శ్రీకాకుళం ఎంపీ స్థానంపై వైసీపీ గురి- ఈసారి పోటీలో ఉండేది మంత్రా? స్పీకరా?
శ్రీకాకుళం ఎంపీ స్థానంపై వైసీపీ గురి పెట్టింది. రామ్మోహన్‌ను ఎలాగైనా ఆ సీటు నుంచి దించాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. దీనికి సరైన నేతను ఎంచుకునే పనిలో బిజీగా ఉంది.
సిక్కోలు పార్లమెంట్ సీట్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకొని మూడు ఎంపీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. అందులో సీట్లలో ఒకటి శ్రీకాకుళం. అయితే కింజరాపు కుటుంబానికి కంచుకోటగా మారిన శ్రీకాకుళంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలని చూస్తున్నారు సీఎం జగన్. గత రెండు ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై ప్రతీకారం తీర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాల లెక్కలు తీస్తూ కింజరాపు కుటుంబ హవాకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అలాంటి నేత కోసం జల్లెడ పడుతున్నారట జగన్.
సిక్కోలులో టీడీపీ కొట్టడానికి వైఎస్‌ఆర్‌సీపీ భారీ ప్లానే వేస్తోంది. 1996 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మినహా మరెప్పుడూ ఓడిపోని తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బతీయాలని స్కెచ్ వేస్తున్నారు జగన్. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సునామీ సృష్టించిన వైఎస్‌ఆర్‌సీపీ.. సిక్కోలులో మాత్రం ఎదురుదెబ్బ తింది. 25 ఎంపీ సీట్లలో 22 గెలిస్తే.. గెలవని.. గెలవలేని నియోజకవర్గంగా సిక్కోలు మిగిలిపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆయన అన్న కుమారుడు ఎంపీ రామ్మోహన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సిక్కోలు నుంచి ఎంపీ రామ్మోహన్ రెండుసార్లు గెలిచారు. 2014లో తొలిసారి ఆయన ఎంపీగా గెలిచినప్పుడు.. తండ్రి మరణంతో వచ్చిన సానుభూతి పనిచేసిందని అంతా లెక్కలు వేసుకున్నారు. యువకుడు కావడంతో కలిసొచ్చిందని భావించారు. కానీ, 2019లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. ఐదు చోట్ల వైసీపీ గెలిచినా ఎంపీ సీటు గెలవలేకపోయింది. ఇక అప్పటి నుంచి ఈ స్థానంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టింది వైసీపీ.
2014లో కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతిని.. 2019లో కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌ను పోటీకి పెట్టి విఫలమైంది వైసీపీ. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా మూడు సామాజిక వర్గాలు ఉంటే రెండు సామాజికవర్గాల నేతలకు ఛాన్స్ ఇచ్చినా గెలుపు రుచి చూడలేకపోయింది.
ఈసారి మిగిలిన ప్రధాన సామాజిక వర్గం వెలమలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు జగన్. జిల్లాలో సీనియర్ మంత్రి ధర్మప్రసాద్‌కు ఎంపీ పదవి పోటీ చేయాలని నేరుగాని ముఖ్యమంత్రి చెప్పారట. దానికి ధర్మాన ప్రసాదు అంగీకరించలేదని టాక్. ఎంపీగా ధర్మానను పోటీ చేయనిస్తే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం ఎవరికి ఇస్తారు అనేదానిపై రచ్చ నడుస్తోంది.
అదే టైంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పోటీలో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. తన కుమారుడికి అసెంబ్లీ సీటు ఇస్తే ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అంటున్నారని తెలుస్తోంది. ఇది సమాజిక సమీకరణల పరంగా కూడా కలిసి వస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎంపీ స్థానంపై సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఒక లెక్కైతే శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరొక రెండు మూడు రోజుల్లో శ్రీకాకుళం కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ అవుతారని అక్కడే స్పష్టత ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.