Karnataka Effect : కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందా ? బీజేపీ, కాంగ్రెస్ ఆశలేంటి ?
కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందా ?కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ తీసుకుంటారా ?బీజేపీ గెలిస్తే ఇక్కడా కమలం వికసిస్తుందా ?బీఆర్ఎస్ - జేడీఎస్ ప్రభావం ఎంత ?
Karnataka Effect : కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్కడ ఎవరు గెలుస్తారన్నదానిపై ప్రజలు, సర్వే సంస్థలు ఓ అంచనాకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని ఏబీపీ - సీ ఓటర్ ఓపీనియర్ పోల్‌లో స్పష్టమైన అభిప్రాయ వినిపిస్తోంది. అయితే బీజేపీ అవకాశాల్ని తోసి పుచ్చలేం. మళ్లీ హంగ్ వచ్చే పరిస్థితుల్నీ కాదనలేం. అయితే ఖచ్చితంగా అక్కడి ఫలితాలు తెలంగాణ రాజకీయంపై ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీకి తెలంగాణలో ఊపు వస్తుంది. అధికారం కోసం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయి. కర్ణాటకలో గెలిచే పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది.
కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎంత ఉంటుంది ?
రాజకీయాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు దాని పక్క రాష్ట్రంలో పడటం సర్వసాధారణం. తెలంగాణలో కాంగ్రెస్ మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వారికి నైతిక ధైర్యం కావాలి. ఆ ధైర్యం కర్ణాటక ప్రజలు ఇస్తారని నమ్ముతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ నేతలు సంబరాలు చేసుకోవడం ఖాయం. సరిహద్దు ప్రాంతాల్లో ఆ ప్రభావం నేరుగా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా గెలిచే పార్టీ కాంగ్రెస్ అన్న భావన వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు కర్ణాటకలో గెలవడానికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని అక్కడి నేతలకు చెబుతున్నారు. ప్రచారానికి వెళ్తున్నారు. పాదయాత్రను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి కూడా తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో ముందు నుంచీ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకుంటే బీజేపీకి అడ్వాంటేజ్ !
దక్షిణాదిన ఎదగాలనుకుంటున్న బీజేపీ కాలం కలసి రావడం లేదు. బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరు ఉంది. దీనికి కారణం దక్షిణాదిన ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోవడమే. అతి కష్టం మీద కర్ణాటకలో మాత్రం రెండు మూడు సార్లు అధికారం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఆ పార్టీ ఎదురీదుతోంది. కర్ణాటకలో బీజేపీ స్వతహాగా విజయం సాధించలేదు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కుమార స్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చారు. అదే బీజేపీకి మైనస్ అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ బీజేపీని తేలికగా తీసుకోలేరు చివరి వరకూ పోరాడుతుంది. అందుకే ఆ పార్టీ గెలిస్తే ఇక్కడ కూడా సంచనాలు నమోదవుతాయి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ విస్తరించాలనుకున్న రాష్ట్రం తెలంగాణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలు దక్కించుకుంది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధిస్తామని చెబుతూ వస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ ఈజీగా గెలుస్తామని బీజేపీ చెబుతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. పాత హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత కర్ణాటకలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ లక్ష్మణ్ తదితరులున్నారు. బీదర్‌లో జరిగిన అమిత్ షా సభలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావటంతో కర్ణాటకలో ప్రచారానికి మరికొంత తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు మోదీ అమిత్ షా జేపీ నడ్డాలు ప్రత్యేక దృష్టి సారించారు.
బీఆర్ఎస్ ప్రభావం ఎంత ?
కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లను కీలకంగా భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కూడా తెలుగు ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని అక్కడ రాజకీయాలు చేయబోతోందని అనుకున్నారు. కేసీఆర్ కూడా అదే ప్రకటించారు. కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. చివరి క్షణంలో జేడీఎస్‌కు మద్దతు పలికే అవకాశం ఉందేమో కానీ పోటీ చేసే చాన్స్ లేదు. ఒక వేళ బీఆర్ఎస్ సపోర్ట్ చేసి జేడీఎస్ కింగ్ మేకర్ అయితే.. భారత రాష్ట్ర సమితికి అడ్వాంటేజ్ లభించవచ్చు. అయితే కర్ణాటక రాజకీయాలు వేరు తెలంగాణ రాజకీయాలు వేరు. అక్కడి రాజకీయాలు తెలంగాణపై నేరుగా ప్రభావం చూపే అవకాశాలని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ ఓ రకమైన మోరల్ సపోర్టు గెలిచిన పార్టీకి వస్తుంది. కాంగ్రెస్ లాంటి పార్టీకయితే నిధుల సమస్య కూడా తీరవచ్చు. అందుకే కర్ణాటక ఎన్నికలపై తెలంగాణ రాజకీయ పార్టీలు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయని అనుకోవచ్చు.