో వైపు ఏపీ రాజకీయ పార్టీలు కూడా ఇదో జిమ్మిక్‌గా అభివర్ణించాయి. కేసీఆర్‌తో కలిసి కొత్త డ్రామా ప్రారంభించారని.. వైఎస్ఆర్సీపీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యలన్నింటినీ పక్కదోవ పట్టించడానికి ఆడుతున్న డ్రామాగా అభివర్ణించింది.