BJP Vs YSRCP : కేంద్రంపై విమర్శల జోరు పెంచుతున్న వైఎస్ఆర్‌సీపీ ! బీజేపీతో దూరం పెరుగుతోందా ?
కేంద్ర ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం విమర్శల వాడి పెంచుతోంది. బీజేపీతో వ్యూహాత్మకంగా దూరమయ్యే ప్రయత్నం చేస్తోందా ?
BJP Vs YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో తాము దగ్గర అంటే తాము దగ్గర అని నిరూపించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వాడి పెంచుతోంది. పొత్తులో ఉన్న జనసేన పార్టీ అసలు స్పందించడం లేదు. ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నా .. వారి ఆరోపణల కోణం కేంద్రంపై కాకుండా వైఎస్ఆర్‌సీపీపైనే ఉంటోంది. ఏపీ అధికార పార్టీ కేంద్రానికి లొంగిపోయిందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు మెల్లగా రూటు మారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో విమర్శల జోరు పెంచింది.
మోదీతో యుద్ధం చేస్తున్నానని ప్రకటించుకున్న జగన్ !
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ ఎప్పుడూ మోదీతో పోరాటం అనే మాట రానివ్వలేదు. ప్రత్యేకహోదాను కూడా .. " ప్లీజ్.ప్లీజ్ " అని అడుగుతామనే చెప్పారు. ఆ పద్దతి ప్రకారమే వెళ్తున్నారు. పోలవరం నిధులు..ఏపీ రాజధాని సహా విభజన చట్టంలోని అంశాలు ఏదైనా సరే.. ఎప్పుడైనా కలిసినప్పుడు వినతి పత్రం ఇచ్చామన్న మాటే తప్ప.. అటు పార్లమెంట్‌లో కానీ ఇటు నేరుగా కానీ డిమాండింగ్‌గా అడిగిన సందర్భాలు లేవు . అంత సామరస్యంగా కేంద్రంతో సంబంధాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఎప్పుడూ వినిపించలేదు. మూడేళ్లపాటు బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య ఇదే సుహృద్భావ సంబంధాలు కొనసాగాయి. కానీ ఇప్పుడు మెల్లగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. సీఎం జగన్ ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాను ప్రధాని మోదీతో యుద్ధం చేస్తున్నానని చెప్పుకున్నాడు. కేంద్రమే పోలవరం నిర్వాసితులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. మోదీని జనం తిట్టుకుంటున్నారని ఆయనకే చెబుతానని కూడా చెప్పుకొచ్చారు. ఇక పలుమార్లు కొడాలి నాని వంటి మంత్రులు మోదీని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. ఇప్పుడు నేరుగా పార్లమెంట్‌లో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని వాదించారు. సెస్‌లు.. ఇతర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని వాదించారు. చివరికి కేంద్రం కంటే ఏపీలో పరిపాలన బాగుందని విజయసాయిరెడ్డి ఢిల్లీలోనే గొప్పగా ప్రకటించారు.
రాష్ట్రాల విషయంలో కేంద్రం వైఖరి వైఎస్ఆర్‌సీపీకి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది ?
మూడేళ్లుగా కేంద్రం ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో ఇప్పుడూ అంతే వ్యవహరిస్తోంది. పెద్దాగ తేడా లేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ రాజకీయంగా స్పందిస్తున్న విధానంలోనే తేడా కనిపిస్తోంది. అప్పట్లో కేంద్రం రాష్ట్రాలకు చెందిన అధికారాలను తమ పరం చేసుకోవడానికి ఏవైనా చట్టాలు పెట్టినా.. వివాదాస్పద అంశాలపై బిల్లులు తెచ్చినా వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా ఆమోదం తెలిపేది. పార్టీలో చర్చించడాలు కూడా ఉండవు. ఎన్నార్సీ, సీఏఏ, వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై బిల్లులు పెట్టినా... ఆమోదం తెలిపారు. పొరుగు రాష్ట్ర సీఎం స్టాలిన్ .. ఆయా అంశాలపై పోరాడాలని లేఖలు రాసినా ఏపీ సీఎం వైపు నుంచి స్పందన లేదు. చివరికి సివిల్ సర్వీస్ అధికారుల్ని రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్ర సర్వీసుకు తీసుకోవచ్చన్న ఉత్తర్వులు తెస్తామన్నా.. జగన్ అంగీకరించారు. కానీ ఇతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇంతలా విధేయంగా వైఎస్ఆర్‌సీపీకి ఇప్పుడే కేంద్ర ప్రభుత్వంలోని లోపాలు కనిపిస్తున్నాయి. అదే రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
కేంద్రం సహకరించడం లేదనే ఆగ్రహమా ?
రాష్ట్ర ప్రయోజనాల సంగతేమో కానీ .. వైఎస్ఆర్‌సీపీ ఇస్తున్న సహకారం మేరకు కేంద్రం నుంచి ఆ పార్టీకి సహకారం లభించింది. రాజకీయ పరమైన నిర్ణయాలు బీజేపీ వ్యతిరేకించలేదు. మూడు రాజధానులు లాంటి వాటిని .. రాష్ట్రాల పరిధిలోని అంశం అని చెప్పి .. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. ఇక అప్పుల విషయంలో చూసీ చూడనట్లుగా ఉంటోంది రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారని బహిరంగంగా కనిపిస్తున్నా.. వీలైనంతగా మౌనం పాటిస్తోంది. కాగ్‌కు పూర్తి స్థాయి లెక్కలు ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే శ్రీలంక దివాలా తీసిన తర్వాత రాష్ట్రాల అప్పుల విషయంలో కేంద్రం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏపీ అప్పుల విషయంలోనూ కాస్త గట్టిగా ఉంటోందని.. నిబంధనలకు విరుద్ధంగా రుణాలివ్వొద్దని బ్యాంకులుక లేఖలు రాస్తోందని వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహంగా ఉందని చెబుతున్నారు. అందుకే తమ ఆగ్రహాన్ని ఇలా వెల్లడిస్తోందని అంటున్నారు.
రాజకీయ కారణాలా ?
అయితే బీజేపీ విషయంలో వైఎస్ఆర్‌సీపీ వైఖరి మారడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో పొత్తుల చర్చలు జోరుగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ కూడా చంద్రబాబు విషంయలో గతంలో చూపించని సాఫ్ట్ నెస్ చూపిస్తోంది. చివరి క్షణంలో ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు ప్రకటించినప్పటికీ.. వారితో భేటీ అయ్యారు. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి కూడా పిలుపు వచ్చింది. పలువురు బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో ఏపీలో రాజకీయం మారకూడదన్న ఉద్దేశంతో బీజేపీపై ఒత్తిడి పెంచడానికి వైఎస్ఆర్‌సీపీ .. బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కారణం ఏదైనా ఏపీ రాజకీయాల్లో మార్పు మాత్రం కనిపిస్తోంది.