Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Telangana : మూసీ సుందరీకరణ చేయాలనుకున్న ప్రతి సీఎం మధ్యలో వదిలేశారు. ఇప్పుడు రేవంత్ పట్టుదల చూపిస్తున్నారు. ఆయన వల్ల అవుతుందా ?
YS and KCR tried to beautify Musi and failed : వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మూసీ సుందరకీరణ ప్రాజెక్టు చేపట్టాము. నిధులు కూడా కేటాయించాము. కానీ ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి.. మూసీ ప్రక్షాళనకు చాలా నిధులు అవసరం కాబట్టి పక్కన పెట్టాము అని.. సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ ఆత్మగా పేరొందిన కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖలో చెప్పారు. కేసీఆర్ హయాంలో మూసీ సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. కేసీఆర్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును సీరియస్ గా తీసుకున్నారని కానీ.. భారీగా నిర్వసితులు ఉంటారని.. వారికి పరిహారం చెల్లించడానికి నిధులు లేవు కాబట్టి పక్కన పెట్టేశారని చెప్పారు. అంటే.. బలమైన సీఎంలుగా పేరు పొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ మూసీ విషయంలో చాలా తీవ్రంగా ప్రయత్నించిన విఫలయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ బాధ్యతను అంత కంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇద్దరు సీఎంలు చేయలేకపోయిన ప్రాజెక్టును నెత్తికెత్తుకున్న రేవంత్
మూసీ సుందరీకరణ అనేది రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అనుకోవచ్చు. ప్రయత్నించి విఫలమైన వైఎస్, కేసీఆర్ ల కంటే రేవంత్ ప్రణాళికాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మూసీని ప్రక్షాళన చేసి డ్రైనేజీ కలవకుండా చేసి నదిని నదిలా ఉంచాలన్నది కేసీఆర్, వైఎస్ ప్లాన్. అది చేయాలంటే ఆక్రమణలు తొలగించాలి. అక్కడ ఉండేది అంతా పేదలే కాబట్టి.. వారికి ఖచ్చితంగా పునరావాసం చూపించాలి. అలా చూపించడానికి కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. అందుకే అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా రేవంత్ అలా వారిని తరలించడమే కాకుండా.. మూసీ చుట్టూ ఆ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే లక్షన్నర కోట్ల ప్రణాళికలు వేస్తున్నారు . ఎన్ని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు.
పునరావాసానికి పది వేల కోట్లు అయినా ఇస్తామన్న రేవంత్
పునరావాసం చూపించాల్సిన వారికి రూ. పది వేల కోట్లు అయినా ఇస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇతర బీజేపీ, బీఆర్ఎస్‌కు చెందిన వారు పేదల్ని రెచ్చగొట్టకండా.. వారి సమస్యకు పరిష్కారం చూపేందుకు కలసి రావాలని పిలుపునిస్తున్నారు. పేదలను.. మూసీలోనే ఉంచడం కన్నా.. వారికి పునరావాసం కల్పిస్తే నష్టమేమనిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజా స్పందన ఎలా ఉన్నా రేవంత్ రెడ్డికి పెను సవాల్ ఎదురుగా ఉన్నట్లే. అందరూ మూసి రివర్ బెడ్ మీద ఇళ్లు కట్టుకుని ఉంటే ఖాళీ చేయడానికి సిద్దపడకపోవచ్చువారందర్నీ ఒప్పించాలంటే ఎంతో కష్టపడాలి. ఆ తర్వాత నిధుల సమస్య ఎలాగూ వస్తుంది.
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
ఒత్తిడి తట్టుకోలేక మధ్యలోనే వదిలేస్తారా ?
గత సీఎంలు కూడా మూసీని సుందరీకరించేందుకు మొదట్లోనే గట్టి ప్రయత్నాలు చేశారు. అడుగు ముందుకు వేసే కొద్దీ ఆ ప్రాజెక్టు చేపట్టడం చాలా కష్టమన్న భావనకు వచ్చి వదిలేశారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో ఉన్నారు. ఆయన లో ఉత్సాహం ఉంది. కానీ ఎదురవుతున్ నసవాళ్లు చిన్నవి కావు. వాటిని ఎదుర్కుని మందుకు వెళ్లాలంటే ఎన్నో శక్తియుక్తులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈ ఒత్తిడి అంతా తనకు ఎందుకని సేఫ్ గేమ్ ఆడాలని అనుకుంటే..ఆయన కూడా మూసీ ప్రాజెక్టును పక్కన పెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే.. మరో సీఎం టేకప్ చేసే వరకూ మూసీ నది మురికి కాలువలాగే ఉండిపోతుంది.