Three Capitals BJP Stand : మూడు రాజధానులు చేయాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి ! బీజేపీని కాదని జగన్ ముందుకెళ్లగలరా ?
బీజేపీ సహకారం లేకుండా వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానులు చేయడం సాధ్యం కాదు. మరి బీజేపీ మద్దతు ఇస్తుందా ? కేంద్రం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది ?
Three Capitals BJP Stand : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ మూడు రాజధానులు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని సమస్య. ప్రభుత్వం చేయాలనుకుంటోంది. విపక్షాలన్నీ వద్దంటున్నాయి. చట్టమూ సహకరించడం లేదు. కానీ " ప్రయత్నిస్తే అసాధ్యం కానిదేదీ లేదు" అనే టైపులో స్ఫూర్తి నింపుకుని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఈ మొత్తం వ్యహారం ఎటు తేలాలన్నా బీజేపీ కీలకం. బీజేపీకి ఏపీలో ఎలాంటి బలం లేకపోయినప్పటికీ.. కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ ఓకే అంటేనే మూడు రాజధానుల బండిని కాస్త ముందుకు కదపగలుగుతుంది. లేకపోతే లేదు. మరి కేంద్రంలోని బీజేపీ వైఖరేంటి ? అమరావతే అంటున్న ఏపీ బీజేపీ నేతల విధానానికే కట్టుబడతారా ? అదే జరిగితే జగన్ మూడు రాజధానుల్ని ఎప్పటికైనా చేయగలరా ?
అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ !
ఏపీ నూతన రాజధానికి బీజేపీకి ప్రత్యేకమైన అనుబంధం ఉది. ఎందుకంటే రాజధానిగా అమరావతిని ఖరారు చేసింది ఒక్క టీడీపీ ప్రభుత్వం కాదు. టీడీపీ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. ప్రభుత్వంలో అప్పట్లో బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. అమరావతికి సంబంధించిన ప్రతీ అంశం వారికి తెలుసు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు. అందుకే భారతీయ జనతా పార్టీకి అమరావతి నిర్ణయంలో భాగం ఉంది.
మూడు రాజధానులకు సహకరించారనే విమర్శలు !
తెలుగుదేశం పార్టీ అధికారలో ఉన్నప్పుడు అమరావతికి సంబంధించి అన్నీ సాఫీగా సాగిపోయాయి. బీజేపీ మద్దతు ఎంతో లభించింది. పర్యావరణ అనుమతులు దగ్గర్నుంచి వివిధ రకాల ఆటంకాలు వీలైనంత త్వరగా పూర్తయ్యాయి. ప్రపంచ బ్యాంగ్ నిధుల కోసం మద్దతు లభించింది. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నా బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. బీజేపీ తరపున ఏపీ వ్యవహారాలు చూసే జీవీఎల్ నరసింహారావు .. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని.. పదే పదే ప్రకటిస్తూ.. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి నైతిక మద్దతు అందించారు. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని.. అది గత ప్రభుత్వం.. ప్రస్తుత సీఎం జగన్ అంగీకారంతోనే అమరావతిగా నిర్ణయించిందని జీవీఎల్ పరిగణనలోకి తీసుకోలేదు. మార్చుకోవడం ఏపీ సర్కార్ ఇష్టమన్నారు. ఆయన మాటలకు తగ్గట్లుగా కేంద్రం కూడా పట్టించుకోలేదు. అంటే బీజేపీ హైకమాండ్.. కేంద్రం కూడా జగన్ ప్రయత్నాలను అడ్డుకోలేదు. అలాగని ప్రోత్సహించలేదని అనుకోవచ్చు. కానీ న్యాయపోరాటం ద్వారా రైతులు తమ రాజధానిని చట్ట పరంగా కాపాడుకోగలిగారు.
ఇప్పుడు బీజేపీ విధానంలో అనూహ్యమైన మార్పు !
వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత అమరావతి విషయంలో కొంత మంది బీజేపీ నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల వారిలోనూ మార్పు వచ్చింది. అమరావతికి భేషరతు మద్దతు పలికారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అమరావతి గ్రామాల్లో పాదయాత్ర చేశారు. గతంలో తాము వ్యవహరించిన విధానంపై విమర్శలు ఎదురైనా ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. తమ విధానం అమరావతేనని స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్రం నుంచి కూడా అమరావతికే సానుకూలం అనే రీతిలో ప్రకటనలు రావడం ప్రారంభమైంది. కొత్తగా విడుదల చేసిన ఇండియామ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే గుర్తించారు. విభజన చట్టం ప్రకారం ఒకే రాజధాని అని స్పష్టత వచ్చేలా విభజన సమస్యలపై చర్చల ఎజెండాలో చేర్చారు. జీవీఎల్ నరసింహారావు పూర్తిగా అమరావతే రాజధాని అని చెబుతున్నారు. ఏపీ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులు కూడా అమరావతే రాజధాని అని స్పష్టం చేస్తున్నారు. అంటే జగన్ మూడేళ్ల కిందట మూడు రాజధానులన్నప్పుడు పరోక్షంగానైనా బీజేపీ సహకారం ఉంది కానీ ఇప్పుడు నేరుగా అమరావతికే మద్దతు ప్రకటించినట్లుగా స్పష్టమయింది.
బీజేపీ మద్దతు లేకుండా మూడు రాజధానులు జగన్ చేయగలరా ?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు లేకుండా మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయడం కానీ.. అసెంబ్లీలో పాస్ చేసుకోవడం కానీ..చట్టంగా మార్చడం గా కానీ చేయలేరు. ఎందుకంటే ఇప్పటికే మూడు రాజధానుల అంశం హైకోర్టులో తేలిపోయింది. మరోసారి బలం ఉందని బిల్లును ఆమోదించినట్లయితే.. అది కోర్టు ధిక్కరణ అవుతుంది. గవర్నర్ సంతకం చేయరు. పైగా రాజ్యాంగ ఉల్లంఘన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశంలో బీజేపీ మద్దతు ఉంటేనే ముందుకెళ్లే అవకాశం ఉంది. లేకపోతే ఎన్నికలక వరకూ టైం పాస్ చేసి.. ఎన్నికల్లో మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్లే చాన్సులున్నాయి. అయితే ఎవరు గెలిచినా మూడు రాజధానల ఏర్పాటు మాత్రం సాధ్యం కాదు. కేంద్రం మద్దతు ఉంటే మాత్రం ముందడుగు పడే అవకాశం ఉంది.