AP ByElections : ఏపీలో ఉపఎన్నికలు వస్తాయా ? వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తల ప్లాన్ ఏంటి ?
ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేస్తారా? ఏపీలో ఉపఎన్నికలు వస్తాయా?ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతుంది ?ఇతర అసంతృప్తులు బయటకు రాకుండా ఆపడానికా ?
AP ByElections : క్రాస్ ఓటింగ్ చేశారని నలుగురు ఎమ్మెల్యేల్ని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. వారిపై అనర్హతా వేటు వేస్తారా అన్నచర్చ కూడా ప్రారంభమయింది. ప్రస్తుతానికి పార్టీ నుండి వారిని సస్పెండ్ చేసినప్పటికీ అనర్హత వేటు వేయడానికి జరగాల్సిన ప్రక్రియపై అధిష్టానం ఫోకస్ పెట్టిందని ప్రచారం జరుగుతోంది. అయితే అనర్హతా వేటు వేయడానికి సాంకేతికంగా అవకాశం లేదని.. చెల్లదని అంటున్నారు. అసంతృప్తితో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు గీత దాటకుండా ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది.
సస్పెన్షన్ల తర్వాత వాట్ నెక్ట్స్ ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎప్పుడూ ఒకేసారి ఒకే సందర్భంలో ఒకే పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులను పార్టీ నుండి సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం లోనూ , ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలోనూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఒకరిద్దరు శాసనసభ్యులను మాత్రమే సస్పెండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురిలో ఇద్దరు గత మూడు నెలలుగా వివిధ కారణాలవల్ల పార్టీకి దూరంగా ఉంటుండగా మరో ఇద్దరు రెండు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఓటు వేశారన్న కారణంతో అధిష్టానం వారిని పార్టీ నుండి బయటకు సాగనంపింది. 2010లో ఆవిర్భవించిన వైసీపీ నుండి ఇప్పటి వరకూ ఒక్క ఎమ్మెల్యే కూడా సస్పెండ్ కాలేదు.
గతంలో జగన్ ఆదేశాలతో రాజీనామాలు - ఇప్పుడు ధిక్కరణ
గతంలో ఇదే పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అధినాయకుడు జగన్ ఆదేశాలతో తమ పదవులకు రాజీనామా చేశారు. 2009లో కాంగ్రెస్‌లో గెలిచిన నెల్లూరు ఎంపీ మేక పాటి రాజమోహన్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (టీడీపీ) అప్పట్లో జగన్ వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మేకపాటి సోదరులు కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామ చేశారు. అలాగే నల్లపరెడ్డి తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి అదే స్థానాల నుండి వైసీపీ అభ్యర్దులుగా పోటీచేసి గెలుపొందారు. అయితే 2013 చివరిలో ప్రత్యేక హోదా కోసం అప్పటి నెల్లూరు ఎంపీగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ ఆదేశాల మేరకు వరుసగా రెండోసారి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇలా పార్టీకోసం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు గతంలో పదవులకు మాత్రమే రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. కానీ ఇప్పుడు ధిక్కరించడం వల్ల సస్పెండైన వారిలో మేకపాటి కూడా ఉన్నారు.
సాంకేతికకంగా అనర్హత సాధ్యం కాకపోవచ్చు !
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతా వేటు వేయాలంటే కొన్ని ఖచ్చితమైన ఉల్లంఘనలకు పాల్పడి ఉండాలి. వేరే పార్టీలో చేరడం, విప్ ను ధిక్కరించడం ఇందులో కీలకం. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ సస్పెండ్ చేయక ముందు ఇతర పార్టీలో చేరలేదు. అలాగే విప్ ను ధిక్కరించలేదు. రహస్య ఓటింగ్ లో విప్ ను ధిక్కరించారని తేల్చడానికి ఆధారాలు ఉండవు. అసెంబ్లీలో బిల్లుల పైచర్చ సందర్భంగా బహిరంగ ఓటింగ్ జరుగుతుంది. అప్పుడు లేదా బలపరీక్ష సమయంలో ధిక్కరిస్తే అనర్హతా వేటు పడుతుంది. కానీ ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయలేరు.
అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్న వారిని కంట్రోల్ చేయడానికా ?
వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి జ్వాల ఉందని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. కొంత మంది శాసనసభ్యులు అధిష్టానం తీరుపై తీవ్ర అసం తృప్తితో ఉన్నారని ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా 26 మంది సభ్యులతో జాబితాను కూడా తయారు చేసి ఐ ప్యాక్ కూడా అధిష్టానానికి అందించిందని అంటున్నారు. వీరందరి అసంతృప్తి బయట పడకుండా.. ఇలాంటి అనర్హతా వేటు ప్రచారంద ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.