Tirupati Stampede : "లడ్డూ " లా దొరికేసిన చంద్రబాబు- వైసీపీ, హిందూ సంఘాలకు ఆయనే టార్గెట్!
Tirumala News: "లడ్డూ"లా దొరికేసారు..! పాపం చంద్రబాబు. ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్న మాట. దీని ఆధారంగా ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీబీఎన్‌ను టార్గెట్ చేసుకునే ఛాన్స్ ఉందన్నారు.
Tirumala Stampede News: తిరుమల తొక్కిసలాట వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ప్రత్యర్థుల చేతికి లడ్డూలా దొరికేసిందా? అంటే నిజమే అన్నట్టుగా ఉంది పరిస్థితులు చూస్తుంటే. కొంతకాలం క్రితం ఈ "లడ్డు" అనే పదం రాజకీయంగా ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. జిల్లా స్థాయి నుంచి ఢిల్లీ వరకు, తిరుమలలో కల్తీ నెయ్యితో లడ్డూలు చేసే ప్రయత్నం జరిగిందంటూ తీవ్ర ప్రచారం జరిగింది. గత జగన్ ప్రభుత్వంలో ఈ జరిగిందని టిడిపి నేతలు ముఖ్యంగా సీఎం చంద్రబాబు డైరెక్ట్‌గానే జగన్‌పై విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సైతం పాపప్రక్షాళన దీక్ష అంటూ హడావుడి చేశారు. తిరుమలలో వారాహి డిక్లరేషన్ పేరుతో పెద్ద సభనే జరిపారు. అది అక్కడ నుంచి ఎన్నో మలుపులు తీసుకుని తమిళనాడు రాజకీయాలు మీదుగా ఢిల్లీ వరకు చేరింది. బీజేపీ నేతలు సైతం అ వివాదంపై గట్టిగానే స్పందించారు. జగన్ ఒక క్రిస్టియన్ అని అందుకే తిరుమల వ్యవహారాలలో ఉదాసీనంగా ఉన్నారంటూ కూటమి నేతలు ఆరోపించారు. మొత్తం వ్యవహారంలో జగన్ ఇమేజ్ ఎంతో కొంత డ్యామేజ్ అయిందన్న అంచనాలు ఉన్నాయి. చివరికి ఆ వ్యవహారం సద్దుమణిగింది.
ఈలోపు టీడీపీ ఛైర్మన్‌గా బీ ఆర్ నాయుడు నియామకం జరిగింది. దీనిపై వైసీపీ కొన్ని విమర్శలు గుప్పించినా చేసేదేమీ లేక మిన్నకుండిపోయింది. బి.ఆర్ నాయుడు కూడా తనదైన శైలిలో తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టారు. అంతా సక్రమంగానే ఉంది సంక్రాంతి సంబరాలకు సొంత ఊరు వెళదామనుకుంటున్న సీఎం చంద్రబాబుకి తిరుమలలో జరిగిన తొక్కిసలాట పెద్ద షాక్ ను ఇచ్చింది.
ఒకవైపు జగన్... మరోవైపు హైందవ సంఘాలు.. టార్గెట్ చంద్రబాబు?
సీఎం చంద్రబాబుని ఇరకాటంలో పెట్టడానికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్న వైసిపికి తిరుమల తొక్కిసలాట వ్యవహారం రాజకీయంగా ఒక అవకాశంలా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలోనూ వైసిపి దీనిని వదులుకోదు. టీటీడీ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ భద్రతా లోపం అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఆ పార్టీ నేతలు క్యూ కడుతున్నారు.
సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుంది కూటమి తీరు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులకు ఇప్పుడు ప్రధానితో శంకుస్థాపనలు చేయించారు. ఏడు నెలల్లో ఈ ప్రభుత్వం తెచ్చిన ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉందా? @ysjagan గారి హయాంలో బల్క్ డ్రగ్‌పార్క్ తెస్తే వద్దని టీడీపీ నేత యనమల… pic.twitter.com/wRAjfPdvlc
— YSR Congress Party (@YSRCParty) January 9, 2025
ఇటీవలే విజయవాడలో " హైందవ శంఖారావం " పేరుతో హిందువుల ఆలయాలు హిందువుల చేతిలోనే ఉండాలంటూ విశ్వహిందూ పరిషత్ ఇతర హిందూ సంఘాలను కలుపుకొని పెద్ద సభను జరిపింది. ఈ సభ వెనక బీజేపీ ఆశీర్వాదం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తిరుమలలో జరిగిన ఈ దుర్ఘటనను వారు తమ డిమాండ్‌ను మరింత గట్టిగా వినిపించేందుకు వాడుకోవడం ఖాయం. స్వామీజీలు, పీఠాధిపతులు కచ్చితంగా తిరుమలలో జరిగిన నిర్వహణా లోపాన్ని, భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఆధారంగా చేసుకుని టిటిడి పాలన మండలిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
చొక్కాలు చింపుకోండి అంటూ రెచ్చగొట్టాడు @PawanKalyan అది వినే ఇద్దరు యువకులు మరణించారు. ఆడపిల్లల మాన, ప్రాణాలంటే ఈ పాలకులకు లెక్కలేదు. దుర్మార్గమైన పాలన, చిత్తశుద్ధిలేని పాలన వల్లే వైకుంఠవాసుడు ఆగ్రహించాడు. టీటీడీ ఛైర్మన్‌గా భక్తిభావం ఉన్న వారిని నియమించాలి. టీడీపీకి వార్తలు… pic.twitter.com/1IZJWCEkU3
— YSR Congress Party (@YSRCParty) January 9, 2025
భక్తుల భద్రత పట్ల నిర్లక్ష్యం చూపిన టీటీడీ అదనపు ఈవో వెంకన్న చౌదరిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీవారి ఆలయం వద్ద శాంతిభద్రతలను కాపాడాల్సిన @APPOLICE100 అధికారులు తమ బాధ్యత విస్మరించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పిన పవన్… pic.twitter.com/PphdXU8GRv
— YSR Congress Party (@YSRCParty) January 9, 2025
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి కూడా ఇది ఇబ్బందే. తాను చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న ' గేమ్ చేంజర్ " ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి వెళ్తూ ఇద్దరు అభిమానులు చనిపోయారు. అది ఇప్పటికే ఆయనకి ఇబ్బందిగా మారితే తాజాగా తిరుమల ఘటన ప్రత్యర్థులకు మరో ఛాన్స్ ఇచ్చింది.
చంద్రబాబును వదలని దుర్ఘటనలు
2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారిగా సీఎం అయిన చంద్రబాబు రాజమండ్రి పుష్కరాలకు వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోవడం ఒక మచ్చలా మారింది. తర్వాత గతేడాది జనవరిలో పండగ కానుక ఇస్తారని చెప్పి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి మహిళలు చనిపోయారు. ఇప్పుడు మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయి ఏడు నెలలు గడవకుండానే తిరుమలలో దుర్ఘటన జరిగింది. భక్తులు మృతి చెందడం ప్రత్యర్థులకు ఒక అవకాశంగా మారింది. అయితే తిరుమల ఘటన చంద్రబాబు సమక్షంలో జరగకపోవడం ఆయనకు ఒక ఊరటనే చెప్పాలి.