జనవరి 25న వైసీపీ ఎన్నికల శంఖారావం- 100 సభల్లో పాల్గోనున్న జగన్
Jagan Election Campaign: వైఎస్‌ఆర్‌సీపీలో 59 మంది ఇన్‌ఛార్జులను నియమిస్తూ మూడు జాబితాలను విడుదల చేశారు. ఇప్పుడు నాల్గో జాబితాపై కసరత్తు చేస్తోంది.
YSRCP Plans For Andhra Pradesh Assembly Elections 2024: నోటిఫికేషన్(General Election Notification 2024) రాక ముందు నుంచే ప్రజల్లో వైసీపీ(YSR Congress) వాదం బలంగా వ్యాప్తి చేయాలని జగన్(Jagan) ప్లాన్ చేస్తున్నారు. అందులో బాగంగా 25న భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను దాదాపు ఖరారు చేస్తూ ఇన్‌ఛార్జులను నియమిస్తున్నారు. ఆఖరి నిమిషంలో ఒకట్రెండు తప్ప పెద్దగా మార్పులు ఉండబోవని వైసీపీ లీడర్లు చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఎలాంటి అసంతృప్తి లేకుండా సాఫీగా ఎన్నికలకు వెళ్లేందుకు ముందే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.
నాల్గో జాబితాపై కసరత్తు
వైఎస్‌ఆర్‌సీపీలో 59 మంది ఇన్‌ఛార్జులను నియమిస్తూ మూడు జాబితాలను విడుదల చేశారు. ఇప్పుడు నాల్గో జాబితాపై కసరత్తు చేస్తోంది. జగన్ జిల్లా పర్యటనకు వెళ్లే నాటికి దాదాపు అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల నియామకాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి వారంతా ప్రజల్లో ఉండాలని వైసీపీ నినాదమే జనంలో ఉండేలా చూస్తున్నారు.
ప్రత్యర్థుల పొత్తులు కలిసి వస్తాయని నమ్మకం
పొత్తులతో ప్రతిపక్షాలు ఇంకా చర్చల దశలో ఉన్నారు. ఇంకా అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి కసరత్తు చేయలేదు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఖరారు చేసుకొని అభ్యర్థులను ప్రకటించే నాటికి అసంతృప్త రాగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని వైసీపీ అనుకుంటోంది. ఆ వివాదాలను చల్లార్చే పనిలో ప్రతిపక్షాలు బిజీ అవుతాయని అది తమకు బాగా కలిసి వస్తుందని అంటున్నారు. దాన్ని ప్రజలకు చూపించి న్యూట్రల్ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవచ్చని భావిస్తోంది.
ఎన్నికల వరకు ప్రజల్లోనే
ఓవైపు షర్మిల కూడా దూసుకొస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగ ముందేఅభ్యర్థులు ఖరారు చేయడంతోపాటు, ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ ప్లాన్. ప్రతి ఇంటికి సంక్షేమం అందించామని దాన్నే జోరుగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఇంటింటికీ నేతలు వెళ్లి గతానికి ఇప్పటికి తేడాను వివరించాలని చెబుతున్నారు. వైనాట్ 175 నినాదాన్ని బలంగా వినించాలని చూస్తున్నారు.
పార్టీ నేతలంతా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగే టైంలోనే అధ్యక్షుడు జగన్ కూడా జిల్లాలు చుట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు.
జనవరి 25న శంఖారావం
ఇందు కోసం జనవరి 25న భీమిలిలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అధికారిక కార్యక్రమాలు తగ్గించుకొని పూర్తిగా పార్టీపైనే ఫోకస్ పెట్టబోతున్నారు. ఓవైపు బహిరంగ సభల్లో పాల్గొంటూనే పార్టీకి అనుబంధంగా ఉండే సంఘాల నేతలతో ముచ్చటించనున్నారు. సర్పంచ్‌లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు.
వంద సభల్లో పాల్గొనేలా ప్లాన్
నోటిఫికేషన్ వెలువడే నాటికి రోజుకు రెండు సభల్లో పాల్గొనేలా వ్యూహాన్ని రచిస్తున్నారు జగన్. ప్రతిపక్షాలు తీసుకొచ్చే మేనిఫెస్టుకు దీటుగా తాము అమలు పరిచిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అదే టైంలో మరో ఆకర్షణీయమైన ఎన్నికల హామీ పత్రం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నాటికి వంద సభల్లో పాల్గొని తమ విధానాలు, అమలు చేసిన పథకాలు, అమలు చేయబోయే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రత్యర్థులపై పైచెయి సాధించేలా వ్యూహాన్ని రచిస్తున్నారు.