AP Parties On UCC : యూసీసీని నేరుగా వ్యతిరేకించని ఏపీ రాజకీయ పార్టీలు - బీజేపీతో సంబంధాల కోసమేనా ?
యూసీసీని వ్యతిరేకించడంలో ఎందుకు సంశయిస్తున్నాయి ?వ్యతిరేకిస్తే బీజేపీకి కోపం - అనుకూలమంటే ముస్లింలకు కోపంఒకే రోజు సమావేశాలు పెట్టి జగన్, చంద్రబాబు ఏం చెప్పారు ? స్పష్టమైన అభిప్రాయం చెప్పలేరా?
AP Parties On UCC : దేశవ్యాప్తంగా మైనార్టీ వర్గాల్లో ఆందోళనకు కారణం అవుతున్న యూనిఫాం సివిల్ కోడ్ అంశంలో తమ విధానాన్ని తెలియచేయడానికి ఏపీలోని అధికార , ప్రతిపక్ష పార్టీలు ముస్లిం ప్రతినిధులతో ఒకే రోజు సమావేశం నిర్వహించాయి. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా వివిధ ముస్లిం సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అయితే రెండు పార్టీలూ తాము ఆ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పలేకపోయాయి. మైనార్టీలకు నష్టం కలగకుండా చేస్తామని హామీ ఇచ్చాయి. అయితే ఇతర పార్టీలు పూర్తి స్థాయిలో తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఒక్క ఏపీలోని రాజకీయ పార్టీలు మాత్రమే అటూ ఇటూ చెప్పకుండా నాన్చుతున్నాయి.
యూసీసీలో అసలు ఏమి ఉంటుందో తెలియదన్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లిం ప్రతినిధులతో సమావేశం పెట్టి కాస్త విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.అసలు యూసీసీలో ఏం ఉంటుందో ఎవరికీ తెలియదని.. ఇంకా డ్రాఫ్ట్ రాలేదన్నారు. అసలు యూసీసీలో ఏం ఉంటుందో తెలియకపోతే దేశంలో ఇంత చర్చ ఎందుకు జరుగుతుందన్నది అందరికీ వచ్చే మొదటి ప్రశ్న. అయితే ముస్లింలకు అండగా ఉంటామని.. వారికి అన్యాయం జరగనీయబోమని సీఎం జగన్ హామీ ఇచ్చారు. లా కమిషన్ అని ఇతర మార్గాల గురించి చెప్పారు.. కానీ మైనార్టీ ప్రతినిధులు గట్టిగా కోరుకునేది ఒకటే... ఆ బిల్లును వ్యతిరేకించడం. ఆ విషయంలో జగన్ నుంచి వారు గట్టి హామీ కోరుకున్నారు. ఎందుకంటే రాజ్యసభలో వైసీపీకి ఉన్న తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల బలం కీలకమని భావిస్తున్నారు. అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని జగన్ హామీ ఇవ్వకపోవడంతో ముస్లిం వర్గాలు సంతృప్తిగా ఉండే అవకాశం లేదు.
చంద్రబాబు కూడా గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పలేదు !
అదే సమయంలో చంద్రబాబు కూడా మస్లిం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ముస్లింల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటామని చంద్రబాబు చెప్పారని తెలిపారు. మతపరమైన విశ్వాసాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముస్లింలకు విరుద్ధంగా టీడీపీ ఏ నిర్ణయమూ తీసుకోబోదని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. కానీ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పలేదు. నిజానికి బిల్లును వ్యతిరేకించడం వల్ల కానీ స్వాగతించడం వల్ల కానీ టీడీపీ విషయంలో రాజకీయం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్నది ఒక్క సభ్యుడే. కానీ ముస్లింల మద్దతు కోసం అయినా గట్టిగా వ్యతిరేకిస్తామని చెప్పలేకపోయారు.
వ్యతిరేకిస్తామన్న కేసీఆర్ - బీజేపీ మిత్రపక్షం అన్నాడీఎంకే
ఇప్పటికే దేశంలోని అనేక పార్టీలు.. యూసీసీ విషయంలో తమ అభిప్రాయాన్ని నేరుగానే చెప్పాయి. తెలంగాణ సఎం కేసీఆర్ ఇది దేశాన్ని విభజించే చట్టమని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. చివరికి బీజేపీ మిత్రపక్షం.. ఎన్డీఏ కూటమిలో భాగం అయిన అన్నాడీఎంకే కూడా వ్యతిరేకిస్తామని చెప్పింది. అన్ని పార్టీలు క్లారిటీగా ఉన్నాయి కానీ.. ఏపీ రాజకయ పార్టీలు మాత్రం తేల్చి చెప్పలే్కపోతున్నాయి.
బీజేపీతో నొప్పింపక తానొవ్వక అన్న పద్దతిలో ఉండేందుకే ఈ రాజకీయం !
యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తే ఎక్కడ బీజేపీకి కోపం వస్తుందోనని ఏపీలోని రెండు పార్టీలు.. వ్యతిరేకిస్తామని గట్టిగా చెప్పలేకపోతున్నాయి. అలాగని వారి మద్దతు కోల్పోవడం ఇష్టం లేక.. వారి హక్కులను కాపాడతామని చెబుతున్నాయి. అయితే పార్లమెంట్ లో ఓటేయాల్సిన సందర్భం వస్తే మాత్రం వీరు తప్పించుకోలేరు. అనుకూలంగా ఓటేసినా.. బాయ్ కాట్ చేసినా.. బిల్లును సమర్థించినట్లే ముస్లిం వర్గాలు భావించే అవకాశం ఉంది. ఓ రకంగా రెండు పార్టీలకూ యూసీసీ బిల్లు పార్లమెంట్ లోనే అసలు పరీక్ష ఎదురు కానుంది. ్