రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్, పొలిటికల్ గాసిప్స్‌కు కిక్ ఇచ్చిన షర్మిల
రాహుల్ గాంధీకి షర్మిల విష్ చేయడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. శివకుమార్‌తో పలుమార్లు భేటీ... ఇప్పుడు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 53 ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఆయన బర్త్‌డే సందర్భంగా చాలా మంది ప్రముఖులు, పార్టీ శ్రేణులు విషెస్ చెబుతున్నారు. అయితే వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వానికి, వైఎస్ కుటుంబానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అప్పట్లో జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారని.. తిరగబడితే జైల్లో కూడా పెట్టించారని వైఎస్ ఫ్యామిలీ ప్రచారం చేసింది. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ నుంచి ఎవరూ కాంగ్రెస్ అధినాయకత్వం పేరు వింటేనే విమర్శలు అందుకుంటారు.
2019 ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వైఎస్ జగన్‌కు షర్మిలకు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో షర్మిల తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టుకున్నారు.
ఏపీలో జగన్ అనుసరించిన వ్యూహాన్నే షర్మిల కూడా తెలంగాణలో ఫాలో అయ్యారు. పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి తాను రాజన్న బిడ్డనని... ఆయన పాలన మరోసారి రావాలంటే తనను గెలిపించాలని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అదే ఏపీలో విజయవంతమైన ఫార్ములా తెలంగాణలో ఆకట్టుకోలేకపోయింది. సభలు, సమావేశాలు, ధర్నాలు, పాదయాత్రలు చేస్తున్నప్పటికీ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్లలేకపోయింది. షర్మిల తప్పిస్తే పేరున్న నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా పోయారు.
ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తన మార్క్ రాజకీయంతో షర్మిల వార్తల్లో ఉంటున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొస్తానంటూ చెబుతూనే ఉన్నారు. అయితే ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కర్ణాటకలో ఆ పార్టీ విజయం సాధించిన తర్వాత అధినాయకత్వం ఆమెతో స్వయంగా మాట్లాడిందన్న వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ పుకార్లు నడుస్తున్న టైంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి వెన్నుదన్నుగా ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఆమె సమావేశమయ్యారు. దీంతో ఏదో జరుగుతుందన్న అనుమానం అందరిలో కలిగింది.
ఓ సందర్భంగా ప్రెస్‌మీట్ పెట్టిన షర్మిల కాంగ్రెస్‌లో కలిసి నడుస్తానన్న వార్తలు కొట్టిపారేశారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానంటూ కుండబద్దలు కొట్టారు. ఆమె ఎన్నిసార్లు ఈ విషయాన్ని చెబుతున్నా పుకార్లు మాత్రం ఆగడం లేదు. రెండు రోజుల క్రితం కూడా డీకే శివకుమార్‌తో భేటీ అయిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇవాళ రాహుల్ బర్తడే సందర్భంగా విషెస్ చెప్పడంతో ఆ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ట్విట్టర్ వేదికగా రాహుల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన షర్మిల... ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు కావాలని ఆకాంక్షించారు. పట్టుదల, సహనంతో నిత్యం ప్రజలకు స్పూర్తివతంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది మంచి ఆరోగ్యం, ఆనందంతోపాటు మరెన్నే గొప్ప విజయాలు సాధించాలని విష్ చేశారు.
డీకే శివకుమార్ ద్వారా షర్మిలతో ప్రియాంక రాయబారం నడిపారని... కాంగ్రెస్, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ విలీనం ఖాయమనే వార్తలు సోషల్ మీడియాలో రోజూ తిరుగుతున్నాయి. ఇప్పుడు రాహుల్‌కు కొత్తగా శుభాకాంక్షలు చెప్పడంతో ఆ పుకార్ల సృష్టించే వారికి మరింత అవకాశం ఇచ్చారు షర్మిల. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఆమెను ఏపీకి తీసుకెళ్లారని... తెలంగాణలో కలిసి పోటీ చేసిన ఆమెను ఏపీకి పరిమితం చేస్తారనే ప్రచారం కూడా ఉంది.
Wishing Shri @RahulGandhi ji a very happy and a wonderful birthday. May you continue to inspire the people with your perseverance and patience, and serve them through your sincere efforts. Wishing you great health, happiness, and success in abundance.
— YS Sharmila (@realyssharmila) June 19, 2023