Khammam Politic: కృతజ్ఞతా సభకు హాజరుకాని తుమ్మల- అసలు ఏం జరిగిందో..?
తుమ్మల నాగేశ్వరరావు సభకు హాజరుకాకపోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే తుమ్మల అనుచరులు మాత్రం ఆయనకు ఆహ్వానం అందలేదని చెబుతున్నారు.
నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ అనుభవం.. అటు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కెబినెట్ మంత్రిగా.. నూతనంగా ఏర్పాటైన తెలంగాణలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు వ్యవహారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తరుచూ సంచలనంగానే మారుతుంది. గత కొద్ది రోజుల క్రితమే తాను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ప్రకటించిన తుమ్మల ఇప్పుడు సత్తుపల్లిలో జరిగిన సభకు హాజరుకాకపోవడం రాజకీయాల్లో కాక లేపుతుంది.
తుమ్మల నాగేశ్వరరావు ఈ పేరు రెండు రాష్ట్రాలలో అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావు తర్వాత రాజకీయంగా అంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తిగా తుమ్మలను గుర్తించవచ్చు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ కేబినెట్‌లోనూ, చంద్రబాబు కేబినెట్‌లోనూ పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ సూచనతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆయన కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తుమ్మల మాత్రం గత నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
2018 ఎన్నికల్లో ఓటమితో..
2015లో జరిగిన పాలేరు ఉపఎన్నికల్లో విజయం సాధించిన తుమ్మల నాగేశ్వరరావు మూడేళ్లలో ఆ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులన చేపట్టారు. పాలేరు రిజర్వాయర్ నుంచి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన భక్త రామదాసు ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో పూర్తి చేసి సీఎం కేసీఆర్ మనన్నలు పొందారు. అయితే అనూహ్యంగా 2018 ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ఆయన రాజకీయాలకు కొద్దిగా దూరంగానే ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రేస్ పార్టీ తరుపున విజయం సాధించిన కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో వివాదం కాస్తా ముదిరింది. పాలేరులో తుమ్మల వర్గీయులు, కందాల వర్గీయుల మధ్య వైరం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అయితే తాను పాలేరులోనే ఈదఫా పోటీ చేస్తానని తుమ్మల చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తుమ్మల పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. అయితే ఇటీవల తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తాను టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నూతనంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బండి పార్థసారది, వద్దిరాజు రవిచంద్రలకు సత్తుపల్లిలో ఘనసన్మానం ఏర్పాటు చేశారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానం అందింది. అయితే ఈ సభకు తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతారని అందరు భావించినప్పటికీ ఒక్క తుమ్మల మినహా మిగిలిన నేతలు హాజరుకాకపోవడం గమనార్హం.
గైర్హాజరుకు కారణం ఏంటో..?
తుమ్మల నాగేశ్వరరావు సభకు హాజరుకాకపోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. అయితే తుమ్మల అనుచరులు మాత్రం ఆయనకు ఆహ్వానం అందలేదని చెబుతున్నారు. సీనియర్ నేతగా ఉన్న తుమ్మలకు ఆహ్వానం పలకకుండా ఎలా ఉంటారనేది ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ తాను రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని, టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటానని చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు సత్తుపల్లి సభకు హాజరుకాకపోవడం వెనుక కారణం మాత్రం అర్థం కావడం లేదు. తాను రాజకీయ అరంగ్రేటం చేసిన సత్తుపల్లిలో జరిగిన పెద్ద సభకు ఆయన హాజరుకాకపోవడం పార్టీ సంస్థాగతంగాను చర్చ సాగుతుంది. తుమ్మల నాగేశ్వరరావుకు ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉంది. అందులో సత్తుపల్లి ప్రాంతంలోనే ఆయన ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగే సభకు తుమ్మల హాజరుకాకపోవడం చూస్తే ఆయనకు సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం వల్లేనని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గత నాలుగు దశాబ్ధాలుగా జిల్లాలో రాజకీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కీలకనేత తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి సభకు హాజరుకాకపోవడం మాత్రం ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలను కలవరపెడుతుంది.