YSRCP Third List: నేడు వైసీపీ మూడో జాబితా-సీటు ఉండేదెవరికి..? ఊడేదెవరికి?
YSRCP News: వైఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో ఎంత మంది ఉండబోతున్నారు..? ఎవరెవరి స్థానాలు మారుతున్నాయి? అన్నది ఉత్కంఠగా మారింది.
YSRCP Third List Soon: వైనాట్ 175 లక్ష్యంగా.. నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులు చేర్పులు చేస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP). ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసింది. మొదటి జాబితా (First List)లో 11 మంది, రెండో జాబితా(Second List) లో 27 మంది కలిసి... మొత్తం 38 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. ఈ రెండు జాబితాల్లో కొందరు సిట్టింగ్‌ల సీట్లు గల్లంతు కాగా... మరికొందరికి స్థానచలనలం కలిగింది. ఇవాళ మరో 29 స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో వైసీపీ నేతల్లో (Ysrcp Leadrs) టెన్షన్ కనిపిస్తోంది.
మూడో జాబితాపై.. వారం రోజులుగా విస్తృతంగా కసరత్తు చేస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. సీఎంవో (CMO) నుంచి పిలుపు వచ్చిన నేతలంతా... మూడు, నాలుగు రోజులుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు క్యూకట్టారు. సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితులను ఆరా తీస్తూ... మార్పులు-చేర్పుల గురించి వివరించారు. స్థానికంగా వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కనపెడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయినా... గెలిచిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇస్తామంటూ నచ్చజెప్తున్నారు. మార్పులు-చేర్పుల విషయంలో సీఎం క్యాంప్ ఆఫీసుకు క్యూకడుతున్న ఎమ్మెల్యేలతో... తాడేపల్లిలో రాజకీయం వేడెక్కింది.
అసంతృప్తులకు బుజ్జగింపులు...
మరోవైపు... నిన్న(జనవరి 8వ తేదీ) పెనమలూరు పంచాయితీని కూడా పరిష్కరించింది హైకమాండ్. పార్టీ సీనియర్ నేత పార్థసారథిని తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడారు పార్టీ పెద్దలు. పార్థసారథి సీటు మార్పుపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశారు. అభ్యర్ధులకు చెప్పిన తర్వాతే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. పార్థసారధిని బుజ్జగించి... పెనమలూరు పంచాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇక... నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్‌ను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే ఫైనల్ చేసింది వైసీపీ అధిష్ఠానం. గోపిరెడ్డి, ఆయన వ్యతిరేకవర్గం నేతలతో సమావేశమైన విజయసాయిరెడ్డి... నరసరావుపేట టికెట్‌ను గోపిరెడ్డికే కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. విజయసాయిరెడ్డి నచ్చజెప్పడంతో కలిసిపనిచేసేందుకు అంగీకరించారు. అందరినీ కలుపుకుని జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషిచేస్తామని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మరోవైపు... విజయనగరం జిల్లా ఎస్ కోట పంచాయితీపై ఫోకస్ పెట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మంత్రి బొత్సను కలిసి మాట్లాడారు. రెండు వర్గాలకు సర్దిచెప్పారు మంత్రి బొత్స.
ఎంపీ స్థానాల్లో మార్పులు-చేర్పులపై కసరత్తు..
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతోపాటు... ఎంపీ స్థానాలపై కూడా కసరత్తు చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. బాపట్ల నుండి నందిగం సురేష్, తిరుపతి నుండి గురుమూర్తి, కడప నుండి అవినాష్ రెడ్డి, రాజంపేట నుండి మిథున్‌రెడ్డి పేర్లు ఫైనల్ అయినట్టే. ఇక అనంతపురం ఎంపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా శంకర్‌నారాయణ, హిందూపురం ఇన్‌ఛార్జ్‌గా శాంత, అరకు ఇన్‌ఛార్జ్‌గా భాగ్యలక్ష్మిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది వైఎస్‌ఆర్‌సీపీ హైకమాండ్. నరసరావుపేట నుంచి మోదుగుల వేణుగోపాలరెడ్డి, కర్నూల్ ఎంపీ బరిలో గుమ్మనూరి జయరాం, నరసాపురం నుంచి గోకరాజు రంగరాజు, రాజమండ్రి బరిలో అనుసూరి పద్మలత, ఒంగోలు నుంచి మడ్డిసెట్టి వేణుగోపాల్, విక్రాంత్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. విజయనగరం నుండి చిన్న శీను, అనకాపల్లి నుండి కరణం ధర్మశ్రీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ టికెట్‌ను బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు. విశాఖపట్నం పార్లమెంటు బరిలో బొత్స ఝాన్సీ, గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలును పోటీ దింపే యోచనలో ఉంది వైఎస్ఆర్‌సీపీ. అయితే.. గుంటూరు నుంచి పోటీకి శ్రీకృష్ణ దేవరాయలు ఒప్పుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఎంపీ స్థానాల్లో పోటీకి సినిమా రంగం నుంచి కూడా పలువురికి అవకాశం కల్పించే యోచనలో ఉంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. మచిలీపట్నం నుంచి టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్‌ను పోటీకి దించేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. అలాగే.. నంద్యాల నుంచి నటుడు అలీ, కాకినాడ నుండి చలమలశెట్టి సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి.